Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌తో ముందుకు సాగని జనగణన కరోనా భయాలతో వాయిదాపడ్డ ప్రక్రియ

లాక్‌డౌన్‌ ‌కారణంగా నేటినుంచి దేశవ్యాప్తంగా జరగాల్సిన జనగణన, జనాభా పట్టిక ఆధునీరణ సర్వే వాయిదా పడింది. ఏప్రిల్‌ ఒకటినుంచి సెప్టెంబరు ముప్పయ్‌వరకూ ప్రభుత్వం శిక్షణనిచ్చి పంపిన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి పలు వివరాలు సేకరించే ఈ బృహత్‌ ‌పక్రియ కరోనాతో వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.ఏకంగా 21రోజులు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంతో ప్రభుత్వం వెనువెంటనే ఈ పక్రియల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో ఇది అనివార్యం అయ్యింది. లాక్‌డౌన్‌ ‌కాలం ఏప్రిల్‌ 15‌వరకూ ఉంటుందని ప్రకటించినా… ఆ తరువాత కూడా ఇది కొనసాగుతుందన్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి కొనసాగింపు ఆలోచన ఎంత మాత్రమూ లేదనీ కేంద్ర కార్యదర్శి ఇప్పటికే ప్రకటించారు. మరో పదిహేను రోజుల్లోగానే వాతావరణం కాస్తంత సానుకూలపడి, లాక్‌డౌన్‌ ‌కొనసాగింపు అక్కరలేదనుకున్నప్పటికీ, కరోనా కట్టడికి ప్రభుత్వం తన సమస్త వ్యవస్థలనూ, శక్తియుక్తులను మరింతకాలం వెచ్చించక తప్పదు.

కరోనా దెబ్బకు కకావికలమైన సమస్త రంగాలు, ప్రజల దైనందిన జీవితాలు తిరిగి గాడినపడటానికి చాలా కాలమే పడుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సిబ్బందినీ, వనరులనూ వెచ్చిస్తూ, ప్రజలతో విస్తృత సంపర్కం అవసరపడే ఈ లెక్కలను కొంతకాలం నిలిపివేయడం శ్రేయస్కరమని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్టాల్ర సహకారం లేనిదే జనగణన, జనాభాపట్టిక ఆధుకరణ ప్రక్రియ  అసాధ్యం. కరోనా ఉపద్రవం నుంచి దేశం బయటపడటానికి ఎంతకాలం పడుతుందన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేం. ఎన్పీఆర్‌లో ప్రభుత్వం అడగబోయే ప్రశ్నల విషయంలో ప్రజల అనుమానాలు అనేకం అలాగే ఉన్నాయి. తల్లిదండ్రుల పుట్టుపూర్వోత్తరాలు సహా పలు ప్రశ్నలు సంధించి తమకు రాజకీయంగా ఉపకరించే రీతిలో ప్రజలను వడబోసేందుకు పాలకులు సిద్ధపడుతున్నారన్న భయాలున్నాయి. కేంద్రపెద్దలు పలు దశల్లో వివరణలు సైతం ఇవ్వాల్సి వచ్చింది. కేంద్ర రాష్టాల్రు పరస్పరం సమన్వయంతో  ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా ఉపద్రవంతో ఈ పక్రియను చుట్టుముట్టిన వివాదం  వెనక్కుపోయింది. కరోనా ఉపద్రవం మనకు సమాజంలోని అన్ని వర్గాలు పరస్పర సహకారంతో, సమన్వయంతో సాగాల్సిన అవసరాన్ని తెలియచెబుతున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy