స్మార్ట్ బ్రెయిన్ కిల్లర్ సెల్ ఫోన్ కొరోనా కంటే భయం కరమైనదే
కొరోనా మహమ్మారి ప్రతి ఒక్కరినీ తీవ్రంగా దెబ్బ తీస్తోంది. అన్నీ రంగాలు అత లాకుతలం అయ్యాయి. ఇక విద్యారంగం పరిస్తితి ఆగమ్య గోచరంగా తయార య్యింది. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు. ఏంచేయాలో అర్థం కానీ పరిస్థితిలో కొట్టు మిట్టాడుతూ విద్యార్తులంతా సెల్ ఫోన్ కే అతుక్కుపోయారు. ఉదయం లేవగానే రెండు అరచేతులను నిమురుకుంటూ కంటి వద్దకు తెచ్చుకుని అరచేతులను మొదటగా చూసేవారు లేదంటే లేవగానే దేవుడి విగ్రహాన్ని చూసేవారు. ప్రస్తుతం ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు సెల్ ఫోన్ లోనే తెలియాడుతున్నారు. ఇక ఆన్ లైన్ తరగతుల పేరుతో పిల్లలు సెల్ ఫోన్ తో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
సెల్ ఫోన్ కరోన కంటే భయంకరమనదే: ప్రపంచం మొత్తం మీద కరోన సోకిన వారి జనాభా 1,63,19,086 దేశ వ్యాప్తంగా 13,85,522 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54059 మంది కరోన బారిన పడితే ప్రపంచ వ్యాప్తంగా 3.5 బిలియన్ ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దాదాపుగా దేశ వ్యాప్తంగా 67 శాతం మంది స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ నుండి మంచి కంటే చెడు తొందరగా ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. వేసుకోవడానికి మంచి దుస్తులు లేకపోయినా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలు నేటి యువతలో పెరిగి పోతున్నాయి. ఇది ప్రమాదకరమైన పరిస్తితి కి దారి తీస్తుంది. సెల్ ఫోన్ కు బానిస అయితే మాత్రం ఒక పట్టాన వదిలి పెట్టదు.
అవసరం – అలవాటు – బానిస: స్మార్ట్ ఫోన్ ను మొదటగా అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తూ తర్వాత అది కాస్తా అలవాటుగా మారుతుంది. తదుపరి స్మార్ట్ ఫోన్ లేకపోతే బ్రతకలేము అనే స్థితికి వెళ్తూ ఉంటారు. కానీ మనసు మాత్రం నేను ఫోన్ కు బానిసను అని ఒప్పుకోదు ఇంకా ఫోన్ ను అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాను అంటూ మనసును కూడా మోసం చేసుకుంటూ చివరకు బానిసలుగా మారుతున్నారు. ఎంతవరకూ వెళ్తున్నారంటే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని 10 సంవత్సరాల పిల్లవాడు ఆత్మహత్య కు పాల్పడిన సంఘటనలు పత్రికలలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రాథమిక దశలోనే సెల్ వాడకాన్ని తగ్గించుకుంటూ నిర్ణీత సమయంలోనే ఉపయోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
స్మార్ట్ – బ్రెయిన్ కిల్లర్: స్మార్ట్ ఫోన్ వ్యసనం జీవితం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. స్మార్ట్ ఫోన్ కు బానిస అయితే సెల్ ఫోన్ జీవితంగా భావిస్తూ ఒంటరిగా గడపడం, నిద్రాహారాలు దూరం చేస్తాయి. చాలామంది విద్యార్థులు, పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న చాలామంది యువతీ, యువకులు దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. సెల్ ఫోన్ కు ఎంత సమయం కేటాయిస్తున్నామో కూడా తెలియనంత మాయలోకి తీసుకెళ్తుంది. మనసులో ఒత్తిడి ఆందోళనలు పెరగడం, స్మార్ట్ ఫోన్ సందేశాల కోసం ఆరాట పడటం, అది తప్ప వేరే ఇతర విషయాలు ఆలోచించకపోవడం మూలంగా, బ్రెయిన్ వాడకం పూర్తిగా తగ్గిపోతుంది.
నోమోఫోబియా (నో మొబైల్ ఫోన్ ఫోబియా): స్మార్ట్ ఫోన్ ను అతిగా ఉపయోగిస్తే నోమోఫోబియా వస్తుంది జాగ్రత్తా. స్మార్ట్ ఫోన్ వాడే 50% మందికి పైగా నోమోఫోబియాతో అనే రోగ బారిన పడుతున్నట్లుగా ప్రపంచ వ్యాప్త సర్వేలు నిరూపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఇద్దరిలో ఒక్కరూ ఈ వ్యాధి తో బాధ పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఎట్లా? ఫోన్ వాడలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న భయమే నోమోఫోబియా. వారంలో ఒక్క రోజూ ఫోన్ ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. మీలో నోమో ఫోబియా లక్షణాలు ఉన్నాయా లేవా అనేది అర్థం అవుతుంది.
సెల్ ఫోన్ కు బానిస అయ్యామా: ప్రతి ఒక్కరూ తమకు తాముగా సెల్ కు బానిసలుగా అయ్యామని అనుకోకపోవచ్చు, ఒక్కసారి ఆలోచించండి. సెల్ ఫోన్ వాడుతూ తను చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తున్నారా, మీ సెల్ ఫోన్ ఉపయోగం పై మీ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారా, ఇతరులకు తెలియకుండా ఉండాలని ఒంటరిగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారా, సెల్ ఫోన్ ఉపయోగించే సమయాన్ని కుటుంబ సభ్యులకు గాని, మిత్రులకు గాని అబద్దాలు చెబుతున్నారా, అకస్మాత్తుగా సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయితే పట్ట లేనంత కోపం వస్తుందా, మీ ఫోన్ లో ఏమైనా మెసేజ్ లు వచ్చినయా అని రాత్రి లేచి చూస్తున్నారా, ఫోన్ రింగ్ అయినట్లుగా లేదా మెసేజ్ లు వచ్చినట్లుగా అనిపించటం, ఫోన్ ను మరిచి పోయి బయటకు వెళ్తే తిరిగి వచ్చేంతవరకూ ఆందోళనకు గురవుతున్నారా, అవసరం లేకపోయినప్పటికి సెల్ ఫోన్ ను మాటిమాటికి చెక్ చేయటం ఇలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నాయా చూసుకుంటే ఎంత మేరకు సెల్ ఫోన్ అవసరాలకు ఉపయోగిస్తున్నామో తెలుస్తుంది.
స్మార్ట్ ఫోన్ కోసం వెతుకులాటా ఎందుకో: కరోన మహమ్మారి మూలంగా బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉంది ఏ పని చేయాలో అర్థం కాక చాలా మంది ఫోన్ కోసం పరితపిస్తున్నారు. మొబైల్లో ఆటలు, పాటలు వినడం తో ప్రారంభమవుతుంది. ఆందోళనలు, చిన్న చిన్న సమస్యల వైపుగా ఆలోచనలు వెళ్లకుండా ఉండడానికి ఫోన్ ను వాడటం, అస్సలు ఏం పని చేయాలో అర్థం కాని వారు, మొబైల్ లోని ఆటలు ఉద్వేగాన్ని కలిగిస్తూ సంతోషంగా భావించడం, స్నేహితులను ప్రత్యక్షంగా కలవ లేకపోవడంతో ఫేస్బుక్లో ఛాటింగ్‌లో వుండే వారంతా నిజమైన స్నేహితులే అని భ్రమ పడుతూ ఎక్కువ సమయాన్ని ఉపయోగించడం జరుగుతుంది.
నోమోఫోబియా నుండి బయట పడాలంటే: ఎందుకోసం నోమో ఫోబియానుండి బయట పడాలీ అని అనుకుంటున్నారో, నోమో ఫోబియా తో కలిగిన నష్టాలను ఒక పేపర్ పై రాసుకోవాలి. సెల్ ఫోన్ వాడకూడని సమయాలను నిర్ణయించుకోవాలి. ఆ సమయాలను అలారం పెట్టుకొని ఖచ్చితంగా అమలు చేసుకోవాలి. సోషల్ మీడియా ఆప్స్ ను సెల్ ఫోన్ నుండి తీసి వేయాలి. గ్రూప్ చాట్స్ ఉపయోగం అయితేనే ఉంచుకోవాలి. చదువుకునే ముందు పడుకునే ముందు సెల్ ఫోన్ స్వీచ్చాఫ్ చేయాలి. ప్రతి సమాచారానికి సెల్ ఫోన్ పై ఆధార పడకుండా పుస్తక పఠనం చేయాలి. సెల్ ఫోన్ వాడే సమయాలను మిత్రులకు, బంధువులకు ముందుగానే చెప్పాలి. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గరలోని సైకాలజిస్టు ద్వారా కౌన్సెలింగ్ తీసుకోవాలి.

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321