Take a fresh look at your lifestyle.

సారా తయారీని కట్టడి చేయలేమా?

“ప్రభుత్వం ఈ సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చిత్త శుద్దితో దీనిపై సమరం చేయగలిగితే తప్పకుండా ఈ జాడ్యం నుండి బయట పడవచ్చును.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ ‌స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవడానికి ఈ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించే ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.హైదరాబాద్‌లోని ధూల్‌పేట, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ‌సిద్దిపేట జిల్లాల్లో ఈ పథకంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇన్ని జరిగినా సారా తయారీ నుండి బయట పడని వాళ్ళను మాత్రం కఠిన శిక్షలు వేసి వేరొకరు ఈ వృత్తి లోనికి రాకుండా చేయగలగాలి దీనికి ప్రభుత్వాధినేతలు ప్రజల భాగస్వామ్యంతో చిత్త శుద్ధితో ముందుకు వెళ్లగలిగితె తప్పక సత్ఫలితాలు సాదించవచ్చును.” 

కాపు సారా అనేది అనేక మంది బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన ఎందరో ఈ నాటు సారా తాగి నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. గడచిన కొద్ది రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ముఖద్వారంగా చెప్పబడే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒకే విధమైన లక్షణాలతో దాదాపు 18 మంది మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మొదటి రోజు కడుపు నొప్పి వాంతులు విరేచనాలతో హాస్పిటల్‌ ‌జాయిన్‌ ‌కాబడిన కొద్ది గంటలలోనే మరణాలు సంభవించడం పెద్ద మిస్టరీ అంటూ పత్రికలలో కధనాలు వచ్చాయి .అయితే ఈ మరణాలకు నాటు సారా కల్తీయే కారణం అంటూ కొందరు కుటుంబ సభ్యులు చెప్పడం ప్రతిపక్షాలకు చెందిన వారు స్పందించడంతో నెమ్మదిగా వాస్తవాలు బయట పడుతున్నాయి.అయితే ప్రభుత్వం మాత్రం రెండు మూడు మరణాలు తప్ప మిగిలినవి అన్నీ కూడా సహజ మారణాలే అంటూ ప్రకటించింది.చనిపోయిన వారందరూ రోజు కూలీల కావడంతో ఇవి సారా మారణాలే అయి ఉండవచ్చునని అనుమానాలు బల పడుతున్నాయి.ఈ మరణాలు కల్తీ సారా వలన జరిగాయా కాదా అనేది పక్కన పెడితే రోజు వారీ కూలీ పని చేసుకుని జీవించే శ్రామికులు మాత్రం తమకు వచ్చిన అల్ప వేతనాలతో ఖరీదైన మద్యం కొనుగోలు చేయలేక చవకగా లభించే నాటు సారా త్రాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనేది మాత్రం నిజం ప్రాణాంతకంగా పరిణమిస్తున్న ఈ సారా తయారీ అనేది ఈ రోజే ప్రత్యక్షం కాలేదు ఎప్పటి నుండో వేళ్లునుకుని ఉన్న ఒక చట్ట విరుద్ధ కార్యకలాపం ఇది.

గ్రామ ప్రాంతాలలోను తీర ప్రాంతాలలో లంక ప్రాంతాలలో ఏజెన్సీ ప్రాంతాలలోను ఈ సారా తయారీ అనేది నిత్య కృత్యం అయిపోయింది.ఇక్కడ తయారైన సారా దగ్గర పట్టణాలలో పాకెట్ల రూపంలో విక్రయిస్తూ సారా తయారీదారులు లాభాలు ఆర్జించుకుంటు ఉండగా. హానికరమైన ఈ సారా సేవిస్తూ కాలగమనంలో సారా ప్రియులు మాత్రం ప్రాణాలను కోల్పోతు కుటుంబాలను అనాధలను చేస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో మాత్రం ఈ సారా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది.ఎక్సయిజ్‌ ‌సిబ్బంది దాడులు చేసిన ప్రతీ సారీ తయారీదారులు తమ ఉత్పత్తి కేంద్రాలను మార్పు చేసుకుంటూ అప్రతిహాతంగా సారా తయారీ కొనసాగి స్తున్నారు.ఒక వేళ దాడులలో చిక్కినప్పటికి సారా బట్టీల వద్ద పని చేసే కూలీలను మాత్రం కేసులలో ఇరికిస్తున్నారు. సూత్రధారులు మాత్రం ఎప్పుడూ బయటకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం మాత్రం మద్యాన్ని దశలు వారీగా నిషే ధిస్తాం అని చెప్పి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేపట్టింది. మద్యానికి అధిక ధరలు విధించడం ద్వారా క్రమేపీ మద్యానికి వినియోగం తగ్గి కాల గమనంలో మద్యం డిమాండ్‌ ‌పడిపోతుంది అనేది ప్రభుత్వ వాదన.

kapu sara

అయితే మద్యానికి బానిస అయిన పేదవాళ్ళు మాత్రం అధిక ధరలకు కొనలేక మద్యానికి ప్రత్యమ్నాయంగా చౌకగా దొరికే నాటు సారాను ఆశ్రయిస్తున్నారు.ఈ నాటు సారా అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే దీని తయారీలో నల్లబెల్లం, హానికర రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తారు. ఆ మిశ్రమం త్వరగా పులియడానికి, మరింత మత్తు రావడానికి బ్యాటరీ పొడీ, యూరియా వంటివి కలుపుతారు. ఇలా తయారయ్యే సారాలో ఎక్కువ మోతాదులో ఫ్యూజల్‌ ఆయిల్‌, ఆల్డిహైడ్స్, ‌తక్కువ శాతంలో మిథనాల్‌ ఉం‌టాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూజల్‌ ఆయిల్‌, ఆల్డిహైడ్స్ ‌శరీరంలో కండర వ్యవస్థ, నాడీ మండలం, జీర్ణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.రక్తంలో కీటోన్లు పెరగటంతో కండరాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రధానంగా ఎక్కువ నిషా కోసం బ్యాటరీ దిమ్మలు పగుల గొట్టి అందులో నల్లగా వుండే పౌడర్‌ను కలుపడం వలన మరింత ప్రమాదం వాటిల్లుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు శుభ్రత పాటించకుండా ప్రమాణాలు అనేవి పక్కన పెట్టి విషతుల్య పదార్ధాలతో నిషా అనేదే పరమావధిగా తయారైన సారా తీసుకోవడం వలన క్రమేపీ శరీరం విషతుల్యం అయిపోతుంది.వీటి అవశేషాలు శరీరంలో చేరిపోతున్నాయి.ఇవి దేహంలో పూర్తిగా జీర్ణం కావడానికి కనీసం మూడు నెలలకు పైగా పడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.’’ దీంతో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు ముసురుకుంటున్నాయి .ప్రధానంగా మానవ శరీరంలో మొండి అవయువంగా చెప్పుకొనే కాలేయం సారా వలన తీవ్రంగా దెబ్బతింటుంది. సారాకు అలవాటు పడిన వారి సగటు ఆయుష్షు 45 ఏళ్లు.. గిరిజనుల్లో అయితే 35 ఏళ్లు మాత్రమేనని వివిధ పరిశీలనల్లో వెల్లడైంది. ఇక సారాకు బానిసైన యువకుల్లో పనిచేసే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. విపరీతంగా సారా తాగేవారికి, కేవలం అలవాటుగా ఉన్న వారికి మధ్య పనిచేసే సామర్థ్యంలో 21 శాతం తేడా ఉందని తేలింది. కేవలం అలవాటుగా ఉన్నవారికి, అసలు సారా అలవాటులేని వారితో పోల్చితే..35శాతం పనిచేసే సామర్థ్యం తక్కువని వివిధ అద్యయనాలలో నిరూపించబడింది.మరొక అధ్యయనం ప్రకారం చూస్తే రాష్ట్రంలో చిన్న వయసులోనే వితంతు పింఛన్‌ ‌తీసుకున్న మహిళల వివరాలు పరిశీలిస్తే వారి వైధవ్యానికి సారా మరణాలే కారణం అని తేలింది.శారీరక శ్రమ చేసే శ్రామికులు తమ శ్రమను మరచి పోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది అనే భావనతో తమకు వచ్చే అల్ప ఆదాయంలో తక్కువ ధరకే లభించే సారాను తాగుతున్నారు.అయితే దీని వలన తక్షణమే మరణం సంభవించక పోయినా అతి స్వల్ప కాలంలోనే దేహంలో అనేక రుగ్మతలు ఏర్పడి మరణం అనేది తథ్యం అవుతుందనేది మాత్రం వాస్తవం.అయితే ఒక్క సారిగా సారా సేవించే వాళ్ళు అందరూ ఒకే తరహా లక్షణాలతో మరణిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది కల్తీ సారా అయి ఉంటుంది.ఎందుకంటే గతంలో ఇటువంటి కల్తీ సారా వలన కల్తీ కల్లు వలన వరుస మరణాలు సంభవించిన ఘటనలు మనం ఎన్నోచూశాం.తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో 2010లో కల్తీ సారాకు 21 మంది పేదలు కల్తీ సారాతో మృత్యువాత పడటం అప్పట్లో సంచలనం రేపింది.

అదే ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో 17 మంది నాటు సారాకు బలయ్యారు.ఇవే కాదు ఇంకా లెక్కలోనికి రాని కల్తీ సారా మరణాలు అనేకం ఉన్నాయి.సారా తయారీ దారులు మాత్రం తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ ఆదాయం రావడంతో దీనిని వృత్తిగా కుటీర పరిశ్రమగా చేపడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉండటం గమనార్హం.ఇలా తయారైన సారాను గుట్టు చప్పుడు కాకుండా పట్టణాలకు తరలించి విక్రయాలు జరుపుతూ ఉన్నారు. ఈ అమ్మకాలకు పిల్లలను సైతం ఉపయోగించడం విచారించదగ్గ విషయం.కిక్కు కోసం అనేక మంది సారా వ్యసనపరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారి కుటుంబాలను దిక్కులేని వారుగా చేస్తున్నారు. ఈ నిషాలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి.ఎన్నో వైవాహిక సంబంధాలు బీటలు వారుతున్నాయి. కట్టడి చేయలేక పోతున్న ఈ సారా తయారీ కాల క్రమంలో ఒక మాఫియాగా పరిణమించడంతో ప్రభుత్వం ఎక్సయిజ్‌,‌పోలీస్‌ ‌సిబ్బందితో అనేక సార్లు దాడులు చేసినా మరలా సారా తయారీ పునరావృతం అవుతూనే ఉంది. దీనికోసం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేసి దాడులు చేస్తూ ఉన్నా కట్టడి చేయలేక పోతున్నారు.గతంలో అయితే మద్యం అమ్మకాలు ప్రైవేట్‌ ‌వ్యాపారులు చేతిలో ఉండేది. అప్పుడు వారి అమ్మకాలకు సారా తయారీ ఆటంకం కలుగుతుందని భావించిన ప్రైవేటు అమ్మకం దారులు సారా తయారీని అరికట్టడానికి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎక్సైజ్‌ ‌శాఖకు అందించడానికి ప్రత్యేక ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసేవారు.అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ‌లో మద్యం అమ్మకం ప్రభుత్వం చేతిలోనికి వెళ్ళింది. దానికి తోడు మద్యం ధరలు కూడా అధికంగా ఉండటం చేత సారా ఉత్పత్తి దారులు డిమాండ్‌ ‌మేరకు తమ ఉత్పత్తుల పెంపుపై దృష్టి పెట్టారు.దీనిని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి నాటుసారాతో కలిగే అనర్దాలను వివరిస్తూ దానివలన కుటుంబం ఏ విధంగా ఇక్కట్లకు గురి అయ్యేది ఉదాహరణలు ద్వారా ఎక్సైజ్‌ ‌శాఖ గ్రామాల్లో నాటుసారా కట్టడికి ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక యాక్షన్‌ ‌ప్లాన్‌ (‌కార్యాచరణ) అమలులోకి తెచ్చింది. దానిని సేవించే వారికి సారా వలన కలిగే అనర్ధాలను వివరించే విధంగా సభలు ఏర్పాటు చేయడం జరిగింది.

సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే కొరియర్‌ (‌వేగుల) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది.అయినా కూడా సారా బట్టీలు పుట్టుకు వస్తున్నాయి. దీని ఉత్పత్తి మాత్రం ఆగలేదు ఎన్నో దాడులు చేసి ఉత్పత్తి కేంద్రలవద్ద ముడి పదార్ధాలను పరికరాలను ద్వంసం చేసినా కూడా ప్రదేశాలు మారుస్తూ ఉత్పత్తి సాగిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో నాటు సారా పై ఉక్కు పాదం మోపడానికి ఎస్‌ఈబీ పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికే నాటుసారా నియంత్రణ బాధ్యతలు అప్పగించారు. దీని ద్వారా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. దాడుల సమయంలో సమాచారం వాళ్లకు తెలియడంచేత దొరకకుండా ఉడాయిస్తున్నారు. ఎక్సయిజ్‌ ‌శాఖకు ముడుపులు ముట్టడం వల్లనే సారా మాఫియాను అరికట్టలేకపోతున్నారు అనే విమర్శ కూడా లేకపోలేదు. ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రం నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న సమయంలో తక్షణ చర్యలు చేపడతారు. దురదృష్టకరమైన ఈ సంఘటనలకు నాయకులు సంతాపం ప్రకటిస్తారు.మృతుల తల్లులో, భార్యలో విపరీతంగా రోదించే దృశ్యాలు, ప్రభుత్వం పరిహారం ప్రకటించడం, కల్తీ మద్యానికి కారకులనుకున్న కొంతమందిని అరెస్టు చేయడం అక్కడితో ఆ కథ ముగుస్తుంది.

ప్రజలు కూడా ఈ విషయం మరచిపోతారు. మరలా సమస్య ఆరంభం జరుగుతుంది. ఇక్కడ సమస్య కల్తీ సారాపై కాదు సారా ఉత్పత్తి పై.కల్తీ సారా వలన మరణించారు కనుక ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి అనేది ప్రధానం కాదు అసలు సారా ఉత్పత్తినే అణచి వేయాలి.జనం గొంతులో గరళం నింపుతున్న ‘నాటు సారా’పై వేటు వేయాలి.ఒక్కరు మరణించారా పది మంది మరణించారా అని వాదులాడుకుంటు ఉంటే అసలు సమస్య పక్కకు పోతుంది.సమస్య శాశ్వత పరిష్కారానికి ఆరోగ్యదాయకమైన చర్చ జరగాలి.సారాకు బానిస అయిన వారికి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి.ప్రత్యేకించి సారా తయారీకి వినియోగించే ముడి పదార్ధాలను అమ్మే వ్యాపార సంస్ధలపై కఠిన శిక్షలు అమలుచేయగలిగితే సారా తయారీ మూలాలను పెకళిం చవచ్చు.దీనితో పాటు పౌర సంఘాలను స్వచ్చంద సంస్ధలను .ఉన్నత విద్యా వంతులను ఉపాధ్యాయులను ఉపయోగించుకుని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. సారా తయారీ దారులకు సారా సేవించే వారికి ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు వాటిని సమీక్ష చేస్తూ ముందుకు వెడితే తప్పక ఫలితాలు సాధించవచ్చు.

ప్రభుత్వం ఈ సారా తయారీని సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చిత్త శుద్దితో దీనిపై సమరం చేయగలిగితే తప్పకుండా ఈ జాడ్యం నుండి బయట పడవచ్చును.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం రిహాబిలిటేషన్‌ ‌స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. సారా తయారు చేసే కుటుంబాలు ఆ పనిని వదిలేసి.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసు కోవడానికి ఈ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించే ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. హైదరా బాద్‌లోని ధూల్‌పేట, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ‌సిద్దిపేట జిల్లాల్లో ఈ పథకంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇన్ని జరిగినా సారా తయారీ నుండి బయట పడని వాళ్ళను మాత్రం కఠిన శిక్షలు వేసి వేరొకరు ఈ వృత్తి లోనికి రాకుండా చేయగలగాలి దీనికి ప్రభుత్వా ధినేతలు ప్రజల భాగస్వామ్యంతో చిత్త శుద్ధితో ముందుకు వెళ్లగలిగితె తప్పక సత్ఫలితాలు సాదించవచ్చును.అలా లేని నాడు సారా బట్టీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సారా మరణాలు కల్తీ సారా మరణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

రుద్రరాజు శ్రీనివాసరాజు లెక్చరర్‌, ఐ.‌పోలవరం, 9441239578.

Leave a Reply