Take a fresh look at your lifestyle.

‘‌కరోనా’ కలకలం అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ

  • అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
  • కేంద్ర ఆరోగ్య నిపుణుల సూచనలు
  • పరిస్థితిని సమీక్షిస్తున్నాం : మంత్రి ఈటల

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌పై అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఈ వైరస్‌ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కానప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ప్రతీ ఒక్కరికీ హైదరాబాద్‌ ‌శంషాబాద్‌ అం‌తర్జాతీయ విమానాశ్రయంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్మంగా ఈ వైరస్‌ ‌ప్రభావం అధికంగా ఉన్న చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులందరికీ థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్‌ ‌సోకినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని ప్రత్యేక వార్డులలో ఉంచి వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజధాని హైదరాబాద్‌లోని అతి పెద్ద ఆసుపత్రులైన గాంధీ, ఫీవర్‌, ‌చెస్ట్ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతీ జిల్లా ఆసుపత్రిలో, బోధనాసుపత్రిలోనూ 10 పడకలతో కూడిన ప్రత్యేక వార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.బాధితులకు అత్యవసర వైద్యం అందించేందుకు వెంటిలెటర్‌ ‌సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని సూచలను జారీ చేసింది. కరోనా నుంచి రక్షణ పొందడానికి పాటించాల్సిన జాగ్రత్తలు : దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు లేదా టవలును ముక్కుకు, నోటికి అడ్డంగా ఉంచుకోవాలనీ, లేదా మాస్క్ ‌కట్టుకోవాలని సూచిస్తున్నారు. తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండటం, వీలైనంత వరకు చలి ప్రదేశంలో తిరగకుండా ఉండటం, అపరిచితులకు దూరంగా ఉండటం, పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం, జలుబు, డగ్గు, జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చాతిలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలని సూచించింది.

వైద్య ఆరోగ్య శాఖకు కేంద్ర ఆరోగ్య నిపుణుల సూచనలు
దేశవ్యాప్తంగా కరోనా వైరన్‌ ‌వణికిస్తున్న నేపథ్యంలో దీనిపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యుల బృందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు ఇచ్చింది. గాంధీ, ఫీవర్‌, ‌చెస్ట్ ఆసుపత్రులలో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ ‌వార్డు)ను పరిశీలించారు. కరోనా వైరస్‌ ‌సోకిందన్న అనుమానంతో ఫీవర్‌ ఆసుపత్రినలో చేరిన బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలపై ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చికిత్స విధానాలను వివరించి అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు.

పరిస్థితిని సమీక్షిస్తున్నాం : మంత్రి ఈటల
రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌సోకకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్క, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఫీవర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డా.శంకర్‌, ఇతర వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతంరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌కేసులు నమోదైన పక్షంలో వైద్య చికిత్సలు అందించేందుకు ఇప్పటికే గాంధీ, ఛాతి, ఫీవర్‌ ఆసుపత్రులలో కలిపి సుమారు 100 పడకలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అయితే, కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన వారికి వైరస్‌ ‌నిర్ధారణకు సంబంధించి సేకరించిన రక్త నమూనాలను పూణేకు పంపడం ఇబ్బందికరంగా ఉందనీ, ఈ పరీక్షా కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి అవసరమైన కిట్లను సరఫరా చేయాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామనీ, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్వైన్‌ ‌ఫ్లూ సోకిన సమయంలో తీసుకున్న మాదిరిగానే అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు హైదరాబాద్‌కు రప్పించడానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు.

Tags: Causes corona, Department, Medical Health

Leave a Reply