Take a fresh look at your lifestyle.

తీవ్రతను అంచనా వేయడంలో కేంద్రం వైఫల్యం

వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతులు గడిచిన వారం రోజులుగా సాగిస్తున్న ఆందోళనతో కేంద్రం దిగి వొచ్చినట్టే కనిపిస్తోంది. రైతులు కోరుతున్నట్టుగా వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే, సవరణలకు ఒప్పుకోమనీ, కొత్త వ్యవసాయ చట్టాన్ని తేవల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిషన్ ను ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులు నోటి మాటతో హామీలను నమ్మలేమనీ, లిఖితపూర్వక హామీలు ఇవ్వాలని కోరుతున్నారు.అందుకు కూడా కేంద్రం అంగీకరించింది. రైతుల కోరుతున్న అంశాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) ముఖ్యమైనది. దీని విషయంలో కేంద్రం రైతుల కోరిన మేరకు హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రైతుల ఆందోళన ఇంత పెద్దది కావడానికి వారి డిమాండ్ల విషయంలో కేంద్రం ఉదాసీన వైఖరిని అనుసరించడమే కారణం. ప్రభుత్వం ముందే రైతు సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించి వారి అనుమానాలను తొలగించి ఉంటే ఢిల్లీ చలో కార్యక్రమాన్ని వారు చేపట్టి ఉండేవారు కారు.

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఏకపక్షమైనవేనని ఇప్పుడు మరోసారి రుజువైంది. పన్నుల్లో సంస్కరణల మాదిరిగానే, ఇప్పుడు వ్యవసాయ రంగంలో సంస్కరణలను తీసుకుని వొచ్చేందుకు ప్రభుత్వం ఆత్రుతనూ, అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.అయితే, రైతులంతా ఏక తాటిపై నిలిచి తమ సత్తా ఏమిటో రుజువు చేశారు. రైతుల ఆందోళనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు ప్రకటించడాన్ని మన ప్రభుత్వం తప్పు పట్టింది. ఇప్పుడు బ్రిటిష్ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. వీరంతా భారత దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో కాకుండా, రైతులకు సంఘీ భావం తెలపాలన్న ఉద్దేశ్యంతోనే మద్దతు ప్రకటించారు. తరతరాలుగా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న చిన్న, మధ్యతరహా రైతులకు అన్యాయం జరగరాదన్న ఉద్దేశ్యంతోనే మద్దతు ఇస్తున్నట్టు బ్రిటిష్ ఎంపీలు ప్రకటించారు. పంజాబ్ రైతులకు విదేశాల నుంచి సౌహార్దం లభించడానికి కారణం చాలా కాలం క్రితమే పంజాబ్ కి చెందిన వారు అక్కడ స్థిర పడి ఆయా దేశాల వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పాలు పంచుకుంటున్నారు. కెనడాలో అయితే, పంజాబీలు అధికారంలో పాలు పంచుకుంటున్నారు.

modi about new agricultural law

హర్జిత్ సజ్జాన్ అనే సిక్కు జాతీయుడు కెనడా రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పంజాబీలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వ్యాపార పారిశ్రామికరంగాల్లో రాణిస్తున్నారు.అందుకే, వారి ఆందోళనకు అక్కడి నుంచి మద్దతు వెల్లువలా వెలువడుతోంది. పంజాబ్ రైతుల ఆందోళనను కేంద్రం రాజకీయ కోణంలో చూసింది. అక్కడ అధికారంలో ఉన్న అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోద్బలంతోనే ఈ ఆందోళన జరుగుతోందన్న అనుమానంతో కేంద్రం చాలా కాలం పట్టించుకోలేదు. ఇందులో నిజం లేకపోలేదు.అయితే., పూర్తిగా కాంగ్రెస్ మద్దతు వల్లే ఈ ఆందోళన ఇంత ఉవ్వెత్తున సాగుతోందనుకుంటే పొరపాటు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ అయిన అకాలీదళ్ దీనికి మద్దతు ఇస్తోంది. అకాలీదళ్ బీజేపీకి మిత్ర పక్షమే. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎన్ డిఏ నుంచి బయటికి వొచ్చింది. కేంద్ర మంత్రి పదవిని ఆ పార్టీ ప్రతినిధి సిమ్రజిత్ కౌర్ వదులు కున్నారు.

వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థపై పంజాబ్ ఆధారపడి ఉంది. అక్కడ రైతులకు రుణాలిచ్చే వారే వారి వద్ద పంటలు కొనుగోలు చేస్తారు. పంజాబ్ ప్రభుత్వానికి ఈ వ్యాపారుల ద్వారా గత ఏడాది మూడువేలు పైగా ఆదాయం వచ్చింది.అందువల్ల అంత ఆదాయాన్ని వదులుకోవడానికి ఏ ప్రభుత్వము సిద్ధ పడదు. కేంద్రం రాష్ట్రాల ఆదాయానికి కత్తెర వేస్తుండటాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వస్తు, సేవల పన్నుల ద్వారా వచ్చే రాబడిలో రాష్ట్రాలకు తగిన రీతిలో పరిహారాన్ని చెల్లించడం లేదు.దీనిపై రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కొరోనా కారణంగా కాస్తంత నెమ్మదించినా, రాష్ట్రాలు ఈ విషయమై తమ డిమాండ్ ను విడిచి పెట్టలేదు. అలాగే, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్ రైతులే ,. వారిలో అసంతృప్తి పేరుకుని పోవడానికి ఇదొక కారణం. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఫెడరల్ వ్యవస్థకు పెనువిఘాతాన్ని కలిగిస్తున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పలు సందర్భాల్లో ఆరోపించారు.అందుకే,ఆయనే ఈ రైతుల ఆందోళనను ప్రోత్సహిస్తున్నారేమోననుకుని కేంద్రం ఉదాసీనతను వహించింది.

కొరోనానీ, చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది రైతులు ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళన పరిష్కారానికి మంత్రుల కమిటీ ఉద్యమ నాయకులతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో ప్రధానమంత్రి మోడీ శనివారం మధ్యాహ్నం సీనియర్ మంత్రులతో చర్చలు జరిపి రైతుల డిమాండ్లలో కొన్నింటిని సానుకూలంగా పరిశీలించేందుకు అంగీకరించారు. ప్రైవేటు మండీలకు రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించేందుకు కేంద్రం అంగీకరించినట్టు సమాచారం. కేంద్రం దిగిరాకపోతే ఈనెల 8వ తేదీన భారత్ బంద్ నిర్వహించేందుకు రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. కేంద్రంలో కదలిక రావడానికి ఇదే కారణం. రైతుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ బంద్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతుల పోరాటానికి దేశంలోని ట్రేడ్ యూనియన్లు మద్దతును ప్రకటించాయి. అందువల్ల భారత్ బంద్ సంపూర్ణం అవుతుందన్న బెదురు ప్రభుత్వంలో ఉంది.

Leave a Reply