కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: కేంద్రం నుంచి రావలసిన జీఎస్టీ పెండింగ్ నిధులు తెలంగాణకు 6,017 కోట్లరూపాయలు కాగా ఆంధ్రప్రదేశ్ కు 5,269 కోట్ల రూపాయలు. ఈ జీఎస్టీ పెండింగ్ నిధులు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకి ఇవ్వాల్సి ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలకి..కేంద్రం నుంచి అందాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ పన్ను(జీఎస్టీ) పెండింగ్ నిధులు అక్షరాలా 2,06,461 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. ఇందులో తెలుగు ప్రజలకి రావాల్సిన జీఎస్టీ పెండింగ్ నిధులు తెలంగాణ.. ఆంధ్ర కలిపితే 11,286 కోట్ల రూపాయలు.కేరళ సీపీఐ(ఎం) ఎంపీ ఎలమరం కరీం అడిగిన ప్రశ్నకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అందులో పై వివరాలు వెల్లడి అయ్యాయి. ఏప్రిల్-2020 నుంచి నవంబర్-2020 మధ్య కాలానికి సంబంధించిన జీఎస్టీ పెండింగ్ నిధులని కేంద్రం స్పష్టం చేసింది. ఇంతగా జీఎస్టీ నిధులు పెండింగ్ లో పడటానికి కారణం రాష్ట్రాలే అని కేంద్రం చెబుతున్నది. కరోనా విజృంభణ, లాక్డౌన్ కారణంగా రాష్ట్రాల నుంచి కేంద్రానికి రావాల్సిన జీఎస్టీ వసూళ్ళు ఆశించిన స్థాయిలో రాలేదని కేంద్రం చెబుతున్నది. ఈ కారణం వలన కేంద్రం, రాష్ట్రాలకి సరైన సమయంలో జీఎస్టీ నిధుల బకాయిలు చెల్లించడం కుదరలేదని మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేసారు. ఈ పెండింగ్ నిధుల్లో తెలంగాణకి రావాల్సినవి 6017 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 5,269 కోట్లు, కేరళకి 9497 కోట్ల రూపాయలు అని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర ప్రజలకి కేంద్ర జీఎస్టీ నిధులు బకాయిలు ఉండగా, అతి తక్కువగా సిక్కిం రాష్ట్ర ప్రజలకి బకాయి పడింది.సిక్కింకు కేవలం 48 కోట్ల రూపాయల జీఎస్టీ నిధులు మాత్రమే కేంద్రం బకాయి పడింది అని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గమనించాల్సింది ఏమనగా తెలుగు ఎంపీలు తెలుగు ప్రజలకి అందాల్సిన జీఎస్టీ నిధులు బకాయిల గురించి నిమ్మకు నీరెత్తి నోరు మెదపటం లేదు.. మరో వైపు.. సామాజిక వర్గీకరణపై తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికి 89 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి అందినట్టు సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. వర్గీకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకి మంత్రి రతన్ లాల్ కటారియా మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కేంద్రానికి అందిన ప్రతిపాదనల్లో ఓబీసీ కులాలకి సంబంధించినవి 88 ఉన్నాయని, ఎస్సీకి సంబంధించి ఒకేఒక్క ప్రతిపాదన అందినట్టు మంత్రి తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12 ప్రతిపాదనలు అందాయని అందులో ఓబీసీ నుంచి 11 ప్రతిపాదనలు, ఎస్సీలకి సంబంధించినవి ఒకటి ఉన్నది అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక కులానికి సంబంధించిన ప్రతిపాదనని సలహా నిమిత్తం జాతీయ వెనకబడిన కమిషన్ కి పంపించామని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని బుడగ జంగం సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో కలిపే విజ్ఞప్తిపై పూర్తి సమాచారం అందజేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. తెలంగాణలోని కటిక, అరె కటిక సామాజిక వర్గానికి గుర్తింపు (కంపిటెంట్ అథారిటీ)కి సంబంధించిన ప్రతిపాదనని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) తిరస్కరించినందున తాము కూడా పక్కనబెట్టినట్టు మంత్రి వెల్లడించారు.