
నగరంలో కార్లు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మియాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి రెండు వాహనాలను ఢీకొట్టి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్లో ఉన్న వ్యక్తి ఒకరు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. టూ వీలర్ వెహికిల్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని బీహెచ్ఈఎల్ కి చెందిన అఫ్సర్గా గుర్తించారు. మరో రెండు ద్విచక్ర వాహనాలు ద్వంసమయ్యాయి. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇకపోతే సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూల్లో తమ కుమారుడిని దింపేందుకు గిరి అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. రైల్ నిలయం వద్దకు రాగానే గిరి బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరి మృతి చెందాడు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సపంలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును అతి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతాగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారులో ఉన్న యువకులు మద్యం సేవించారా లేక అతివేగంతో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఆటోను ఢీకొట్టిన కారు పల్టీ
ఆటోను ఢీకొట్టి కారు పల్టీ కొట్టిన ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఏడుగురు దినసరి కూలీలున్నారు. వారికి గాయాలయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.