Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కుపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

  • కేంద్రం తీరుపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
  •  విశాక ఉక్కు ప్లాంట్‌ ‌వద్ద తీవ్ర నిరసనలు
  • మోడీకి వ్యిరేకంగా నినాదాలతో అట్టుడికిన ఉక్కు ఫ్యాక్టరీ

విశాఖపట్నం, జూలై 29 : ఉక్కు కార్మికుల ఉద్యమం ఉదృత మవుతోంది. మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిపాలన భవనం దద్దరిల్లింది. విశాఖ ఉక్కును నూరుశాతం ప్రైవేటీకరించడం ఖాయమని హైకోర్టుకు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను నిరసిస్తూ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పరిరక్షణ పోరాట సమితి ఉద్యమిస్తోంది. దీనిలో భాగంగా గురువారం పరిశ్రమ పరిపాలన భవనం వద్ద ఉక్కు ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో పరిపాలన భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగష్టు 2, 3 తేదీలలో ఢిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరిగే ఛలో పార్లమెంట్‌ ‌పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. అవసరమైతే ఢిల్లీ వీధుల్లో పోరాడతామని అన్నారు. కార్మికుల ఆందోళనలతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా భవనం వద్ద పెద్ద సంఖ్యలో సీఐఎస్‌ఎఫ్‌ ‌బృందాలు పహారా కాస్తున్నాయి. ’ఆత్మనిర్భర్‌ ‌భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం న్యూ పబ్లిక్‌ ‌సెక్టర్‌ ‌పాలసీ లో ఐరన్‌, ‌స్టీల్‌ ‌రంగాలు వ్యూహాత్మక రంగంలోకి రావు.

అందుకే అమ్మేయాలని కేంద్రం నిర్ణయించుకుందనే విషయం విదితమే. విశాఖ ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ ‌కమిటీ (సీసీఈఏ) కూలంకషంగా చర్చించిందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నిన్న నివేదించింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (ఆర్థిక మంత్రిత్వశాఖ) శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ ‌సింగ్‌ ఈ ‌మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవెటీకరణపై ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులో కేంద్రం అఫిడివిట్‌ ‌దాఖలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం చేస్తున్నారు. గురువారం.. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకున్నారు. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులో బుధవారం అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తన అఫిడవిట్‌లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకుందని, 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ ప్రైవేటీకరణపై పిల్‌ ‌వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ది కోసమే ఆయన పిటిషన్‌ ‌వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.కేంద్రం చర్యలపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు.

Leave a Reply