Take a fresh look at your lifestyle.

వ్యాక్సినేషన్‌కు కేంద్రం మార్గదర్శకాలు

జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌ ‌పురోగతి ఆధారంగా కేటాయింపు
టీకా వృథా చేసిన రాష్ట్రాలకు పంపిణీలో కోత

జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక నుంచి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు జనాభా, కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్‌ ‌పురోగతి ఆధారంగా టీకాలను పంపిణీ చేయనున్నారు. వృథా ఎక్కువగా ఉంటే ఇవ్వబోయే టీకాల సంఖ్యలో కోత ఉంటుందనీ హెచ్చరించింది. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా టీకా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజే ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

పలు రాష్ట్రాల్లో టీకాల వృథా ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం చెబుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. జార్ఖండ్‌లో అత్యధికంగా 37 శాతం టీకాల వృథా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చత్తీస్‌గఢ్‌ (30 ‌శాతం), తమిళనాడు (15.5 శాతం), జమ్ముకశ్మీర్‌ (10.8 ‌శాతం), మధ్యప్రదేశ్‌ (10.7 ‌శాతం) ఉన్నాయి. టీకాల్ల వృథాలో జాతీయ సగటు 6.3 శాతం కాగా.. ఈ రాష్ట్రాలు అంతకన్నా ఎక్కువగా వృథా చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. జనాభా, కొరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. వృథాను బట్టి రాష్ట్రాలకు టీకా కేటాయింపుల్లో కోత విధిస్తామని కేంద్రం పేర్కొంది. దేశంలో కొరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి.

అయితే వైరస్‌ ‌కట్టడికి టీకా ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. అన్ని హాస్పిటళ్లకు సమానంగా టీకా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది. ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు కావాల్సిన డోసుల వివరాలను రాష్ట్రాలే ఇవ్వాలని తెలిపింది. పేదలు ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో టీకా వేయించుకోవడం కోసం ఈ-వోచర్లు ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది.

18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ టీకాలు ఇస్తున్న నేపథ్యంలో వీళ్లలో ప్రాధాన్యతా క్రమం నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే ఉంటుంది. టీకాల ఉత్పత్తిని పెంచడానికి, కొత్త టీకాలను ప్రోత్సహించడానికి మొత్తం ఉత్పత్తిలో 25 శాతం నేరుగా ప్రైవేటు హాస్పిటల్స్‌కు అమ్ముకునే అవకాశం తయారీదారులకు కల్పించారు. ప్రైవేటు హాస్పిటల్స్‌కు అమ్మే ధరను ప్రతి టీకా తయారీదారు ప్రకటించాలి. అందులో మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయాలి. ప్రైవేటు హాస్పిటల్స్ ‌గరిష్ఠంగా సర్వీస్‌ ‌చార్జీల రూపంలో రూ.150 వసూలు చేయాలి. ఈ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించవొచ్చు.

Leave a Reply