Take a fresh look at your lifestyle.

మారిటోరియం కాలంలో.. వడ్డీ మాఫీకి కేంద్రం సంసిద్ధత

సుప్రీమ్‌ ‌కోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు
రుణగ్రహీతలకు భారీ ఊరట
‌బ్యాంకు రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. మార్చి నుంచి ఆగస్టు వరకు నెలవారి చెల్లించాల్సిన రుణాలపై కేంద్రం వడ్డీ మాఫీ చేయనుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలు, గృహరుణాలు, వాహన రుణాలు, క్రెడిట్‌ ‌కార్డుల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఫ్రొఫెషనల్‌ ‌రుణాలపై వడ్డీ మాఫీ కానుంది. ఈ మేరకు, మాజీ కంట్రోలర్‌ ఆం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ ‌రాజీవ్‌ ‌మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది. అయితే, ఆరునెలలపాటు అన్ని బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ చేస్తే, బ్యాంకులు కుప్పకూలిపోతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా అన్నిరకాల బ్యాంకు రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే సుమారు 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈ పరిణామం చాలా బ్యాంకుల మూలధనం మొత్తం కరిగి పోవడమే కాకుండా, బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కానీ, ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం..రుణగ్రహీత తాత్కాలిక నిషేధాన్ని పొందారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ ఉంటుందని చెబుతోంది. మారటోరియం సమయంలో కొన్ని రకాల రుణాలపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని కేంద్రం స్పష్టంచేసింది. ఆరు నెలల మారటోరియం కాలంలో రూ.2 కోట్ల వరకుగల రుణాలపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎంఎస్‌ఎంఈలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, క్రెడిట్‌ ‌కార్డు బకాయిలపై, వినియోగదారుల వస్తువుల ఈఎంఐలపై వడ్డీలను మినహాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ‌ద్వారా సుప్రీమ్‌ ‌కోర్టుకు వివరించింది. సమస్యకు వడ్డీ భారాన్ని భరించడమే ఏకైక పరిష్కారమని నిర్ణయించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నది. అయితే అన్ని రకాల రుణాలకు వడ్డీని చెల్లించాలంటే రూ.6 లక్షల కోట్లు భారం పడుతుందని, అది చాలా అధికమని, అందుకే రూ.2 కోట్లు ఆ లోపుగల రుణాలకే వడ్డీ చెల్లించాలని నిర్ణయించామని కేంద్రం తెలిపింది. మారటోరియం పీరియడ్‌ ‌రుణాలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు సమర్పించిన అఫిడవిట్‌ ‌రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రుణ గ్రహీతలకు వెసులుబాటు కలిగేలా ఏప్రిల్‌ ‌నుంచి సెప్టెంబర్‌ ‌వరకు ఆరు నెలలపాటు కేంద్రం మారటోరియం విధించింది. అయితే బ్యాంకింగ్‌ ‌సంస్థలు మారటోరియం సమయంలో బకాయిలపై వడ్డీలు లెక్కగడుతున్నాయి. ఈ నేపథ్యంలో విషయం కోర్టుకు చేరగా.. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా కేంద్రం అఫిడవిట్‌ ‌సమర్పించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply