Take a fresh look at your lifestyle.

విద్యుత్‌ ‌సంస్థల ప్రైవేటీకరణ కేంద్రం కుట్ర

  • స్టాండర్డ్ ‌బిడ్డింగ్‌ ‌డాక్యుమెంట్‌ను ఉపసంహరించుకోవాలి
  • రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికుల నిరసన

‌విద్యుత్‌ ‌సంస్థల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదనీ, ఇందులో భాగంగా రూపొందించిన స్టాండర్డ్ ‌బిడ్డింగ్‌ ‌డాక్యుమెంట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్‌ ‌చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం విద్యుత్‌ ‌రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యుత్‌ ‌కార్యాలయాలు, సంస్థల ముందు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్‌లోని విద్యుత్‌ ‌సౌధ వద్ద ఉద్యోగులు భారీ సంఖ్యలో ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ ‌రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలనీ, స్టాండర్డ్ ‌బిడ్డింగ్‌ ‌డాక్యుమెంట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ‌సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ విద్యుత్‌ ‌సంస్థలను ప్రైవేటుపరం చేస్తే విద్యుత్‌ ఉద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. లాభాలలో ఉన్న విద్యుత్‌ ‌సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా కేంద్రం సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆదానీ, అంబానీలకు విద్యుత్‌ ‌సంస్థలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ‌విద్యుత్‌ ‌బిల్లును తీసుకొస్తున్నదని ఆరోపించారు. విద్యుత్‌ ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త పింఛన్‌ ‌విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ ‌విధానాన్నే అమలు చేయాలని ఈ సందర్భంగా విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పేర్కొన్నారు.

Leave a Reply