Take a fresh look at your lifestyle.

నందిగ్రామ్ లో కుల సంగ్రామం

మహాత్మా గాంధీని బనియా అని భారత జాతీయ జనతాపార్టీ అధ్యక్ష హోదాలో ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా అభివర్ణించిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. గుజరాతీలను గొప్పగా చెబుదామనుకుని అమిత్ షా పప్పులో కాలేశారు.ఇప్పుడు ఆయన పార్టీ తరఫున పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ శాసనసభకు పోటీ చేస్తున్న సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ హిందువు కాదని చెప్పడం కోసం ఆమె 30 శాతం మైనారిటీల కోసం పోరాడుతున్నారనీ, తాను 70 శాతం హిందువుల కోసం పోరాడుతానంటూ అతి తెలివిని ప్రదర్శించారు.

ఆయన మాటలను తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాననీ, తన కన్నా అగ్రవర్ణ ప్రయోజనాలను కాపాడేవారెవరూ లేరని చెప్పాల్సి వొచ్చింది. పశ్చిమ బెంగాల్ లో కులం, మతం, వర్గం అనే ప్రస్తావన లేకుండా వామపక్ష ఫ్రంట్ అధినేత జ్యోతి బసు మూడున్నర దశాబ్దాల పాటు పరిపాలన సాగించారు.ఆయన బ్రాహ్మణుడనని ఎన్నడూ చెప్పుకోలేదు. ఆ అవసరం కూడా రాలేదు. బెంగాల్ లో జాతీయోద్యమం, స్వాతంత్ర్యోద్యమం, సాహిత్యోద్యమం, భారత సంస్కృతి పునరుజ్జీవ ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎవరూ కూడా తమ కులాలు, మతాల గురించి చెప్పుకోలేదు.వారికి కూడా ఆ అవసరం రాలేదు. బెంగాల్ ప్రజలు భావోద్వేగాలు కలిగిన వారు. ప్రధానంగా జాతీయ భావాలు, మాతృ భాషాభిమానులు. అంతమాత్రాన పరాయి భాషలనూ, మతాలను ఎన్నడూ ఎత్తి చూపలేదు. విరోధించలేదు.బీజేపీ రాష్ట్రంలో అడుగు పెట్టిన వేళా విశేషమో,ఏమో ఇప్పుడు రాష్ట్రంలో కులాలు, మతాలు ప్రస్తావన పదే పదే వొస్తుంది.. సువేందు అధికారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది మమతా బెనర్జీయే. అయితే, అంతా తన వల్లే తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందనీ, నందిగ్రామ్ లో తాను మమతపై గెలిచి తీరుతానంటూ ఆయన ప్రగల్భాలు పలికి రంగంలోకి దిగారు. నందిగ్రామ్ కి ఏదైనా చేసి ఉంటే చెప్పుకుని వోట్లు అడగడం వేరు, కేవలం కులం, మతం ప్రస్తావనలతో వోట్లు అడగడం వేరు.ఇప్పుడు ఆయన చేస్తున్నది అదే. అక్కడి ప్రజలు అభ్యుదయ భావాలు కలిగిన లౌకిక వాదులు, సువేందు అధికారి ప్రచారం చూసి అసహ్యించుకుంటున్నారు.

మత పరమైన ప్రస్తావన లేకుండా ప్రచారం జరగాలన్నది వారి అభిమతం. బంగ్లాదేశ్ పొరుగున ఉండటం వల్ల వారిలో మతపరమైన ద్వేషం ఆవగింజంతయినా లేదు. ఆ మాటకు వొస్తే, బంగ్లాదేశ్ ప్రజలు కూడా మతం కన్నా, భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రవీంద్ర కవీంద్రుని గీతాలను ఆలాపించి పొంగిపోతుంటారు. బంగ్లా భాషాభిమానం భారత జాతీయోద్యమం ముందుకు సాగడానికి ఒక శక్తిగా పని చేసింది. భారత్ తో సన్నిహితం గా ఉండటం కోసమే వారు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకున్నారు. బంగ్లాదేశీయులకు మతం కన్నా, భాష ప్రాధాన్యమని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదు. ఇప్పటికీ బంగ్లాదేశ్ లో బెంగాలీ భాషకు పట్టం కడుతున్నారు. వారి పాలనా వ్యవహారాలన్నీ బెంగాలీలోనే జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఆవిర్భవించి ఐదు దశాబ్దాలు పూర్తి అయిన సందర్బాన్ని పురస్కరించుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా మన ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు .

రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. బంగ్లాదేశ్ తో భారత్ సాన్నిహిత్యంగా ఉండటం పాకిస్తాన్ కి కంటగింపు అయినా మన దేశం లెక్క చేయడం లేదు. మతం కన్నా, భాషా, సంస్కృతులు,ఆచార వ్యవహారాలకు బంగ్లాదేశీయులు ప్రాధాన్యం ఇస్తారు. బెంగాలీలు కూడా అంతే. అందుకే, సువేందు అధికారి చేసిన విమర్శలకు మమతా బెనర్జీ ఘాటైన సమాధానమిచ్చారు. బెంగాల్ లో అభ్యుదయ కవితా, సాహిత్య ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. వాటి ప్రభావం దేశమంతటా విస్తరించాయి. సంకుచితమైన భావాలను బెంగాలీలు అణుమాత్రం దరి చేరనీయరు. దేశంలో ప్రారంభమైన అభ్యుదయ, లౌకిక వాద ఉద్యమాలన్నింటికీ బెంగాల్ జన్మస్థానం., ఆఖరికి నక్సలిజం ప్రారంభమైంది కూడా బెంగాల్ నుంచే. అందువల్ల సువేందు అధికారి వంటి వారు హిందూ,ముస్లిం విభజనతో వోట్లను సాధిద్దామని ప్రయత్నించినా అక్కడి ప్రజలు సహించరు. ఇంతకీ నందిగ్రామ్ లో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన భూపోరాట ఉద్యమం మతం కోసం కానేకాదు.

భూమి కోసం. ఈ పోరాటంలో 14 మంది పైగా కాల్పుల్లో మరణించారు.అందువల్ల నందిగ్రామ్ గురించి సువేందు అధికారి వంటి ఈ తరం నాయకులు ఎన్ని కథలు చెప్పినా, మమతా బెనర్జీ పోరాటంలో చిత్తశుద్ధినీ, నిజాయితీని శంకించలేరు.కులం, మతం, ప్రాంతం పేరిట కాకుండా పేద ప్రజల ముఖ్యంగా, హక్కులు కోల్పోతున్న వ్యవసాయదారులు, కూలీల కోసం ఆమె పోరాటం సాగించారు. ఆమెను స్థానికురాలు కాదని విమర్శించినంత మాత్రాన అక్కడి ప్రజలు లెక్క చేయరు. ఆమె స్థానికులల్లో స్థానికురాలిగా,అక్కడి ప్రజలతో మమేకమైనారు. బీజేపీ మత పరమైన విభజనలనే కాకుండా, కుల పరమైన విభజనలను కూడా సృష్టించగలదని సువేందు అధికారి రుజువు చేస్తున్నారు. మమతా బెనర్జీకి దేవుని శ్లోకాలు, మంత్రాలు రావనీ, తప్పులు లేకుండా చదవలేరని ఆయన ఎద్దేవా చేశారు. తప్పులు లేకుండా చదివేవారు ఈరోజుల్లో ఎంతమంది ఉన్నారో ఆయనే చెప్పాలి. హిందూ, ఇస్లాం ధర్మాలన్నీ పేద ప్రజలకు సేవచేయమనే బోధించాయి. విభజనలు సృష్టించమని కాదు.

Leave a Reply