Take a fresh look at your lifestyle.

కరోనా కాటుకు మందు పెట్టని కేంద్ర బడ్జెట్

దాదాపు 11 నెలలుగా ప్రపంచమంతా కోవిడ్ ధాటికి ఆర్థికంగా, సామాజికంగా, అతలాకుతలం ఐన విషయం తెలిసిందే. అందులో అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం కరోనా ధాటికి ప్రధానంగా ఆర్థికపరంగా కుదేలైందని అందరికి తెలుసు. లాక్ డౌన్ పరిణామాల వల్ల దేశంలోని కుటీర, భారీ అని తేడాలేకుండా మొత్తం పారిశ్రామిక రంగం డిమాండ్ మరియు సప్లై షాక్ వల్ల భారీగా కుదుపులకు లోనైంది . ఆ తరువాత దేశంలోని సగానికంటే ఎక్కువ ప్రజలు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి నెట్టబడ్డారు.

వలస కార్మికులు నేటికీ ఇంకా పూర్తిస్థాయి ఉపాధిని పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. టూరిజం రంగం ఈ రోజువరకు ఇంకా కరోనా కాటుకు ఇబ్బంది పడుతూనే ఉంది. వీటితోపాటు ఆటో మొబైల్, వినోదం, రవాణా , మొదలగు రంగాలు కోవిడ్ బాధితులుగా మిగిలిపోయాయి, ఇప్పుడిప్పుడే కోవిడ్ భీభత్సం నుంచి కోలుకుంటున్న ప్రతి వ్యక్తి, వ్యవస్థ, రంగం కేంద్రం ప్రకటించే 2021-22 బడ్జెట్ కై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు . చాలామంది ఏదో జరగబోతుంది, ఎంతో కొంత ఉపశమనం లభించబోతుందన్న భారతావనికి నిర్మలా రామన్ ప్రవేశ పెట్టిన కాగిత రహిత బడ్జెట్, తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు. ఈ బడ్జెట్ లో సామాన్యుడి కొనుగోలు శక్తి పెంచేందుకు ఏ రకమైన ప్రయత్నం జరుగలేకపోగా, ఆదాయపన్ను పరిమితి లో మినహాయింపు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

 

బడ్జెట్ లో సింహభాగం ఫార్మా, వైద్య రంగానికి కేటాయింపులు చేయడం ఆశ్చర్యమేమీ కాదు, ఎందుకంటే వైద్యరంగానికి జనాభాకనుగుణంగా కేటాయింపులు ఎప్పటినుంచో జరగాల్సి ఉంది, కరోనా పుణ్యమా అని మరియు విమర్శలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఈ కేటాయింపు జరిగిందని స్పష్టం అవుతుంది. ఇక, లాక్ డౌన్ వల్ల రాష్ట్రాల ఖజానాకు గండిపడగా, రాష్ట్రాలను ఆర్థికంగా బలపరిచే చర్యలు కేటాయింపులు ఈ బడ్జెట్ లో జరగకపోవడం శోచనీయం. , ఆర్థిక సహాయం అడిగిన ప్రతిసారి ఎఫ్ ఆర్ బి ఎం అస్త్రం రాష్ట్రాలపై ప్రయోగించిన మోడి సర్కార్ బడ్జెట్ లో కూడా అప్పులు చేసుకొని ఇల్లు చక్కదిద్దుకోమని చెప్పింది.

కానీ ఎన్నికలు జరుగబోయే పశ్చిమ బెంగాల్ , తమిళనాడు మొదలగు రాష్ట్రాలకు ఏదో ఒక పద్దు సాకుతో భారీ మొత్తంలో నిధులు కేటాయించి కేంద్రం వార్షిక బడ్జెట్ ను కాస్త ఎన్నికల బడ్జెట్ గ మార్చేసింది. ఇక ఆర్ధికమంత్రి ఉపయోగించిన క్రొత్త పదం ఆరు సూత్రాలు – వైద్య, ఆరోగ్య రంగం భౌతిక మరియు ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి,మానవ వనరులు,నైపుణ్య అభివృద్ధి, ఇన్నోవేషన్ అండ్ ఆర్ & డి , కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన.

- Advertisement -

ఈ స్థంబాలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశాలు అయినప్పటికీ ప్రభుత్వ వ్యయం తగినంత స్థాయిలో లేదు. కానీ, ఈ ఆరు కూడా స్టాక్ మార్కెట్ ను మురిపించాయని చెప్పవచ్చు. ఇక, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు , భీమా సంస్థలు , చమురు సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటైజషన్ వచ్చే సంవత్సరానికల్లా పూర్తిచేస్తామని ప్రకటించి విదేశీ పెట్టుబడిదారులకు స్వాగతం పలుకబోతున్నారు. ఇక అగ్రి సెస్ తో వినియోగదారులకు భారం ఉండదని, మౌళిక వసతుల అభివృద్ధికి కొన్ని వ్యవసాయ ఉత్ప్పత్తుల పై సెస్ విధిస్తున్నామని చెప్పిన దాని ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. బ్యాంకింగ్ రంగం లోని మొండి బకాయిల నిర్మూలనకు బ్యాడ్ బ్యాంకింగ్ పద్ధతి ఏవిదంగా పనిచేస్తుందో చూడాలి.

గణాంకాలను పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ద్ర‌వ్య‌లోటు అంచ‌నా 9.5 శాతంగా ఉండగా, 2021-2022లో ద్ర‌వ్య‌లోటును 6.8 శాతానికి ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ద్ర‌వ్య‌లోటును ప్ర‌భుత్వ అప్పుల ద్వారా భ‌ర్తీకి ప్ర‌య‌త్నాలు చేయనున్నారు. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 ల‌క్ష‌ల కోట్లు అప్పులు తేవాల‌ని నిర్ణయించారు. ఈ 2 నెల‌ల్లో ఇంకా రూ. 80 వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంది.

2025-26 నాటికి ద్ర‌వ్య‌లోటును 4.5 శాతం లోపు ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యం. దీనిని బట్టి ఆదాయ పెంపు చర్యలకంటే రుణాల సమీకరణకు ఎక్కువ మ్రొగ్గు చూపుతుందని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి ఈ బడ్జెట్ లో కొన్ని నూతన అంశాలకు చోటు ఇచ్చినప్పటికీ, దేశ ఆర్థిక రికవరీ” వి ” షేప్ లో తీసుకెళ్ళే దిశగా కేటాయింపులు జరుగకపోగా, కరోనా చేసిన గాయానికి సగటు మనిషికి ఈ బడ్జెట్ ఎటువంటి మందు ఇవ్వలేదనే చెప్పాలి.

Leave a Reply