Take a fresh look at your lifestyle.

పంటల కొనుగోళ్లలో ఏటా తిప్పలే !

సంక్రాంతి సందర్భంగా అన్నదాతలను పొగడడం..రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం మినహా సంపూర్ణంగా రైతులకు మేలు జరగడం లేదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్తాయిలో ఆలోచన చేయడం లేదు. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో పంటల కొనుగోళ్లు అనేవి ఏటా ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పంటలను సకాలంలో కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించే పక్కా ఏర్పాట్లు జరగడం లేదు.  కేంద్రం ఈ-నామ్‌ ‌ప్రవేశ పెట్టినా రైతుల కష్టాలు తీరడం లేదు. పంటలకు జాతీయస్థాయిలో ధరలు వస్తాయని, కొనుగోళ్లు జరుగుతాయని భావించారు. అయినా అలా జరగడం లేదు. దీంతో ఏటా పంట ఉత్పత్తులు అమ్ము కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రైతులు కోనసీమలో ట్రాక్టర్లపై ధాన్యం బస్తాలు వేసి కలెక్టరేట్‌ ‌ముందు నిరసన తెలపడం గమనించాం. పంటలు ఏవైనా ఈ నామ్‌ ‌కింద వ్యాపారులు తీసు కోవడం లేదు. మార్కెట్లలో కూడా పక్కాగా అమలు జరగడం లేదు. తెలంగాణలో గోదాముల సంఖ్య పెరిగి నా అందుకు తగ్గట్లుగా మార్క్‌ఫెడ్‌ ‌కొనుగోళ్లు పెరగడం లేదు.

ఈ పరిస్థితి తెలుగు రాష్టాల్రకు సంబంధించినదే కాదు..దేశ వ్యాప్తంగా ఇదే తీరుగా ఉంది. జిల్లాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఒక ప్రహాసనంగా మారింది. అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి నెలకొన్న పరిస్థితులకు పొంతన ఉంటడం లేదు. మిల్లర్లే నేరుగా కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. రైతు భరోసాకేంద్రాలకు వచ్చిన రైతులను కూడా మిల్లర్ల వద్దకు పంపుతుండగా వారు తేమశాతంపై మరోసారి పరీక్ష చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ లక్ష్యంగా చాలా తక్కువగా ఉండటం వల్ల జిల్లాలో పండిన ధాన్యంలో దాదాపు 75 శాతం మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి.  రబీ పంటలు సాగు పూర్తయిన తరువాత కుప్పలను నూర్పిడి చేసి విక్రయించుకునేలా సిద్ధం అవుతున్నారు. ధాన్యం మద్ధతు ధర ఈ ఏడాది క్వింటాలుకు ఏ గ్రేడు రూ.2060 కాగా, సాధారణ రకం రూ.2040 ఉంది. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఏగ్రేడు ధాన్యం పండిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మిల్లర్లు నగదు ఇచ్చి కొంత మంది రైతుల వద్ద క్వింటాలు రూ.1800 నుంచి రూ. 2 వేల వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిసింది.ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి, ప్రభుత్వం ఆంక్షలు, రవాణా ఛార్జీలు,నిల్వ చేసుకునే అవకాశం లేని వారు పొలాల్లోనే విక్రయిస్తున్నారు.

ప్రధానంగా తెలంగాణ వ్యాపారులు బిపిటి ధాన్యం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు కూడా భారీగా పెరగడంతో తెలంగాణ వ్యాపారులు జిల్లాకుపెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిసింది. జిల్లాకు చెందిన మిల్లర్లు తేమశాతం నిబంధనతో ఆంక్షలుపెట్టడం వల్ల రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో రైతులు మిల్లర్లు, వ్యాపారులకు పొలాల్లోనే విక్రయించుకుంటున్నారు. డెల్టా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు పొలాల్లో కుప్పలు వేసి రెండో పంట వేశారు. మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకోవాలన్న లక్ష్యంతో వరిని కోసి కుప్పలు వేసి రబీ సాగు వైపు మొగ్గుచూపారు. గత అక్టోబరులో అధిక వర్షాలకు తడిసిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. నిబంధనలు సడలించాలని కోరారు.

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ఆధిపత్యం తగ్గించాలని, ఆర్‌బికే సిబ్బంది బాధ్యత తీసుకుని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారని నిర్దారణ అయిన తరువాతనే మిల్లర్‌ ‌వద్దకు పంపాలని కోరారు. మాండూస్‌ ‌తుపాను వల్ల నష్టపోయిన పైర్లకు సంబంధించి రైతులకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇకపోతే తెలంగాణలో పలు జిల్లాల్లో కంది రైతులకు వారు పండించిన కందులను మార్కెట్‌లో అమ్మడం ఇప్పుడు ఒక పరీక్షలా మారింది.మరోవైపు మద్దతు ధరలు పలకడం లేదు. మద్దతు ధర అందక ప్రైవేట్‌ ‌వ్యాపారులకు కందులను తెగనమ్మకుంటున్నారు. మిర్చి, పత్తిరైతుల పరిస్తితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. మార్కెటింగ్‌ ‌శాఖ అధికారులు  పదేపదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మార్పులు కానరావడం లేదు. మార్కెట్లో అమ్మకానికి సిద్దంగా ఉన్న నిల్వలు అమ్ముకోలేక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

మిర్చి,పత్తి రైతులు కూడా ఇదే రకమైన ఆందోళనలో ఉన్నారు. ఓ వైపు ధరలు లేక మరోవైపు కొనుగోళ్లు సాగక ఆందోళనగా చూస్తున్నారు. సంక్రాంతి వేళ ఆనందంగా ఉండాల్సిన అన్నదాతలు కొనుగోళ్లు లేక మరికొన్నిచోట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడం తలకుమించిన భారం అవుతోంది. దీనికితోడు గన్నీబ్యాగుల కొరత వారిని వేధిస్తోంది. ఇకపోతే నిల్వ చేయడానికి సరిపడా గోదాంలు లేకపోవడంతో సంబంధిత మార్కెటింగ్‌ అధికారులు కందుల కొనుగోళ్లు నిలిపివేశారు. రైతులు ఎప్పుడు అమ్ముకుందామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రైతులకు వ్యవసాయ మార్కెట్‌లో తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా  ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ’ఈ-నామ్‌’ ‌విధానం  పూర్తయినప్పటికీ ఇంత వరకు సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. మిరప, పసుపు పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు చెల్లించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌ ‌బీమా యోజనలో రైతులకు న్యాయం జరగగడం లేదు. మొత్తంగా సమస్యలను వదిలి పాలకులు తమ సొంత విధానాలను రుద్దతున్నారు. అలా కాకుండా క్షేత్రస్థాయి అవగాహనతో రైతు సంక్షేమకార్యక్రమాలు అమలుజరగాలి. అప్పుడే అన్నదాతకు ఊరట కలుగుతుంది.

-ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply