Take a fresh look at your lifestyle.

ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాజధాని వివాదం… కొన్ని అభిప్రాయాలు..

capital-issue-amaravathi-telugudesam-party

(‌నిన్నటి సంచికతరువాయి భాగం...) స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలను కూడా పూర్తిస్థాయిలో కలుషితం చేసాయి. ప్రజల ప్రజాస్వామిక హక్కులను, కొన్నిసార్లు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును కూడా కాల రాశాయి. స్థానిక సంస్థలలో తగినంతమంది సిబ్బందిని కూడా నియమించకుండా కాలయాపన చేస్తూ వచ్చాయి. ఫలితంగా ప్రజలు స్థానికంగా, గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో కావలసిన పనులు కూడా సకాలంలో, సక్రమంగా పూర్తి కాక విసుగెత్తిపోయి ఉన్నారు. స్థానికంగా పనులు పూర్తి గాక మండల స్థాయి కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అలసి పోతున్నారు. పైగా స్థానిక పరిపాలనా వ్యవస్థలో సిబ్బంది కూడా లంచాలకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవానికి ప్రభుత్వాలు చేయవలసినది స్థానిక పరిపాలన చక్కదిద్దడం. తగినంత మంది సిబ్బందితో అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అన్ని సేవలు ప్రజలకు సకాలంలో అందేలా చూడడం. ఆంధ్రప్రదేశ్‌ ‌కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఈ ప్రక్రియ వైపు వేసిన కొన్ని మంచి అడుగులు.

ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని..

  1.  వాలంటీర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి చట్టపరమైన వేతనాలు, హక్కులు పూర్తిస్థాయిలో కల్పించడం.
  2.  వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం.
  3. వారికి అవసరమైన శిక్షణను ఎప్పటికప్పుడు ఇవ్వడం.
  4. వారు ఎవరి ఒత్తిడికి గురికాకుండా పారదర్శకంగా పనిచేసే పరిస్థితి కల్పించడం.
  5. స్థానిక సంస్థలకు నిధుల కొరత లేకుండా చూడడం. స్థానిక సంస్థల సిబ్బంది పనితీరును సామాజిక తనిఖీ క్రిందకు తీసుకురావడం.

ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజానికి స్థానిక, మండల స్థాయిలో పరిపాలన మెరుగు పడితే జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పరిపాలన సులభమవుతుంది. జిల్లా, రాష్ట్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దగా తలబాదుకోవలసిన అవసరం లేదు. విచ్చలవిడిగా సాగు భూములను సమీకరించి, భారీ నగరాల నిర్మాణం చేయనవసరం లేదు. డిజిటల్‌ ‌యుగంలో స్థానిక పరిపాలనా సంస్థలను కంప్యూటర్‌, ఇం‌టర్నెట్‌ ‌వ్యవస్థకు అనుసంధానం చేయగలిగితే ప్రజలు గ్రామాలు, మండలాలు దాటి జిల్లా కేంద్రాలకు కూడా వెళ్లరు. ఒక్క గుళ్ళు, గోపురాలు, పర్యాటక కేంద్రాలు చూడడానికి తప్ప. వినియోగదారి మార్కెట్‌ ఎప్పుడు కింది స్థాయికి , ప్రజల దగ్గరకు ప్రవహిస్తూనే ఉంటుంది.గ్రామాల స్థాయిలో ప్రజలకు కావలసింది విద్య, వైద్యం. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయగలిగితే, మండల స్థాయిలో జూనియర్‌ ‌కళాశాలలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహిస్తే, 104, 108 లాంటి సంచార వాహనాలను సక్రమంగా నిర్వహించగలిగితే, విద్య, వైద్యం అవసరాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టే. కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి నమూనాను మనం సంపూర్ణంగా తిరస్కరించాలి.

అమరావతి చుట్టూ తిరుగుతున్న చర్చను మనం ‘‘స్థానిక సంస్థల బలోపేతం’’ కేంద్రంగా చేయాలి. నిజమైన ప్రజాస్వామిక, ప్రజాపక్షపాతులు, ఎజెండాను రూపొందించాలి తప్ప, చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలు సృష్టిస్తున్న అమరావతి ఎజెండాలో కొట్టుకు పోకుండా నిలబడాలి. 2006 అటవీ హక్కుల చట్టం, ఆదివాసీ ప్రాంతాలకు పంచాయతీరాజ్‌ ‌విస్తరణ చట్టం (పీసా) ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే. మొత్తం పరిపాలన అధికారాలన్నీ ఆదివాసీల గ్రామసభలకు ఉంటాయి. ఉండాలి. వాళ్లకు రాజధాని నగరాలతో పెద్దగా అవసరం లేదు. ఆదివాసీల గ్రామసభల అధికారాలకు తూట్లు పొడుస్తూ ఇప్పటికే ప్రభుత్వాలు అడవిపై అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామికవాదులు షెడ్యూల్డ్ ‌ప్రాంతాల్లో ఆదివాసీల గ్రామసభలను పరిపాలన కేంద్రాలుగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి. అమరావతి రాజధానిలో మౌలిక సౌకర్యాల కంటే ముందు ఆదివాసీల గ్రామ సభలకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ ‌చేయాలి. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌, ‌రాజభవన్‌ ‌లాంటివి ఏ రాష్ట్రంలోనైనా ప్రజలకు అందుబాటులో, సమాన దూరంలో ఉండాలని, అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఇవన్నీ అమరావతిలోనే ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు వాదిస్తున్నాయి.

ఈ పార్టీలను, మీడియా సంస్థలను కొన్ని ప్రశ్నలు మనం స్పష్టంగా అడగాలి.

  1. శాసనసభ్యులు, కొంతమంది వారి అనుయాయులు తప్ప ఎంత మంది ప్రజలు అసెంబ్లీకి వెళ్తారు? అసెంబ్లీ ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగులు తప్ప ఇతరులు ఎందుకు అసెంబ్లీకి వెళ్తారు? నిజంగా ప్రజలు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని అనుకునే శాసనసభ్యులు అసెంబ్లీ లేని సమయంలో తమ నియోజకవర్గ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించవచ్చు. అందుకు అవసరమైన కార్యాలయాన్ని అక్కడే నిర్మించవచ్చు.
  2. రాజ్‌ ‌భవన్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు గవర్నర్‌ను కలిసి మాట్లాడటం తప్ప సాధారణ ప్రజలు గవర్నర్‌ను రోజువారీగా కలిసేది ఏముంటుంది? అలాంటప్పుడు రాజభవనం ఎక్కడ ఉంటే ఏమిటి? ఈ రాజభవన్‌లు ఉన్నది పాత రాజరిక వ్యవస్థ కొనసాగింపుగా తప్ప సమాఖ్య వ్యవస్థలో వీటి స్థానం ఏమిటి?
  3. హైకోర్టులో పనిచేసే జడ్జీలు, న్యాయవాదులు, జిల్లాల నుండి వచ్చే న్యాయవాదులు తప్ప రెగ్యులర్‌గా హైకోర్టుకు వచ్చే సాధారణ ప్రజలు ఎంత మంది?
  4. ప్రస్తుతం సెక్రటేరియట్‌లను చూస్తే మంత్రులు, రాజకీయ నాయకులు, పైరవీకారులు, సిబ్బంది తప్ప సాధారణ ప్రజలు ఎందరు వస్తున్నారు? గ్రామ, వార్డు సచివాలయాలను బలోపేతం చేస్తే, అసలు మండలాలు, జిల్లాలు దాటి ప్రజలు రాష్ట్ర సెక్రెటేరియట్‌కు ఎందుకు వస్తారు? అటువంటి సెక్రటేరియట్‌ ‌రాష్ట్రంలో ఏ మూల ఉంటే ఏమిటి?

జంగా అన్నీ ఒక చోట ఉంచాలి అనుకున్నా, వీటన్నింటికి కలిపి కావలసిన భూమి ఎంత? రాజధాని నగర నిర్మాణం పేరుతో సేకరించిన సాగు భూమి ఎంత? ఈ భవనాలు సాధారణ కట్టడాలుగా ఉంటే ఎవరైనా వెక్కిరిస్తారా? అట్టహాసం, ఆడంబరం, రాజరికపు విలాసాలకు ఎందుకు నిధులు ఖర్చు చేయాలి? చంద్రబాబుకు ‘‘కలల రాజధాని’’ నిర్మించాలని కోరిక ఉండవచ్చు. రాజధాని నగర నిర్మాణాలు కర్తగా చరిత్రలో ఆయన పేరు నిలిచిపోవాలని ఆశ ఉండవచ్చు. కానీ నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థలో పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను బట్టి ప్రణాళికలు రూపొందించ వలసి ఉంటుంది. రాష్ట్ర ఆదాయానికి ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతలను నిర్ణయించుకోవలసి ఉంటుంది. దానికనుగుణంగానే బడ్జెట్లు రూపొందించడం, నిధులను కేటాయించడం చేయాల్సి ఉంటుంది. ప్రజలను దారిద్య్రం నుండి, అప్పుల నుండి, ఆకలి నుండి, రోగాల నుండి, అవిద్య నుండి బయట పడేయడానికి మొదట నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గాడిలో పడినాక, మిగులు నిధులు ఉంటే ప్రజల అవసరాలను తీర్చే మౌలిక వసతుల కల్పనకు నిధులను ఖర్చు చేయాలి. ఇంకా మిగులు ఉంటే, ప్రజలకు నూతన జీవన ఉపాధి కల్పనకు, ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మిగులు ఉంటే సహజ వనరుల సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు నిధులు ఖర్చు చేయాలి.

వీటిని ఏమీ పట్టించుకోకుండా, ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుకోవడం, ఆడంబరాలకు పోవడం, కాంట్రాక్టర్లకు లబ్ధి చేసే ప్రాజెక్టులను రూపొందించడం, ప్రతిష్టకు పోయి అప్పులు తెచ్చి అవసరం లేని వాటికి ఖర్చు చేయడం, అప్పులు తీర్చలేక, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేక, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించ లేక, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేక, ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక – అంతిమంగా ప్రజలు ప్రశ్నిస్తే, పోలీసు నిర్బంధంతో అణిచివేయడం, ఉన్న సహజ వనరులను తక్కువ ధరలకే బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం… ఇవన్నీ పాలకులు దశాబ్దాలుగా సాగిస్తున్న అకృత్యాలు. అమరావతి రాజధాని చుట్టూ ఇప్పటి వరకు జరిగింది ఇదే. కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు జరగాలని కోరుకుంటున్నది ఇదే. ఈ అభివృద్ధి నమూనాను ప్రస్తుత ప్రభుత్వం వదిలిపెట్టేలా, పాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా ఆపడం, ప్రజల అవసరాల ప్రాధాన్యతా క్రమంలో నిధులను ఖర్చు చేయడం కోసం మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అట్టహాసపు రాజధాని నగరం నిర్మాణం కంటే, పాలన వికేంద్రీకరణ చేయడమే మేలని నా అభిప్రాయం.

దాని వల్ల సహజ వనరులపై, ఆర్థిక వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. కేవలం రియల్‌ ఎస్టేట్‌ ‌కోణం నుండే రాజధాని నిర్మాణంపై చర్చ జరుగుతున్నది తప్ప, పాలనా వికేంద్రీకరణ గురించి పార్టీలు స్పష్టంగా తమ అభిప్రాయాలు చెప్పడం లేదు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయాలనుకున్న, ప్రభుత్వానికి నిజానికి కావలసినవి 1571 ఎకరాలు మాత్రమే. ఈ అవసరం కోసం భూమిని సేకరించడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిమితమై ఉంటే,రైతుల నుండి 34281 ఏకరాల భూమిని సమీకరించకుండా ఉంటే, ఇవాళ ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు.
ఆ రోజు వేలాది ఎకరాల సాగు భూమిని ఎవరు చెప్పినా వినకుండా రాజధాని నగర నిర్మాణం పేరుతో సమీకరించారు. ప్రభుత్వం అక్కడ కొలువుతీరి అవసరమైన భవనాలు కొన్ని కట్టుకుని రాష్ట్ర పాలనను సజావుగా సాగించి ఉంటే అనేక సంస్థలు ఆ ప్రాంతానికి తరలి వచ్చి తమకు అవసరమైన భూమిని రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసుకుని ఉండేవి. సంస్థలు నెలకొంటున్న కొద్దీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టీ అభివృద్ధి చేసుకుంటూ పోయేది. ఆయా సంస్థల నుండి పన్నుల రూపంలో, ఆదాయం కూడా వచ్చేది. ఈ క్రమం తప్పి అక్రమంగా రైతుల నుండి భూములను సమీకరించడం, అనేకమంది రాజకీయ నాయకులు బినామీల పేరుతోనో, నేరుగానో వందల ఎకరాలు కొనుగోలు చేయడం, పంటపొలాలను ధ్వంసం చేసి కౌలు రైతులకు, కూలీలకు ఉపాధి లేకుండా చేయడం, ఎక్కడా లేని విధంగా భూముల యజమానులకు ఎకరానికి 50 వేల కౌలు చెల్లించడం, ఉపాధి పోగొట్టుకున్న వ్యవసాయ కూలి కుటుంబాలకు మాత్రం నెలకు 2,500 రూపాయలు మాత్రమే పెన్షన్‌గా చెల్లించడం… ఇవన్నీ సరైన అభివృద్ధి నమూనాగా చెప్పగలమా..? సమీకరించిన భూమినుండి వివిధ సంస్థలకు ఇప్పటికి 1293 ఎకరాలను కేటాయించారు. ఈ కేటాయింపులు అతి తక్కువ ధరలకే చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, తక్కువ ధరకు భూమిని ఇచ్చినా, అర్థం చేసుకోవచ్చు. విద్య, వైద్యం, హోటళ్లు, రిసార్ట్లు, భక్తి వ్యాపారం చేసే సంస్థలకు భూమిని తక్కువ ధరకు ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు ఒక మీడియా సంస్థ కథనం ప్రకారం అమరావతి నగరం పరిధిలో ఎకరం 15 కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. ఆ ప్రకారం ఈ సంస్థలకు ఇచ్చిన భూమి విలువ ఎంత? అంటే అప్పనంగా ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలకు అతి తక్కువ ధరలకే భూమిని కట్టబెట్టారు అన్నమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అమరావతి రాజధాని నగర జనాభా ఒక లక్ష మంది. 2050 నాటికి నగర జనాభా 35 లక్షల మందికి చేరుతుందని, ఈ నగరం 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేశారు.

గుంటూరు, విజయవాడ లాంటి మహా నగరాల మధ్యలో ఇంత జనాభాతో మరో నగరం రూపొందుతుందని అంచనా వేయడం అత్యాశ మాత్రమే. రైతుల నుండి సమీకరించిన భూముల విలువలు గణనీయంగా పెరిగిపోతాయని, సిఆర్‌డిఏ చేతిలో ఉన్న 10 వేల ఎకరాల భూమి విలువ లక్ష కోట్లు ఉంటుందని ఆ మీడియా సంస్థ అంచనా వేసింది. ముందస్తుగా వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం, ఆశించిన స్థాయిలో సంస్థలు, ఈ ప్రాంతానికి తరలి రావడం, ఉపాధి కల్పించే పెట్టుబడి ఆయా సంస్థలు పెట్టడం.. ఇదంతా జరిగితేనే ‘‘వారి’’ కల నిజమవుతుంది. 2019 – 20 రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఆదాయాన్ని 1,79,297 కోట్లుగా, ఖర్చును 2,27,975 కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటు 35,261 కోట్లుగా చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో రుణాలు 2019 – 20 నాటికి 27 శాతానికి చేరతాయని అంచనా. ఈ సంవత్సరం లోనే ప్రభుత్వం 13,417 కోట్ల అసలు,17,244 కోట్ల వడ్డీ, మొత్తం 30,661 కోట్ల రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉందని బడ్జెట్‌ ‌పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
వైఎస్సార్‌ ‌రైతు భరోసా,జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, నీటిపారుదల, గ్రామీణ అభివృద్ధి, విద్యుత్‌, ‌పోలీస్‌, ‌రవాణా, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని బడ్జెట్లో హామీ ఇచ్చారు. మొత్తం బడ్జెట్‌లో ఇవి 70%. ఈ సందర్భంలో రాజధాని నగర నిర్మాణానికి, ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించే అవకాశం లేదు. ఇప్పటికే వ్యవసాయ కుటుంబాలు తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. రుణాల ఊబిలో నుండి బయటకు తేవడానికి ఈ రంగంలో ఇంకా చాలా పెట్టుబడులు ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. గ్రామం, వార్డు స్థాయి సచివాలయాల బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కలను పక్కన పెట్టడమే మంచిది. ఆ ప్రాంత నిజమైన రైతులు ఎవరైనా నష్టపోతూ ఉంటే, వారు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
– ‌కన్నెగంటి రవి
గ్రామీణ కార్యకర్త,, 9912928422

Leave a Reply