Take a fresh look at your lifestyle.

సైనికుల మనోభావాలను దెబ్బతీయరాదు ప్రకటన విడుదల చేసిన కేంద్రం

గాల్వన్‌ ‌ఘటన నేపథ్యంలో సైనికుల మనోభావాలు దెబ్బతినేవిధంగా .. అనవసర వివాదం సృష్టిస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో శుక్రవారం అఖిల పక్ష భేటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. వాస్తవాధీన రేఖ హద్దుల్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదని ప్రధాని అఖిలపక్ష భేటీలో స్పష్టం చెప్పినట్లు పీఎంవో వెల్లడించింది. భారత భూభాగాన్ని.. చైనాకు అప్పగించినట్లు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఇవాళ తన ట్విట్టర్‌లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. భారత భూభాగంలోకి చైనా సైనికులు రాలేదని, ఒకవేళ అలాంటి సాహసం చేస్తే వారిని తరిమికొడుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే రాహుల్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. అఖిల పక్ష భేటీలో ప్రధాని మాట్లాడిన విషయాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆ ప్రకటనలో సుస్పష్టం చేసింది. జాతీయ విపత్తు సమయంలో సైన్యానికి మద్దత్తుగా నిలుస్తామని అఖిల పక్షం ఆమోదించిందని, కొందరి ప్రేరేపిత వ్యాఖ్యలతో భారతీయ ఐక్యత విచ్ఛిన్నం కాదు అని నమ్ముతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.

గల్వాన్‌ ‌ఘటనపై స్పష్టత ఇవ్వాలి: శివసేన ఎంపి
లద్దాఖ్‌లోని గాల్వన్‌ ‌లోయ ప్రాంతంపై సర్వ అధికారాలు తమకే చెందుతాయన్న చైనా ప్రకటనపై కేంద్రం స్పందించాలని శివసేన ఉపాధ్యక్షురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్‌ ‌చేశారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చర్యలకు సిద్ధమంటూనే చైనా పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ’మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మోదీ దేశానికి హా ఇచ్చారు. కానీ గాల్వన్‌ ‌లోయ తమదిగా చైనా చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు కొన్ని అనుమానాలున్నాయి. గాల్వన్‌ ‌లోయను మనం విడిచిపెట్టామా లేదా అక్కడి నుంచి చైనా సైన్యాన్ని వెళ్లగొట్టారా? దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ చతుర్వేది ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply