- వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నది
- బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
- కాంగ్రెస్,బిజెపిల పాలనా తీరుపై మండిపడ్డ సిఎం కెసిఆర్
కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్రమాదకరమని, ఈ బిల్లును పార్లమెంట్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర బిల్లు రాష్ట్రాల హక్కులు హరించేదిగా. సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టులాగా ఉందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. గతంలో తాను విద్యుత్ సమస్యపైనే తెలంగాణ జెండా ఎత్తానని, ఇందిరాపార్క్ వద్ద పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోసం చేసిన ధర్నాలు మరచిపోగలమా అని అన్నారు. స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్చలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. దీనిని ప్రతి రాష్ట్రం వ్యతిరేకిస్తోందన్నారు. తాను అందరు సిఎంలతో మాట్లాడానని అన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంది. కానీ చెన్నైలో తాగునీటికి అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే దృక్పథం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేకుండా పోయింది. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. పుష్కలంగా సరిపోయే నీరు ఉన్నా.. సాగుకు నీరుఇవ్వలేదు. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్ల పైనే ఉంది. ఇప్పటి వరకు 2 లక్షల 16 వేల మెగావాట్లు మాత్రమే దేశంలో వాడారు.
దేశ ప్రగతి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాలనే ఆలోచన లేదు. కేంద్ర విద్యుత్ చట్టాన్నితాము పార్లమెంట్లో వ్యతిరేకిస్తామన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రాల హక్కలు హరించారు అని సీఎం ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం చాలా ప్రమాదకరంగా ఉందని నమూనా బిల్లు కూడా పంపించారు. ఈ నేపథ్యంలోనే తాను కేంద్రానికి లేఖ రాశాను. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని పరిపాలించే విధానంలో.. అంబేడ్కర్, ఇతర గొప్ప వ్యక్తులు ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. రాష్ట్రాల లోడ్ సెంటర్లు అన్నీ కేంద్రం వద్దకు వెళ్తాయన్నారు. విద్యుత్ రంగం ప్రభుత్వం వద్ద ఉంటే డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కో అభివృద్ధి చెందుతాయి. ఈ సంస్థలు లేకుండా వేల ఉద్యోగాలు పోతాయి. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వస్తాయి. ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారు. కేంద్ర విద్యుత్ చట్టం వస్తే ఈఆర్సీ నియామకాలు తమ చేతిలో ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకుమీటర్ పెట్టాల్సి వస్తుందన్నారు. కొత్త మీటర్ కోసం రూ. 700 కోట్లు కావాలన్నారు. మీటర్ రీడింగ్ తీస్తారు.. బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తారు. తన చిన్నప్పుడు బిల్లు కలెక్టర్ ను చూస్తే రైతులు ఎంతో భయపడేవారు. రాష్ట్రంలోని 26 లక్షల బోర్లకు మీటర్ పెట్టేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు,నలుగురు ఎంపిలు, ఓ కేంద్రమంత్రి ఒప్పుకుంటారా? అని సీఎం ప్రశ్నించారు.