మాస్కులు ధరించకుండా బయట తిరిగితే..
లాక్డౌన్ నేపథ్యంలో ముఖాలకు మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారిపై లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ… ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, షాపింగ్ మాల్ వద్ద, నిత్యావసర వస్తువులు కొనుగోలు వద్ద కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని సూచించారు. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతున్నందున ప్రజలు సాయంత్రం ఆరు గంటలలోపు పనులు ముగించుకుని వారి వారి స్వస్థలాలకు చేరుకోవాలన్నారు. కొరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు తనకు తానుగా వ్యాధి వ్యాప్తి చెందకుండా స్వీయ నియంత్రణ పాటించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోజు రోజుకూ విస్తరిస్తున్న కొరోనా వ్యాధి నివారణకు పోలీసు వారి సలహాలు, సూచనలు పాటించాలని సిపి సూచించారు.
మాస్కులపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసిపి బాలాజీ..
బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ట్రాఫిక్ ఏసిపి బాలాజీ ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం ఉదయం నుండి సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి బాలాజీ, ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో కలసి హైదరాబాద్ రోడ్, మెదక్ రోడ్, ముస్తాబాద్ చౌరస్తా, అంబేద్కర్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని విస్తృతంగా అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.