Take a fresh look at your lifestyle.

ఆహార భద్రత పథకంలో తెలంగాణ పై వివక్ష..!

  • మిగతా రాష్ట్రాల కంటే తక్కువగా నిధుల విడుదల
  • స్పష్టం చేస్తున్న కేందప్రభుత్వ గణాంకాలు
  • గొంతు విప్పని తెలంగాణా ఎంపీ లు

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ: ఆహార భద్రత పథకంలో తెలంగాణకి వివక్ష జరుగుతున్నది.కేంద్రం మిగతా రాష్ట్రాల కంటే తక్కువగా ఈ విషయంలో తెలంగాణాకి నిధుల విడుదల చేస్తున్నది. జాతీయ ఆహార భద్రత పథకం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోంది. 2016-17 నుంచి 2020-21 మధ్య తెలంగాణకు కేటాయించిన నిధుల కంటే చాలా తక్కువగా నిధులు విడుదల అయ్యాయి అని కేందప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఎంపీ రితి పతక్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌ ‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆహార పంటల ఉత్పత్తి పెంచేందుకు 2007-2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకం తీసుకువచ్చింది.

తెలంగాణ రాష్ట్రానికి 2016-17 41.89 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 8.29 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. 2017-18 సంవత్సరంలో 51.11 కోట్ల రూపాయలు కేటాయిస్తే 19.34 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల అయ్యాయి. 2018-19లో 34.27 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే 9.61 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 2019-20లో 32.65 కోట్ల రూపాయలు కేటాయిస్తే 15.05 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేందప్రభుత్వం 2020-21లో 28.04 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని గణాంకాలు స్పష్టంగా తెలుపుతున్నాయి ఈ విషయంపై తెలంగాణ ఎంపీలు నిమ్మకు నీరెత్తి కూర్చుని ఉండటం శోచనీయం.

Leave a Reply