Take a fresh look at your lifestyle.

బడుగులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

‘‘‌పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇం‌టర్మీడియెట్‌ ‌కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి.’’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. కానీ బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేని కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేనందువలన రిజర్వేషన్లను ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై సర్వోన్నత న్యాయస్థానం గత వారం కీలక తీర్పును వెలువరించింది. ఈడబ్ల్యూఎస్‌ ‌కోటాను సమర్ధించిన విస్తృత ధర్మాసనం ఇది వివక్ష కాదని, రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చదని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ ‌కోటా రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ ‌పరిమితిని ఉల్లంఘించదని పేర్కొంది. కోటాను సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లు ఈ మేరకు ధర్మాసనం కొట్టివేసింది. ఆర్థికంగా వెనుబడిన వర్గాలను విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 సాధారణ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్రం పేర్కొంది.

కేవలం ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంలో ఆఘమేఘాల మీద చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా బిసి జనగణన ఇంతవరకు చేపట్టలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకమని వీరి చర్యలవల్ల తెలుస్తున్నది. పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇం‌టర్మీడియెట్‌ ‌కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి. గత దశాబ్ద కాలంగా నిరుద్యోగుల బ్రతుకుల్లో దారిద్యం తాండవిస్తుంది. దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతోందన్నారు, చదువుకున్న వారు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు లాభాలలో నడిచే సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అంటగడుతున్నారు. ఇక ఇన్సూరెన్స్, ‌బ్యాంకింగ్‌ ‌రంగాలు దివాళా తీశాయి. ఆర్థికరంగం నిరాశాజనకంగా ఉగిసలాడుతుంది. ఆఖరికి రక్షణ రంగంలో కూడా హెచ్‌ఏఎల్‌ ‌ను మూసివేసి రాఫెల్‌ ‌యుద్ధ విమానాలు కొనుగోలు చేసారు, ఈమధ్య షార్‌ ‌లో ప్రైవేటు రాకెట్‌ ‌ప్రయోగాలు చేస్తున్నారు. ఉన్న పరిశ్రమలు నష్టాల బాటలో ఉంటే నూతన పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇసుక, భూదందాలకు, ధరణి పోర్టల్‌ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. ఎంతో ఆర్భాటంగా బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రకటించి మూడు సంవత్సరాలవుతుంది. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 56 కార్పొరేషన్లు సృష్టించి 728 చైర్మన్‌, ‌డైరెక్టర్ల పదవులను ఎవరి కులపరిధిలో వారికి ఇవ్వడం జరిగింది .

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, ఛైర్మన్‌, ‌డైరెక్టర్‌ ‌పదవుల్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతున్న వాస్తవానికి చాల జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కులాల పుట్టుక, జీవన శైలి, సామాజిక స్థితిగతుల గురించి ఏమాత్రం తెలియని వారు కార్పొరేషన్ల క్రియాశీలక సభ్యులను ఏర్పాటు చేస్తే ఇలా అఘోరిస్తాయి. రెడ్డి కులానికి మాత్రం రాష్ట్రంలో ఉన్న కీలకమైన పదవులను, రాష్ట్ర సంపద లభించే పదవులను ఇచ్చుకోవడంతోపాటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, హైకోర్టు జిల్లా కోర్టుల జీపీలను, స్కిల్‌ ‌డెవలప్మెంట్‌, ఇం‌డస్ట్రియల్‌ ఇ‌న్ఫ్రా స్ట్రక్చర్‌ , ‌సమాచార కమిషనర్ల, సలహాదారులు అంతా రెడ్లే. ఇది అంతా చూస్తే రాష్ట్రంలో వైసీపీ రెడ్డి కులం కోసమే అధికారంలోకి వచ్చిందా?అనే భావన కలుగుతుంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న శాఖలు, ఆదాయ వనరులున్న శాఖల నామినేటెడ్‌ ‌పదవులు రెడ్డి సామజిక వర్గానికి 720 పైగా ఇచ్చి వాటిని సమాజానికి తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో భాగమే. విద్య, ఆరోగ్యం, ప్రాజెక్టులు, స్కిల్‌ ‌డెవెలప్మెంట్‌, ‌మీడియా, టెంపుల్‌ ‌కమిటీలు, మార్కెట్‌ ‌కమిటీలు, విశ్వవిద్యాలయాల పాలకమండలి సభ్యులు, రాయలసీమ, కోస్తా , ఉత్తరాంధ్ర ఇంచార్జులు, స్థానికంగా ఉన్న రేషన్‌ ‌షాపులు, ఆహార పంపిణీ , వంట ఏజెన్సీ, డిష్‌, ‌కేబుల్‌ ‌నెట్‌, ‌రవాణా ఏజెన్సీ , కస్టమర్‌ ‌హైరింగ్‌ ‌సెంటర్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ ‌చైర్మన్లు అది ఇది అని కాదు లాభం వచ్చే అన్ని రంగాల్లో ఈ కులస్తులు తిష్టవేశారు. బీసీ కులాల అభివృద్ధికి పాటు పడుతున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వలు, ఆచరణలో ఈ కులాల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది. సమాజం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజల్లో కూడా దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో మెకనైజేషన్‌ ‌పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.

ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు-చేతివృత్తులు తమ ఆస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ- కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్‌-, ఐరన్‌ ‌పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్‌ ‌పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. ట్రాక్టర్లు-సా మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. డ్రై క్లీనింగ్‌ ‌షాపులు వల్ల చాకలి, నేత మిల్లులు రావడంతో నేత వృత్తి, బ్యూటీపార్లర్లు, హేర్‌ ‌కటింగ్‌ ‌సెలూన్ల రాకతో మంగళి, రెడీమేడ్‌ ‌దుస్తులతో దర్జీలు, జ్యూయెలరీ షాపులతో విశ్వ బ్రాహ్మణుల వృత్తులు దెబ్బతిన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు మూడేళ్ళుగా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. కులాల సమస్యలపై అవగాహన ఉన్న వారు తమకు కావలిసిన పథకాలను డిజైన్‌ ‌చేయగలరు, కానీ కార్పొరేషన్ల చైర్మన్‌, ‌డైరెక్టర్ల నియామకం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్న వారికి ఇచ్చారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు. కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగుతుంది. మిగతా కులాలకు ఎంబీసీ కార్పొరేషన్‌ ‌ద్వారా, సంచార జాతుల కార్పొరేషన్‌ ‌ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటే ఈ కులాల్లో సమగ్ర అభివృద్ధికి పునాదులు పడతాయి. యాంత్రీకరణతో కార్పొరేట్‌ ‌ప్రాబల్యం పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బతో కుల వృత్తులు-చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. కరోనా కల్లోలంతో దెబ్బతిన్న కుల వృత్తుల కుటుంబాలకు కుల వృత్తులు-చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తామనే ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి రావడం లేదు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా, బీసీలకు రూ.లక్ష- రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు.

కానీ, బడా కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలు ఇస్తున్నారు. వారు వాటిని కట్టకపోతే మాఫీ చేస్తున్నారు. పేదలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా బ్యాంకులు తమ వైఖరి మార్చుకుని బీసీలకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి. అందుకు బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారుకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తమ హక్కుల కోసం ఈ కులాలు ఉద్యమం చేయడం తప్పదు. వెనుకబడిన తరగతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి,అలాగే బడ్జెట్‌ ‌కేటాయింపులు లక్ష కోట్లకు తక్కువ కాకుండా బడుగుల జీవితాలు మార్చాలి. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసిన, అధిక ద్రవ్యోల్బణం, గరిష్ట స్థాయికి నిరుద్యోగం, ప్రజాస్వామ్యం అణచివేత, విద్వేష రాజకీయాలు, రూపాయి విలువ భారీగా పతనం కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ సమాజంలో విభజన దేశ భద్రతలో వైఫల్యం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సహనం, అదఃపాతాళానికి ఆర్థిక ప్రగతి అన్ని రంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. దేశ సంపద సృష్టించడంలో, దేశాన్ని నిర్మించడంలో వెనుకబడిన కులాల పాత్ర శ్లాఘించి తగ్గదు. ఇలాంటి వెన్నెముక కులాల సంక్షేమం విస్మరిస్తే దేశ భవిష్యత్తు అధోగతే..
– డా. ముచ్చుకోట సురేష్‌ ‌బాబు,
అధ్యక్షులు, గౌతమ్‌ ‌బుద్ధ అభివృద్ధి సమాఖ్య.

Leave a Reply