రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, జూన్ 25, ప్రజాతంత్ర ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో గల ఎన్టీఆర్ కాలనీ, చివ్వెంల మండలం ఇమాంపేట గ్రామంలో మొక్కలు నాటి 6వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి అడవులు శాతం పెంచా లని అన్నారు. చెట్ల పెంపకం ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పేరుతో ప్రజల్లో చైతన్యం తెచ్చి రాష్ట్రంలో అడవుల పెంపకానిఇకి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై పచ్చని శోభ పెంపోందించేందుకు మొక్కలు నాటారని తెలిపారు. పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతోందని, మానవ జాతి ఎదుర్కొంటున్న సమస్యలు వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యంతో ప్రాణాంతక వ్యాధులు ప్రబలడం జరుగుతుందన్నారు.
చెట్లు, అడవులు లేనందున వర్షాలు తగ్గడమే అందుకు కారణమని గుర్తుచేశారు. జిల్లాలో 6వ విడత హరితహారంలో 83లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని తెలిపారు. కోవిడ్19 జాగ్రత్తలు పాటిస్తూనే హరితహారం విజయవంతం చెయ్యాలని సూచించారు. ప్రజా ఉద్యమంలా హరితహారంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పాటుపడాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో 1050మొక్కలు నాటడం జరిగిందని, అలాగే ఇమాంపేటలో మొక్కలు నాటామని తెలిపారు. మొదటి హరితహారంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్క నాటి ప్రారంభించిన హరితహారం తోటే ఇప్పుడు ఆ జాతీయ రహదారిపై హరితశోభ వర్థిల్లుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పి ఆర్.భాస్కరన్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, ఆర్డిఓ మోహన్ రావు, డిఆర్డిఏ పిడి కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి, ఎంపిపి బిక్షం, జెడ్పిటిసి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.