Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్రాలు విఫలం

  • ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి
  • పేదల బతుకు పోరాటానికి మద్దతుగా ఉద్యమం
  • పేదలకు కనీసంగా నెలకు రూ.7500 జమ చేయాలి
  • కొరోనా టెస్టులు పెంచి, వైద్య సిబ్బందిని భర్తీ చేయాలి
  • ఉమ్మడి కార్యాచరణపై విపక్షనేతల చర్చ

కొరోనాను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విపక్ష నేతలు మండిపడ్డారు. ప్రజలంతా భయంతో బతుకు వెళ్లదీస్తుంటే ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. వివిధ పక్షాల నేతలు గురువారం హైదరాబాద్‌లో సమావేశమై తెలంగాణలో కొరోనా విజృంభణ, ప్రభుత్వ చర్యలపై చర్చించారు. ఈ సందర్బంగా టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం మాట్లాడుతూ ప్రజల బతుకు దెరువు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో అనేక అంశాలను ప్రతిపక్షాలుగా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అనేక వినతులు, విజ్ఞాపన పత్రాలను అందజేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని, అభద్రతా భావంతో ఉన్నారన్నారని తెలిపారు. మంచి వైద్యాన్ని అందిచడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. సీఎం సహాయక నిధికి ఎంత మొత్తంలో నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. చిన్న వ్యాపారాలు, కులవృత్తులు కుప్పకూలాయని, ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, జీతాలను ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 45ని అమలు చేయాలని కోదండరాం డిమాండ్‌ ‌చేశారు. అలాగే పేదలకు కనీసం నెలకు 7500 రూపాయలను అందచేయాలన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి టెస్టులను పెంచాలని, ఆస్పత్రుల్తో సిబ్బంది కొరతను తీర్చాలని అన్నారు. కోవిడ్‌ ‌నేపథ్యలో అవసరమైతే బాండ్స్ ‌ద్వారా డబ్బులు వసూలు చేసి ప్రజలను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆగమేఘాలపై సచివాలయాన్ని కూల్చివేయాలన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడడంపై లేదని విమర్శించారు.

కోవిడ్‌ ‌ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కరోనాను అసలు పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. కొరోనా కిట్స్ ‌కార్పొరేటర్ల చేతిలో ఉండడం దారుణమని చెప్పారు. ప్రజలను బతికించుకునేందుకు అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తామని వెంకట్‌ ‌రెడ్డి ప్రకటించారు. కొరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మాత్రం ఫామ్‌ ‌హౌస్‌లో తలదాచుకున్నారని టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌ ‌రమణ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌లో పలువురికి కరోనా సోకినా పట్టించుకోలేదని విమర్శించారు. పేదలు వైద్యం చేయించుకునేందుకు కనీసం ప్రభుత్వ హాస్పిటల్‌లో కూడా అవకాశం లేదని రమణ చెప్పుకొచ్చారు. ప్రజలకు కొరోనా వైరస్‌ ‌సోకితే అందరినీ గాంధీ హాస్పిటల్‌కి తరలిస్తే.. టీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు మాత్రం ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందడం సిగ్గుచేటు అని రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సీఎం కేసీఆర్‌ ‌లాలూచి పడ్డారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, సీఏఏ, నూతన విద్యుత్‌ ‌బిల్లును వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యక్ష ఉద్యమంలోనికి మాత్రం రావడం లేదని, మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కొరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించినప్పటికీ కేసీఆర్‌ ‌ప్రశ్నించలేదన్నారు. కోవిడ్‌ ‌నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు ప్రకటించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. కోవిడ్‌ ‌కేసుల వరకైనా ప్రైవేటు హాస్పిటళ్లను ప్రభుత్వం నియంత్రించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాజకీయ సౌలభ్యం మేరకే కేంద్రం లాక్‌ ‌డౌన్‌ ‌విధించిందని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కరోనాపై ప్రజలకు అండగా తామంతా ఉమ్మడిగా ఉద్యమిస్తామని విపక్ష నేతలు ప్రకటించారు.

Leave a Reply