Take a fresh look at your lifestyle.

ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాజధాని వివాదం… కొన్ని అభిప్రాయాలు..

ఈ ‌సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. పచ్చిగా బూతులు తిట్టుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ‌ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ ఉన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా  ప్రజలు తమ సమస్యలపై పోరాడినప్పుడు, అధికార పార్టీ పోలీసు బలగాలతో హింస ప్రయోగించడం సర్వసాధారణమే. ఇప్పుడు అదే వైఖరితో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా అమరావతి ప్రాంత ప్రజలపై హింసను ఉపయోగిస్తున్నది.

capital issue, amaravathi, telugudesam party
ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర రాజధానిని అమరావతికే పరిమితం చేయకుండా, 3 రాజధానులుగా నిర్మించాలని వచ్చిన ప్రతిపాదన మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో చర్చల సరళిని పూర్తిగా మార్చివేసింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని 29 గ్రామాల ప్రజలు సాగిస్తున్న పోరాటం తెలుగు మీడియాలో ఎక్కువ సమయాన్న,స్థానాన్ని ఆక్రమించింది. 29 గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. జనసేన, సీపీఐ పార్టీలు కూడా ఇదే వైఖరిని కలిగి ఉన్నాయి. తాజాగా బిజెపి పార్టీ కూడా అమరావతిలో నే రాజధానిని కొనసాగించాలని తీర్మానించి, సంక్రాంతి పండుగ తరువాత ప్రత్యక్ష ఉద్యమం చేస్తానని ప్రకటించింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా వైఎస్సార్‌ ‌సిపి జిల్లాలలో ర్యాలీలను ప్రారంభించగా, అమరావతి ప్రాంత పోరాటాన్ని మరింత విస్తరింప చేయడానికి టిడిపి పార్టీ ప్రయత్నిస్తున్నది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. పచ్చిగా బూతులు తిట్టుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ‌ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ ఉన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా  ప్రజలు తమ సమస్యలపై పోరాడినప్పుడు, అధికార పార్టీ పోలీసు బలగాలతో హింస ప్రయోగించడం సర్వసాధారణమే. ఇప్పుడు అదే వైఖరితో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా అమరావతి ప్రాంత ప్రజలపై హింసను ఉపయోగిస్తున్నది. ఈ హింసను  ఖండిస్తూ, పోలీసులను దెప్పి పొడిచే నైతికత చంద్రబాబుకు అసలు లేదు. పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే వాళ్లు ఇప్పుడు అమరావతి ప్రాంత ప్రజలపై పోలీసులు చేస్తున్న హింసను కూడా తప్పకుండా ఖండించాలి. ఈ సమస్య సందర్భంగా చంద్రబాబు చేస్తున్న ఉపన్యాసాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. వల్లిస్తున్న నీతులు వినలేకుండా ఉన్నాయి. ఆయన ఆగ్రహ ప్రకటనలు, బిచ్చం ఎత్తడం ఫక్తు రాజకీయాన్నే తలపిస్తున్నాయి. అమరావతి, పోలవరం ఆంధ్ర ప్రదేశ్‌కు రెండు కళ్ళు అని చెప్పడం ద్వారా చంద్రబాబు తన వైఖరిలోని డొల్లతనాన్ని, ఆయన అభివృద్ధి నమూనాను బయట పెడుతున్నాయి. జగన్‌, ‌చంద్రబాబుల రాజకీయాలు, మాటలు, విమర్శలు, వైఖరులు, అభివృద్ధి నమూనా అంతా ఓకే స్వభావానికి చెందినవి. ఎవరు అధికారంలో ఉండి పెత్తనం చెలాయిస్తూ ఉన్నారన్నది చూడడం తప్ప, ఇద్దరికీ నిపుణుల అభిప్రాయాలు, ప్రజల ఆకాంక్షలు వినే లక్షణం లేదు. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకునే అలవాటు లేదు.

తమకు, తమ అనుయాయులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వారి ప్రయోజనాలకు ఎక్కువ  ప్రాముఖ్యత ఇస్తూ పాలన సాగించడం, రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్ర సమగ్ర, సర్వతోముఖ అభివృద్ధి గురించి పెద్దగా పట్టింపు లేదు. పైగా ఈ వైఖరుల వల్ల కలిగే పరిణామాలకు బాధ్యత తీసుకునే లక్షణమూ లేదు. నష్ట పోయే ప్రజలు దుఃఖపడడం తప్ప, వారి రాజకీయ వైఖరులకు పెద్దగా దయాదాక్షిణ్యాలు వుండవు. ఎదుటి పక్షాన్ని సంపూర్ణంగా తుద ముట్టించడం, సుదీర్ఘకాలం అధికారం చేతుల్లో ఉంచుకోవడం అనే ఫాసిస్ట్, ‌ఫ్యాక్షనిస్టు ధోరణులు ఇద్దరిలోనూ సమపాళ్లలో ఉన్నాయి. వాడే భాష వేరుగా ఉండొచ్చు కానీ, మానసిక స్థితి మాత్రం ఒకటే.మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా దివాలా తీసిందంటే, అప్పుల ఊబిలో కూరుకు పోయిందంటే ఈ పార్టీలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాయే కారణం. వైఎస్‌ఆర్‌సిపి మరియు టిడిపి లేవనెత్తుతున్న అభివృద్ధి చర్చలో మునిగి పోకుండా, అమరావతి రాజధానిగా ఉండాలా, మూడు రాజధానులు అవసరమా అనే చర్చ చుట్టూనే తిరగకుండా, ప్రజల దృష్టి కోణం నుండీ అభివృద్ధి నమూనాను పునర్‌ ‌నిర్వచించాలి.  ఒక రాష్ట్ర సహజ వనరులకు, ఆర్థిక వనరులకు ఉండే పరిమితులను దృష్టిలో ఉంచుకోకుండా, నిజంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్నది పరిగణనలోకి తీసుకోకుండా, పై స్థాయిలో రాజకీయ పార్టీలు వెల్లడించే వైఖరులు, చేస్తున్న ఆందోళనలు మాత్రమే చర్చకు ప్రాతిపదిక కాకూడదు. అందుకే అభివృద్ధి అంటే ఏమిటి? పరిపాలన అంటే ఏమిటి ? ముందుగా నిర్వ చించుకుంటే అప్పుడు రాజధాని ఎక్కడ, ఎలా ఉండాలి అన్నది స్పష్టమవుతుంది.

కొన్ని అభిప్రాయాలు..
‘‘దేశమంటే మట్టి కాదోయ్‌ ‌దేశమంటే మనుషులోయ్‌’’ అన్నాడు మహాకవి గురజాడ. అందమైన పెద్ద పెద్ద  భవంతులు, విశాలమైన రోడ్లు, మెట్రో రైళ్లు, విస్తరించిన పార్కులు.. ఇదే అభివృద్ధి అనుకునే వాళ్లకు మనుషులు అసలు ఎజెండాలో ఉండరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని చుట్టూ జరుగుతున్న చర్చలో కూడా ఇదే కనపడుతున్నది. అభివృద్ధిని మనం ఎలా చూస్తాం?
అభివృద్ధి అంటే.. సహజ వనరుల సద్వినియోగం, ప్రజలకు జీవనోపాదుల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ. ఈ అవగాహనతో పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గత, ప్రస్తుత పాలకులు ముందుకు తోస్తున్న అభివృద్ధి నమూనా సవ్యంగానే ఉందా?
అవినీతికరమైన రాజకీయ వ్యవస్థ, కార్పొరేట్‌ ‌కంపెనీలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రణాళికలు, ప్రజల ఓట్లతో చేజిక్కిన అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకునే ప్రజా ప్రతినిధులు..వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు అభివృద్ధి గురించి కొత్త పద్ధతిలో చర్చ ఎలా జరుగుతుంది?
ఈ అభివృద్ధి నమూనా వల్లనే ప్రాంతాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధి కాకుండా, పాలకులు అనుకునే ‘‘అభివృద్ధి ‘‘కూడా కొన్ని ప్రత్యేక ప్రాంతాలకే పరిమితం అవుతున్నది. మిగిలిన ప్రాంతాలు బాగా వెనకబడి ఉంటున్నాయి. పైగా ఈ అభివృద్ధి నమూనాలో స్థానిక ప్రజల నిజమైన అవసరాలు ఏమిటి ? అన్నది చర్చలో లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాలలో విధ్వంసమే జరుగుతున్నది.

ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ, ఓపెన్‌ ‌కాస్ట్ ‌మైనింగ్‌ ‌పేరుతో అడవులు కొట్టేయడం, మైనింగ్‌ ‌పేరుతో కొండలు, గుట్టలు తవ్వేయడం, సముద్రతీర ప్రాంతాలను పెట్రో కారిడార్‌ల పేరుతో విష పూరితం చేయడం, ఎక్స్ప్రెస్‌ ‌హైవేల పేరుతో అడవులు కొట్టివేస్తూ వేలాది ఎకరాల సాగు భూములను సేకరించడం, ఓడరేవులు, థర్మల్‌  ‌విద్యుత్‌ ‌కేంద్రాల నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో వేలాది ఎకరాల సాగు భూములు సేకరించడం..ఇవన్నీ  సహజ వనరులను దుర్వినియోగం చేయడమే, కాలుష్య భరితం చేయడమే. వీటన్నిటి వల్ల ఉపాధి అవకాశాలు ఎంతగా పెరిగాయి అన్నది ప్రశ్నార్థకమే. కానీ ఈ అభివృద్ధి నమూనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ‌పర్యావరణాన్ని అనేక రూపాల్లో విధ్వంసం చేస్తుందన్నది వాస్తవం. చంద్రబాబు, జగన్‌ల మధ్య ఈ అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకువెళ్లే విషయంలో పెద్ద పేచీ లేదు. మారేదల్లా ప్రాజెక్టుల రీ డిజైన్లు, కాలపరిమితి నిర్వచిస్తూ రీ షెడ్యూల్‌లు, కొత్త కాంట్రాక్టర్లు, కొత్త కంపెనీలు, కొత్త ‘‘కమిషన్లు’’. అంతే. వీటిపై తెలుగు మీడియాలో సమగ్ర చర్చ జరగదు. అమరావతిపై మాత్రం మీడియా రెండు పక్షాలుగా చీలిపోయి పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నది. ఈ అభివృద్ధి నమూనాలో నిర్వాసితులైన, ఉపాధి కోల్పోయిన ప్రజల గురించి ఈ మీడియా ఎటువంటి చర్చ లేవనెత్తదు. పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులు అయ్యే లక్షలాది మంది ఆదివాసీల గురించి, తీర ప్రాంత విష కాలుష్యం వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారుల గురించి, ఏనాడు చర్చించని మీడియా, అమరావతి ప్రాంత 29 గ్రామాల పరిధిలో అప్పుడే 15 మంది మరణించారు అని గగ్గోలు పెడుతున్న ది. ఎవరి జీవితం అయినా విలువైనదే. ఎవరి మరణమైనా బాధాకరమే. కానీ మీడియా కొన్ని ఘటనలను సెలెక్టివ్గా పదేపదే చూపిస్తూ, మిగిలిన చర్చను పక్కదారి పట్టిస్తుంది.

అమరావతి రాజధాని గురించి ఎవరైనా చర్చించే ముందు ముందుగా పోలవరంతో సహా చంద్రబాబు, జగన్‌ ‌ప్రభుత్వాలు ఒకే వైఖరితో కొనసాగిస్తున్న అభివృద్ధి నమూనాపై, ప్రాజెక్టులపై చర్చించాలి. సహజ వనరులను ధ్వంసం చేస్తూ, దుర్వినియోగం చేస్తూ, దుబారా చేస్తూ కొనసాగిస్తున్న అన్ని ప్రాజెక్టులు తక్షణం ఆపాలని, ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని డిమాండ్‌ ‌చేయాలి.మనం డిమాండ్‌ ‌చేసేటప్పుడు కుల, మత, ప్రాంత సెంటిమెంట్లు అడ్డు రాకూడదు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక  భూ వినియోగ  విధానం తీసుకురావాలని మనం అడగాలి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా సాగు భూముల్ని దారి మళ్ళించే అన్ని ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని మనం అడగాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు, ఉపాధి అవకాశాల కల్పనకు, ఆదాయాల పెంపుదలకు ముందుగా  ఒక సమగ్ర విధానం రూపొందాలి. ఆ విధానాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టాలి. అప్పుడే ఆ విధానం కోసం ఆర్థిక వనరులు ఖర్చు చేయాలని సంకల్పిస్తే , ఆ తరువాత పరిపాలన ఎక్కడినుండి చేయాలి అన్న ప్రశ్నకు జవాబు వెతకవచ్చు. అంతే గానీ ఇష్టమొచ్చినట్లు  ప్రణాళికలు తయారు చేయడం, వాటిని మార్చడం ఏ ప్రభుత్వమైనా మానుకోవాలి. ఈ పార్టీలు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి తప్ప, స్వంత జాగీరుగా రాష్ట్రాన్ని చూడకూడదు.
ఆంధ్రప్రదేశ్‌ ‌రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంలో రాష్ట్ర సాధారణ ప్రజలకు ఆసక్తి లేదు. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ‘‘అమరావతి’’ చుట్టూ రాష్ట్ర ప్రజలు ఆలోచించేలా చేయడానికి ఆపసోపాలు పడుతూ ఉన్నాయి. కానీ నిజానికి ప్రజలు ఆలోచిస్తున్న అంశాలు వేరేగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రాంతాల అసంఘటిత కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు తమ నిత్య జీవన సంఘర్షణ నుండి బయటపడడానికి, స్థానిక పరిపాలన మరింత బలోపేతం అవ్వాలని, స్థానికంగా తమకు ఉపాధి అవకాశాలు మెరుగు అవ్వాలని, తమ ఆదాయాలు పెరగాలని కోరుకుంటున్నారు. పరిపాలనలో అవినీతి, లంచగొండితనం లేకుండా తమకు సేవలు సజావుగా అందాలని కోరుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, శాసన సభ్యులు తమకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నారు.

2019 ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్‌ ‌సిపి ప్రభుత్వం అటువైపు కొన్ని అడుగులు వేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను, నగర ప్రాంతంలో ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను, నియమించింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 10 మంది సిబ్బందితో వివిధ అంశాలపై పని చేయడానికి గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. అలాగే నగర ప్రాంతాలలో కనీసం ఆరుగురు సిబ్బందితో వార్డు స్థాయిలో సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటులో, సిబ్బంది ఎంపికలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజం. వాటిని విడిగా చర్చిద్దాం.రాజ్యాంగంలో చేసిన 73, 74 సవరణలు స్థానిక సంస్థల అధికారాల గురించి నిర్దిష్టంగా చెప్పాయి. కానీ, దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఎప్పుడూ అధికారాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో, రాష్ట్రస్థాయి బ్యూరోక్రాట్ల చేతిలో కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా, అవి బాధ్యతలు స్వేచ్ఛగా నిర్వర్తించకుండా కట్టడి చేస్తూ వచ్చాయి.

(మిగతా రేపటి సంచికలో)

కన్నెగంటి రవి
గ్రామీణ కార్యకర్త,, 9912928422

Leave A Reply

Your email address will not be published.