Take a fresh look at your lifestyle.

తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర నిర్లక్ష్య వైఖరి

  • ఇక్కడి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం
  • పద్మశ్రీ లాంటి వాటికి రాష్ట్రంలో అర్హులు లేరా
  • జోగులాంబ ఆలయ అభివృద్ధికి దక్కని చేయూత
  • అసెంబ్లీ వేదికగా కేంద్రంపై సిఎం కెసిఆర్‌ ఆ‌గ్రహం

అద్భుతమైన జలపాతాలు రాష్ట్రంలో ఉన్నా 58 సంవత్సరాలు సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణను పట్టించుకోలేదని, ప్రమోట్‌ ‌చేయలేదని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదని, వారసత్వంలో వొచ్చిన పురాతన కోటలు, దోమకొండ కోట అప్పగిస్తామని చెబుతున్నారని, చారిత్రాక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని అన్నారు. రాష్ట్రంలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారని, పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాను అడిగానని, పదేపదే జరుగుతున్న వివక్షపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్టీ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తుందని సీఎం ధ్వజమెత్తారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయంపై మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సమాధానం ఇచ్చిన అనంతరం సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ..టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఎపిలో జరిగిన వివక్షనే ఇప్పుడు కూడా కేంద్రం అనుసరిస్తుందన్నారు. తెలంగాణ చాలా ఉజ్వలమైన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు..గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని అన్నారు. ఉమ్మడి ఏపీలో అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్‌ను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్డీఎస్‌ ‌మీద అన్యాయాన్ని నిలదీసేందుకు జోగులాంబ నుంచే మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేపట్టానని అన్నారు.

కృష్ణా, గోదావరి పుష్కరాల మీద కూడా ఉద్యమం చేశాను. తెలంగాణ లోని ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం. మగధ సామ్రాజ్యం ఎంత విశిష్టంగా, వైభవంగా ఉండేనో.. మన శాతావాహనుల చరిత్ర కూడా అంతే గొప్పది. నూతన పరిశోధకులు శాసనాలను వెలికితీస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి చారిత్రాకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎయిర్‌ ‌స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగాం. ఆరున్నర సంవత్సరాలు గడిచిపోతుంది. కేంద్రం కాలయాపన చేస్తుందని సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎంతకాలమో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. అంతకు ముందు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించిందని తెలిపారు.

ఈ దేవాలయం ఏఎస్‌ఐ ‌పరిధిలో ఉంది. పర్యాటకుల నిమిత్తం తెలంగాణ పర్యాటక శాఖ 16 కాటేజీలు, రెస్టారెంట్లను అందుబాటులోకి తెచ్చింది. యునెస్కో గుర్తింపు పొందడంతో..విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో వొచ్చే అవకాశం ఉంది. విదేశీ పర్యాటకుల నిమిత్తం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వాటర్‌ ‌స్పోర్టస్ అడ్వెంచర్‌ ‌కార్యక్రమాలు, కన్వెన్షన్‌ ‌సెంటర్‌, ‌థీమ్‌ ‌పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రామప్పకు సమీపంలో ఉన్న కట్టడాలను, చూడదగ్గ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురాతన కట్టడాలకు ప్రాచుర్యంలభించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో రూ. 7 కోట్లతో వసతి గృహాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రారంభానికి చివరి దశలో ఉన్నాయని, వారసత్వ కట్టడాలను పరిరక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌చెప్పారు.

Leave a Reply