Take a fresh look at your lifestyle.

వరి కొనుగోలుపై కేంద్రం అస్పష్ట వైఖరి

వరి కొంటరా ? కొనరా ? అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూటి ప్రశ్నకు కేంద్రం అస్పష్ట ప్రకటన రైతాంగాన్ని అయోమయంలో పడేస్తున్నది. గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈ వర్షాకాలం వరిసాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి పెరిగింది. అయితే పంటకోసి కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులకు నిరాశే ఎదురైంది. చాలావరకు కొనుగోలు కేంద్రాల్లో ఇంకా వరి కొనడాన్ని ప్రారంభించనేలేదు. అదేమంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆయా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. వరి కోసి ఇప్పటికి దాదాపు నెలరోజులు కావస్తున్నా కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వానలకు తడుస్తూ, కొట్టుకుపోతున్న పట్టించుకున్నవారు లేరు.  ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం స్పందించడంలేదు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన స్పర్థ యావత్‌ ‌రైతాంగాన్ని దు:ఖంలో ముచ్చెత్తుతుంది.
అయ్యగారు వొచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? అన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమీతుమీ తేల్చుకునేదాకా  వరి కుప్పలకు ఎవరు కావలి కాయాలో అర్థంకాని పరిస్థితి. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌లు ఈ విషయంలో పోటాపోటీ ప్రకటనలు చేస్తూ, ఒకరినొకరు నిందించుకుంటున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఓ ‌సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్న భారతీయ జనతాపార్టీ నేతలను, కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా  రైతాంగంతో ఇందిరా పార్క్ ‌దగ్గర గురువారం ధర్నా నిర్వహించారు. అనూహ్యంగా ఈ ధర్నాకు మంచి స్పందన కూడా వొచ్చింది. ఈ వేదికపై నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌ ‌కేంద్రానికి సవాళ్ళు విసిరారు. మూడు రోజుల్లో తమకు సరైన సమాధానం చెప్పకపోతే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన చేసిన హెచ్చరికకు కేంద్రం ఒక విధంగా వెంటనే స్పందించిందనే చెప్పాలె. వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. కాని, ఆ ప్రకటన అస్పష్టంగా ఉండడంతో ఇంతకూ కేంద్రం కొంటా అంటున్నదా? కొనమని చెబుతున్నదా తెలియక రైతులు ఆయోమయం చెందుతున్నారు. వరి కొనుగోలు విషయంలో ఇప్పటికే తాము లక్ష్యాన్ని అధిగమించామని, ఇంకా కొనే విషయమై ఆలోచించి చెబుతామని అంటూనే బాయిల్డ్ ‌రైస్‌ను మాత్రం కొనే పరిస్థితిలేదంటుంది.
ఎఫ్‌సిఐ ద్వారా కేంద్రానికి విక్రయిస్తున్న ధాన్నాన్ని ఉప్పుడు బియ్యంగానే ఇవ్వాల్సి ఉంటుందని కెసిఆర్‌ ‌చెబుతున్న క్రమంలో కేంద్రం ఇలా ప్రకటించడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలో ధాన్యం నిలువలు పెరిగిపోతున్నాయని,  మరింత ధాన్యం కొనుగోలు చేస్తే, నిల్వచేసే సామర్థ్యం తమ వద్ద లేదంటూనే, ప్రస్తుత పరిస్థితిలో బాయిల్డ్ ‌రైస్‌ ‌మిల్లులకు డిమాండ్‌ ‌లేదని కేంద్రం చెబుతున్నది. పంజాబ్‌కు తెలుగు రాష్ట్రాలకు తేడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పండించిన వరిని స్థానికంగానే వినియోగిస్తారు. కాని పంజాబ్‌లో అలాకాదు. అందుకే అక్కడ పండించిన దానిలో 90శాతం సేకరిస్తున్నామని కేంద్రం అంటుంది. కాని, ఏడు దశాబ్ధాలుగా ఆనవాయితీగా  వరి కొనుగోలు చేస్తున్న కేంద్రం ఒక్కసారే చేతులు ఎత్తివేస్తే ఎలా అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏదిమైనా  తమకు ఈ విషయంలో స్పష్టత ఇబ్వాల్సిందేనని, అలాగే  వేసవిలో కూడా ఎంత కొనుగోలు చేసేది రాత పూర్వకంగా హామీ ఇవ్వాల్సిందేనని కెసిఆర్‌ ‌డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బాధ కాదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంది. అందుకు అవసరమైతే జాతీయ స్థాయిలో రైతాంగ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కెసిఆర్‌ ‌ప్రకటించారు. వాస్తవంగా  రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనడానికి   ఏడాదిగా దేశం వ్యాప్తంగా రైతుల నిరసను కేంద్రం పట్టించుకోకపోవడమేనన్న విషయాన్ని కెసిఆర్‌ ‌స్పష్టంచేశారు.  సాగు చట్టాలు వద్దని చేస్తున్న వారి డిమాండ్‌పై ఎందుకు స్పందించడంలేదంటూనే అసలు కేంద్రం రైతులను బతకనిస్తుందా, లేదా అని ఘాటుగా విమర్శిస్తున్నారు. రైతులేమీ కొత్త కోరికలు కోరడంలేదు. తాము పండించిన పంటలను కొనమంటున్నారు. అదే డిమాండ్‌ను తాము చేస్తున్నాము.
ఒక వేళ కేంద్రం స్పందించని పక్షంలో రాష్ట్ర రైతాంగం పండించిన మొత్తం వరి ధాన్యానికి దిష్టి తీసి భాజపా కార్యాలయం ముందు గుమ్మరిస్తామన్న కెసిఆర్‌ ‌మాటలతో ఈ మొత్తం ఎపిసోడ్‌కు కేంద్రం పెడుతున్న మెలికే కారణమన్న విషయాన్ని కెసిఆర్‌ ‌రైతాంగానికి అర్థమయ్యే రీతిలో చేరవేయగలిగాడనే చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ఈ పీఠముడిని మెల్లగా విప్పదీసుకునే పని కేంద్రంతో పాటు భాజపా నేతలపైన పడింది. ఇక ముందు ప్రతీ సీజన్‌లో ఏ మేరకు కొనుగోలు చేసేది కేంద్రం ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తే తప్ప రైతాంగానికి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే పంటల మార్పిడన్నది అంత సులభమేమీ కాదు. అన్ని నేలలు అందుకు అనుకూలంగా ఉండవు. వాటికి కావాల్సిన విత్తనాలు, ఎరువులతోపాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతుకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలకున్నది. అంతేకాదు ప్రత్యమ్నాయ ఫల సాయాన్ని కొనుగొలు విషయంలో కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తేనే రైతు స్పందించే అవకాశం ఉంటుంది.

Leave a Reply