రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న తరుణంలో దుష్పచ్రారాలపైనా కఠిన చర్యలకు ఉపక్రమించింది. తీసుకున్న చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, సినిమా హాళ్లు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. అయితే కరోనా పాజిటివ్ అంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
కరోనా పాజిటివ్ అంటూ సోషల్ డియాలో వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించామని మంత్రి ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో కరోనా వైరస్ సోకిందని వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేసిన ముగ్గరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేటకు చెందిన ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వైరస్‌పై సోషల్ డియాలో లేదా మరే ఇతర ప్రచార సాధానాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.