Take a fresh look at your lifestyle.

కేంద్ర, రాష్ట్రం మధ్య నిధుల పంచాయితీ

central govt vs telangana govt

కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల పంచాయితీ చాలాకాలంగా కొనసాగుతోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత ఆరేళ్ళుగా ఈ విషయంపై తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. కేంద్రం నిధుల విడుదలలో తమ రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తెలంగాణ, ఏపి రాష్ట్రాలు ఆరోపిస్తుంటే, నిధులు తీసుకుని కూడా అబద్దాలాడుతున్నాయని కేంద్రం ప్రతివిమర్శలు చేస్తుండడం సహజమైపోయింది. అయితే తాజాగా కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ ‌పార్లమెంటు సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాలను ఆర్థికంగా ఏ విధంగా ఆదుకున్నది రాతపూర్వకమైన వివరణ ఇవ్వడంతో ఇక ఈ వివాదానికి ముగింపు పలుకుతుందని బిజెపి వర్గాలు భావిస్తున్నా, టిఆర్‌ఎస్‌నుంచి ఇంకా దీనిపై ఎలాంటి స్పందన కనిపించడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు విభజన ఒప్పందాల ప్రకారం కేంద్రం ఇరు రాష్ట్రాలకు అందించాల్సిన ఆర్థిక సహకారంకాని, ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన కొన్ని సంస్థలపట్లగాని పెద్దగా శ్రద్ద చూపించడంలేదన్న ఆరోపణ చాలాకాలంగా ఉంది. దీనిపై ఇరురాష్ట్రాల నాయకులు అటు అధికార పక్షంగాని, ప్రతిపక్ష నాయకులుగాని తరుచు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విచిత్రమైన విషయమేమంటే ఈ రెండు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రం తమకు అన్యాయం చేస్తోందని అనడమేగాని, కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునే పరిస్థితిలోలేవు. లోపాయికారిగా ఈ రెండు ప్రభుత్వాలుకూడా కేంద్రంతో సాన్నిహిత్యాన్నే కోరుకుంటున్నట్లు అర్థమవుతున్నది. కాని, కేంద్రం ఆలోచనలు వేరే తీరుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తెలంగాణ విషయానికొస్తే ఈ రాష్ట్రాన్ని కబళించాలన్న ఆలోచన చాలాకాలంగా బిజెపి మనస్సులో ఉంది. ఏడాదిక్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లోనే ఇక్కడ కాషాయ జెండా పాతాలన్న లక్ష్యంగా పోరాడింది. కాని, తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా పట్టులేకపోవడంతో అది సాధ్యంకాలేదు.

ఈ సందర్భంగా ఆ పార్టీ కేంద్రనాయకులు వరుసగా తెలంగాణలో తమ పార్టీ తరఫున విస్తృత ప్రచారంచేశారనే కంటే ఇక్కడి ప్రభుత్వంపై ఒకవిధంగా దాడిచేశారనే చెప్పవచ్చు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ పాలనాతీరును ఎండగడుతూ వచ్చింది బిజెపి. అందులోభాగంగానే కేంద్రనుండి రాష్ట్రానికి వస్తున్న నిధులను రాష్ట్రప్రభుత్వం సరిగా వినియోగించు కోవడంలేదని, కేంద్ర పథకాల పేర్లను మార్చి, కొత్తపేర్లతో తమ పథకాలుగా ప్రజల ముందుకు తీసుకుపోతోందంటూ రకరకాల ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనేఉంది. అయితే కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపికి ఇక్కడ ఎట్టిపరిస్థితిలోనూ స్థానంలేకుండా చేయాలన్న ఆలోచన అధికారపార్టీ అయిన టిఆర్‌ఎస్‌కు ఉంది. దీంతో కేంద్రం తమ రాష్ట్రానికి న్యాయంగా అందించాల్సిన నిధులను విడుదల చేయడంలేదంటూ కొంతకాలంగా ఆరోపిస్తూనే ఉంది. ఈ విషయంలో కేంద్ర మంత్రులు చెబుతున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనలేదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు ఆయన మంత్రివర్గంలో ముఖ్యుడైన కెటిఆర్‌ ‌మరికొంతమంది మంత్రులు తరుచూ విరుచుకు పడుతూనేఉన్నారు. కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా నిధుల అంశాన్ని ప్రస్తావించడం,అది కొంతకాలం చర్చనీయాంశంగా మారడం ప్రహసనంగా మారింది. గత డిసెంబర్‌లో రెవెన్యూ, ఆర్థిక అంశాలపై టిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌సమీక్ష నిర్వహించినప్పుడు, తాజాగా రాష్ట్ర శాసనసభ సమావేశా) సందర్భంగా సిఎం కెసిఆర్‌ ఈ ‌నిధుల విషయమై కేంద్రాన్ని కడిగిపారేసిన విషయం తెలియందికాదు. రాష్ట్రంనుండి కేంద్రానికి పన్నుల కింద జమఅవుతున్న నిధుల్లో రాష్ట్రానికి పద్ధతి ప్రకారం రావాల్సిన వాటాను కేంద్రం సంపూర్ణంగా అందజేయటంలేదన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ. ఈ విషయమై పలుసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడుగాని, రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వచ్చినప్పుడుగాని రాష్ట్ర ప్రభుత్వం లేఖను అందజేస్తూనేఉంది.

అయినా కేంద్రం పెడచెవిన పెడుతున్నదన్నది తెలంగాణ ప్రభుత్వ ఆరోపణ. కేంద్రంలో సర్కార్‌ ‌సరిగా పనిచేయడంలేదని, ఢిల్లీ పెద్దలు సరిగాలేరంటూ ఇటీవల కెసిఆర్‌ ‌సీరియస్‌గానే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి జిఎస్టీ కింద 5000 కోట్ల రూపాయలు,ఐజిఎస్టీకింద 2812 కోట్లు రావాల్సిఉన్నా కేంద్రం స్పందించడం లేదన్నది ఆయన ఆరోపణ. దీనిపై పార్లమెంటులో, రాజ్యసభలో, పార్లమెంట్‌ ‌ముందున్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళనలు నిర్వహించినా కేంద్రం పట్టించుకోలేదన్నది కెసిఆర్‌ ‌విమర్శ. ఈ విషయంలో బిజెపి రాష్ట్ర నాయకత్వంకూడా పలు సందర్భాల్లో స్పందించి కేంద్ర నిధుల విషయంపై ఎక్కడైన, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్‌ ‌చేసింది. అసలు ఈ గందరగోళపరిస్థితిలో వాస్తవమేంటన్నది వివరించాల్సిందిగా తాజాగా జరుగుతున్న పార్లమెంట్‌ ‌సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేసిన ప్రశ్నకు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌లికితపూర్వక జవాబును అందజేసింది. గత ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి లక్షన్నర కోట్ల రూపాయలను అందజేసినట్లుగా ఆమె అందులో పేర్కొంది. ఆరేళ్ళలో పన్నుల వాటాకింద 85,013 కోట్లు, రాష్ట్ర విపత్తు నిధుల కింద 1289.4 కోట్లు, స్థానిక సంస్థల నిధులకింద 6511 కోట్లు, ప్రత్యేక సహాయం కింద వెనుకబడిన జిల్లాలకు 1911 కోట్ల నిధులను అందజేసినట్లు ఇచ్చిన వివరణ కేంద్రం నిధులివ్వడంలేదన్న ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టినట్లైంది. ఇక కేంద్రం వాస్తవంగా ఇవ్వాల్సింది ఎంత, ఇచ్చిందెంతా అన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వివరించవలసి ఉంది.

Leave A Reply

Your email address will not be published.