- ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ న్యూఢిల్లీలో ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రతి రోజూ పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న నిరోధక, నియంత్రణ చర్యలను మదింపు వే•యాలని నిర్ణయించింది. కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నిరోధం, నియంత్రణ, కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాల జారీ కోసం 2005లో చర్యల ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపింది. దీనిని 2006, 2012, 2015 సంవత్సరాల్లో సవరించినట్లు తెలిపింది. తాజాగా 2021లో కూడా దీనిని సవరించినట్లు పేర్కొంది. కలుషిత పౌల్ట్రీ ఉత్పత్తులను వినియోగించడం వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియా పశువులకు, పక్షులకు, మొక్కలకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని పేర్కొంది. పారిశుద్ధ్యం, ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ చర్యలు తీసుకుంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ల వ్యాప్తిని నియంత్రించవొచ్చునని పేర్కొంది.
కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు 1,800 వలస పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. రాజస్థాన్‌లో దాదాపు 425 పక్షులు చనిపోయాయి. మధ్య ప్రదేశ్‌లో సుమారు 152 కాకులు ప్రాణాలు కోల్పోయాయి.