Take a fresh look at your lifestyle.

మనువాద రాజకీయ లబ్దికే కులాల విభజన కుట్ర

‘‘నిమ్న వర్గాల మధ్య ఐక్యత అవసరం కానీ రాజ్యం కానివ్వదు. ఐక్యంగా లేనంత కాలం హత్యలు, అత్యాచారాలు, అవమానాలు ఎన్నో జరుగుతాయి. ఐక్యంగా ఉంటే పాలకులమవుతాము. మనల్ని ఆధిపత్య కులాలు ఐక్యం కానివ్వవు. మనం పాలకులం కాము పాలితులుగానే మిగిలిపోతాము’’ – కాన్షిరాం”

వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా అభిప్రాయం సందర్భంగా..

ఇదే పరిస్థితి 25 ఏళ్లుగా దళితుల మధ్య కొనసాగుతుంది. ఎస్సీ రిజర్వేషన్‌ ‌శాతాన్ని కులాల వారీగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావం నుండి జరుగుతున్న పోరాటాలకు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాలు, చివరికి మావోయిస్ట్ ‌పార్టీ సైతం మద్దతు తెలిపి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న మాల, మాదిగల మధ్య వైరుధ్యాలకు కారణమయ్యాయి. మాదిగలు వెనకబడి ఉన్నారని, మాలలు అభివృద్ధి చెందారనే అసంబద్ధ నిరాధారమైన ఆరోపణలతో వివిధ పార్టీలు మాల, మాదిగలను ఓటు బ్యాంకు గానే చూశాయి తప్ప క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రయత్నాలు చేయలేదు. ఉషామెహ్రా లాంటి వివిధ కమీషన్లు సహితం కంటి తుడుపు చర్యలుగా మిగిలాయి. మూడు దశాబ్దాలు ఒకరిపై ఒకరు న్యాయపోరాటాలు చేసుకున్నాం తప్ప అంబేద్కర్‌ ‌కలలుగన్న రాజ్యాధికారం దిశగా ఏ రోజు ఐక్యం కాకపోవడం దురదృష్టకరం. నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీ తీర్మానం ద్వారా ఆర్డినెన్స్ ‌తయారు చేసి ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. అది పూర్తి స్థాయిలో అమలు కాదని ఆయనకు ముందే తెలుసు. న్యాయ పోరాటానికి మాలలు సిద్ధమైతే ఆర్డినెన్స్ ‌చెల్లదనే విషయం తెలుసు. దానితో ఒక్కసారిగా మాల, మాదిగలను 100 సంవత్సరాలు వెనక్కి నెట్టినట్టయ్యింది. కానీ ఆ అగాథం పూడ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రంలో అమలైన తర్వాత పి.వి.రావు చలో హైదరాబాద్‌ ‌పిలుపివ్వడంతో లక్షలాది మంది మాలలు తరలివచ్చారు. అప్పుడు జరిగిన లాఠీఛార్జిలో వందలాది మంది గాయపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. అనంతరం న్యాయ పోరాటానికి సిద్ధమవగా 2000 లో ఈ.వి.చిన్నయ్య ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిన్నయ్య వర్సెస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మధ్య జరిగిన కేసులో 2004లో అయిదుగురితో కూడిన ధర్మాసనం జస్టీస్‌ ‌సంతోష్‌ ‌హెగ్డే, యస్‌.‌యన్‌. ‌వారియవ, బి.పి సింగ్‌, ‌హెచ్‌.‌కె.సీమ, ఎస్‌.‌బి. సిన్హా 4:1 మెజార్టీతో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలోది కాదని ఆర్టికల్‌ 341‌ను సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పింది. వర్గీకరణ అవసరమైతే రాష్ట్రాల ఆమోదంతో, పార్లమెంట్‌ ‌తీర్మానంతో రాష్ట్రపతి గెజిట్‌ ‌విడుదల చేసాకే సాధ్యమవుతుందని, ఆంధ్రప్రదేశ్‌ ‌లో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

తదనంతరం వర్గీకరణ అనుకూల ఉద్యమాలు తీవ్రమై పలువురు మాదిగలు చనిపోవడం దురదృష్టకరం. మాల, మాదిగల మధ్య అనైక్యత ఆసరాగా రాజకీయ లబ్ధికోసం కుట్రలు సాగుతునే ఉన్నాయి. వర్గీకరణ ఒక సుదీర్ఘ ప్రక్రియ. 50% పైగా రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలి, కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ ఆమోదించాలి. పార్లమెంట్‌ ‌లో బిల్‌ ‌పెట్టి 1/3వంతు పార్లమెంట్‌ ‌సభ్యులు ఆమోదించాలి. ఉభయ సభల్లో లోక్‌ ‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం జరిగాక ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించి గెజిట్‌ ‌లో చేర్చాలి. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళుతుందిఈ విధానం ద్వారా వర్గీకరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ అత్యంత కష్టమనీ తెలుసు. వాస్తవాలు పరిశీలిస్తే వర్గీకరణ వాదం న్యాయమైనదీ, హేతుబద్దమైనదీ, చట్టబద్ధమైనదీ ఐతే అంబేద్కర్‌ ‌రాజకీయ రథాన్ని ముందుకు నడిపించిన బీఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరాం వర్గీకరణ ఎందుకు వ్యతిరేకించారు?? కాన్షిరాం తరువాత లోక్‌ ‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్‌ ‌పాశ్వన్‌ ‌వర్గీకరణకు ఎందుకు మద్దతివ్వలేదు. ఆర్‌.‌పి.వి. నాయకులు అంబేద్కర్‌ ‌మనుమడు ప్రకాశ్‌ అం‌బేద్కర్‌, ‌ప్రో? జోగేంద్ర కావాడే, రాందాస్‌ అథవలే, మాయావతి లాంటి వారు ఎందుకు వర్గీకరణ ను వ్యతిరేకించారు? వర్గీకరణ ద్వారా మాత్రమే ఎస్సీల లో ఉపకులాలు అభివృద్ధి చెందుతాయని అనుకుంటే ఆంధ్రాలో ఎమ్మార్పీఎస్‌ ‌లాంటి ఉద్యమాలు మిగతా చోట్ల ఎందుకురాలేదో వర్గీకరణ వాదులు ఆత్మవలోకనం చేసుకోవాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్‌ ‌కులాల పై సాంస్కృతిక, ఆర్థిక రాజకీయపరమైన దాడులు తీవ్రమయ్యాయి. ఆహారపు అలవాట్ల మీద సైతం ఆంక్షలతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌-17,ఆర్టికల్‌-21‌ల పూర్తి స్థాయి నిర్వీర్యానికి పూనుకునే ప్రయత్నం. కాషాయ పాలన రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థల అస్థిత్వాన్ని కోల్పోయేలా చేస్తోంది. కులాల విభజన పట్ల ఆగస్టు 27న సుప్రీంకోర్టు జస్టిస్‌ అరుణమిశ్రా నేతృత్వంలో అయిదుగురితో కూడిన ధర్మాసనం చీఫ్‌ ‌జస్టీస్‌ ‌కు తెలిసిన అభిప్రాయం ప్రకారం ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై రాష్ట్రాలకు హక్కు కల్పించాలి.

2004 ఆంధ్రప్రదేశ్‌ ‌వర్సెస్‌ ఇ.‌వి చిన్నయ్య కేసులో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అన్న ధర్మాసనృ తీర్పును పునఃసమీక్షించాలని తెలిపింది. ఈ కీలకాంశం పరిశీలించేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటుచేయాలని కోరుతూ కేసును చీఫ్‌ ‌జస్టీస్‌ ‌బోబ్డేకు నివేదించారు. ఆర్టికల్‌ 341, 342 ‌ప్రకారం ఎస్సీ, ఎస్టీలను వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, సుప్రీంకోర్టుకూ లేదు. ఇది పార్లమెంట్‌ ‌ద్వారానే సాధ్యం. రిజర్వేషన్లు ఆర్థిక అసమానతల ఆధారంగా కాకుండా సామాజిక సమానత్వం కోసం ఉద్దేశించినవి. కొన్ని కులాలు వెనుకబడి ఉంటే దానికి మరో కులం (అంటే మాదిగల వెనకబాటుకు మాలలు) కారణం కాదనే ప్రాథమిక అవగాహన అవసరం. ఇటువంటి న్యాయమైన సూచనలు చేసే అవకాశం ఉన్నప్పటికీ న్యాయస్థానాలు ఎందుకు వెనకాడుతున్నాయో అర్ధం చేసుకోవాలి. ప్రస్తుత తీర్పు కూడా అందులో భాగమే. రాష్ట్రాలల్లో ప్రభుత్వాలకు పార్టీలకు ప్రజలకు మధ్య పంచాయితీ పెట్టి అభివృద్ధి చెందిన కులాన్ని రిజర్వేషన్ల నుండి తీసేయాలనే ఆలోచన కులాలుగా విడగొట్టి చివరికి రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది కుట్ర కోణం అనిపిస్తుంది.

ఎస్సీ లో క్రిమిలేయర్‌ ‌ప్రకారం ఒకసారి రిజర్వేషన్‌ అనుభవించిన కుటుంబం, ఆర్థికంగా బలపడిన కుటుంబం రిజర్వేషన్లు అనుభవించరాదని తెలుపుతుంది. అయితే ఈ దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యేలు, ఎం.పీ.లు అయిన కుటుంబాలకు పదే పదే ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం ఉన్నప్పుడు వేల సంవత్సరాలుగా వివక్ష అనుభవించిన వర్గాలకు రిజర్వేషన్లను ఒక్కసారి మాత్రమే అనుభవించాలని చెప్పడం ఎంత వరకు సమంజసం? రాజ్యాంగాన్ని అభాసుపాలు చేయాలని బీజేపీ, ఆర్‌.‌యస్‌.‌యస్‌ ‌ప్రయత్నాలకు సుప్రీం కోర్టు తీర్పులు మద్దతు పలుకుతున్నట్టుగా భావించక తప్పటం లేదు. బీజేపీ పాలన మొదట హిందూ-ముస్లిం మధ్య ఘర్షణ తీసుకొచ్చింది. రెండో విడత ముస్లిం స్త్రీ-పురుషుల మధ్య వైరుధ్యాలు తెచ్చింది. నేడు రిజర్వేషన్‌ ‌వర్గాల మధ్య వైషమ్యమనే అగ్గి అంటించి ఫలితాలపై ఉవ్విళ్ళూరుతున్నది.. జస్టీస్‌ అరుణ్‌ ‌మిశ్రా మొదటి నుండి కూడా ‘‘రిజర్వేషన్ల వ్యతిరేకి’’ అని భావించక తప్పటం లేదు. బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన తీర్పుల కోసం రాజ్యాంగ విలువలను విచ్ఛిన్నం చేస్తున్నదనిపిస్తోంది. సూక్ష్మస్థాయి వర్గీకరణ జరిగితే రాజ్యాంగ మౌళిక సూత్రాలకు విరుద్ధం. రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధి చెందుతామనేది రాజకీయ ప్రేరేపిత ప్రచారం ఓట్ల కోసమే! అనే విషయాన్ని వర్గీకరణ వాదులు మరువొద్దు. ప్రస్తుత పరిస్థితులలో రిజర్వేషన్‌ ‌వర్గాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అణచి వేయబడిన వర్గాల ముందు అనేక సవాళ్లున్నాయి. చీలికతెచ్చే రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలపై తిరగబడాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక దాడులను తిప్పికొట్టాలి. ‘‘మేము బడుగులం కాదు పిడుగులం’’ అని గొంతెత్తి చాటాలి, రిజర్వేషన్లను ఎస్సీల జనాభా ప్రకారం 20% శాతానికి పెంచేలా ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలి,ప్రభుత్వ రంగం కనుమరుగవుతున్న తరుణంలో ప్రైవేట్‌ ‌రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని పోరాడాలి. రాజ్యాంగానికి తూట్లు పొడిచే కుట్రలు ఎవరు చేసినా, అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్న రిజర్వేషన్‌ ‌వర్గాల మధ్య ఎవరు చిచ్చుపెట్టినా ప్రతిఘటించాలి.

pilla sudhakar
దళితరత్న పిల్లి సుధాకర్‌, ‌రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మాల మహానాడు, 959689494

Leave a Reply