భిన్నత్వంలో ఏక త్వం భారత నినాదంగానే మిగు లుతోంది. వైవిధ్య భరిత సమాహారం నా భారతం అన్న మాట చేదెక్కుతోంది. తీరొక్క సంస్కృతులు, ఆచార వ్యవ హారాలు మన ప్రత్యేకతలని ప్రసంగాలు చేస్తున్నాం. 140 కోట్ల భారతమాత ముద్దు బిడ్డలు సమైక్యతకు పునాదుల ంటూ ఊదరగొడుతున్నాం. దేశానికే అందాలు ఈశాన్య రాష్ట్రాల లోయలు, కొండల్ని సంబరపడ్డాం. భరత మాత నుదుట కాశ్మీరీ సౌందర్య తిలకమంటూ గొప్పగా చెప్పుకున్నాం. దక్షిణాన కేరళ ప్రకృతి సౌందర్య విందులు వగరుగా ఉంటున్నాయి. పలు రకాల పండుగలు, వేనవేల వేషధారణలు నా దేశ అపూర్వ సంపదలంటూ బాకీ ఊదుతున్నాం. కులమతాలు, జీవనశైలిలో విభిన్న నమ్మకాలంటూ నినాదాలు చేస్తున్నాం. శతాబ్దాలుగా దేశ ప్రజలు చూపిన సహనశీల భక్తి విశ్వాసాలతో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచింది నా హిందుస్థానమంటూ భజన చేస్తున్నాం. వీటన్నింటినీ అనవసర అర్థరహిత అపోహలు, దుష్ప్రచారాలు, స్వార్థపూరిత రాజకీయాలు, అవినీతి నాయకులు మన దేశ సమగ్రతకే తూట్లు పొడిచే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో గత కొన్ని రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో ఆవేశాగ్ని ఎగిసి పడుతున్న వేళ దేశ సమగ్రత, సమైక్యత, శాంతియుత సహజీవనాలు నివ్వెరపోయి చూస్తున్నాయి.
మణిపూర్‌లో నెలకొన్న ప్రధాన సమస్యలు:
భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మణిపూర్ జనాభా దాదాపు 34 లక్షలు ఉన్నారు. ఇంఫాల్ రాజధానిగా 9 జిల్లాలుగా విస్తరించిన మణిపూర్‌లో ‘మెయితీ’ తెగకు చెందిన ప్రజలు మెజారిటీగా ఉన్నారు. మెయితీ జాతీయ భాషను అధికంగా మాట్లాడే మణిపుర్‌లో మాదకద్రవ్యాల దురలవాటు పెద్ద సమస్యగా నిలుస్తూ ఏయిడ్స్ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది. నాగా, కుకీ-జో మైనారిటీ తెగల మధ్య విభేధాలతో మారణకాండ జరుగుతోంది. వివిధ జాతుల మధ్య వైరుధ్యాలతో మణిపురీ సమాజం అశాంతికి నెలవుగా మారింది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తరుగుతున్న వనరులు, జనాభా పెరుగుదల, నిరుద్యోగం, హిందూ ముస్లిమ్ విభేదాలతో మణిపూర్‌లో సమైక్యతకు విఘాతం కలుగుతోంది.
మణిపూర్ అల్లర్లకు కారణాలు అనేకం:
నేడు మణిపూర్‌లో వివిధ జాతులు/గిరిజన తెగల మధ్య దీర్ఘకాలికంగా నెలకొన్న విభేదాలు భగ్గుమనడం, కేంద్ర రాష్ట్ర పాలకులు, రాజకీయ వ్యవస్థలు సకాలంలో స్పందించకపోవడంతో వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య రేగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణ ఆస్తి నష్టం భారీగానే జరిగింది. కూకీ-జో, నాగా తెగల మధ్యనే కాకుండా మెజారిటీ మెయితీ (50 శాతం జనాభా), కుకీ-జో/నాగా జాతుల మధ్య విభేదాలు కూడా భగ్గుమనడం తరుచుగా చూస్తున్నాం. మణిపూర్‌లో అమలులో ఉన్న ప్రత్యేక అధికారులు కలిగిన సాయుధ బలగాల పట్ల స్థానికుల వ్యతిరేకత, సాయుధ బలగాలపై స్థానిక మహిళల మానభంగ ఆరోపణలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. 03 మే 2023న కుకీ-జో, మెయితీ జాతుల మధ్య చెలరేగిన ఆందోళనలు హద్దులు దాటి రెండు గ్రూపుల మధ్య పోరులో ప్రాణ నష్టం, అపార ఆస్తి నష్టం జరగడం విచారకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే తీసుకున్న చర్యలు ఆందోళనలను ఆపలేక పోయాయి. మణిపూర్‌లోని మెజారిటీ మెయితీ తెగకు చెందిన ప్రజలను యస్‌టిల జాబితాలో చేర్చాలని అనాదిగా కోరుతూ ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా విమర్శలు:
ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్‌లో మెయితీ వర్గం పక్షాన తీర్పును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖకు యస్టీ రిజర్వేషన్‌కు సంబంధించి సిఫార్సు చేయాలని సూచించింది. మెయితీలను యస్టీ జాబితాలో చేర్చితే తమకు అన్యాయం జరగవచ్చని భావించిన ఇతర మైనారిటీ జాతులు ఆందోళనలకు పూనుకోవడం పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. మణిపూర్‌లోని మెజారిటీ మెయితీ తెగకు చెందిన ప్రజలు సాంఘీక, రాజకీయ, విద్య, ఆర్థిక విషయాల్లో ఇతర జాతుల కన్న ఉన్నత స్థానంలో ఉండడంతో పేదరికంలో మగ్గుతున్న యస్టీ వర్గ కుకీ-జోకు చెందిన మైనారిటీ గిరిజన తెగలు మెయితీల యస్టీ నినాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెయితీలకు అనుకూలంగా ఉన్న రాష్ట్ర హైకోర్టు తీర్పును వ్యతిరేకించి విమర్శించిన ‘ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్(ఏటియస్‌యూయం)’, అసెంబ్లీ ‘హిల్ ఏరియా కమిటీ’ చైర్మన్‌లకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో హింసాగ్ని మరింత పెరిగిందని తెలుస్తున్నది.
మెయితీలను యస్టీ జాబితాలో చేర్చాలనే కోరిక:
మెయితీ తెగను యస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకించిన ఏటియస్‌యూయం సంఘం 03 మే రోజున రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించడం, అది హద్దులు దాటి హింసాత్మకంగా మారడం, వివిధ తెగల మధ్య దూరం పెరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ విధానంతో మెజారిటీ మెయితీ ప్రజలు అభ్యంతరాలను తెలుపుతున్నారు. దాదాపు 50 శాతం జనాభా మెయితీ తెగ వారే ఉన్నప్పటికీ ఇతర మైనారిటీ తెగలు తమపై ఆదిపత్యాన్ని చూపవచ్చని కూడా భావించడంతో అల్లర్లు పెరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ మెజారిటీ, మైనారిటీ తెగల మధ్య ఆధిపత్యం కోసం అనాదిగా అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అస్సాంలో మెజారిటీ అస్సామీస్‌తో ఇతర మైనారిటీ జాతుల ప్రజల మధ్య 1980ల నుంచి ఇలాంటి పోరాటాలు జరుగుతూ ఉండడం చూస్తున్నాం.
ఆందోళనలకు దారి తీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు:
బిరేంద్ర సింగ్ నాయకత్వంలోని మణిపూర్ బిజేపీ రాష్ట్ర ప్రభుత్వం సాయుధ దళాలు/యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్/కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ పట్ల ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా గొడవ పెరగడానికి కారణమైనాయి. బిజేపి పాలనలోని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న కూకీ-జో తెగ సమూహాలు హింసాత్మక దారులను ఎంచుకోవడం గమనిస్తున్నాం. ఇటీవల మణిపూర్‌లోని కొన్ని చర్చిలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసే నిర్ణయం తీసుకోవడం కూడా క్రిస్టియన్ వర్గాల ఆందోళనకు కారణం అవుతున్నది. కూకీ తెగ/డ్రగ్ అక్రమ వ్యాపార బర్మీస్‌కు చెందిన తీవ్రవాదులు హిందువులపై దాడులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. లోయ ప్రాంతాలతో పోల్చితే కొండ ప్రాంతాల్లో సమతల నేల అధికంగా ఉండడంతో ఆర్థిక అసమానతలు పెరగడం గమనిస్తున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో మెయితీలు భూమిని కొనడాన్ని నిషేధించడం, మెయితీలు అధికంగా ఉన్న లోయ ప్రాంత జిల్లాల్లో ఇతర గిరిజన తెగలు భూమిని కొనవచ్చనే నియమం కూడా ఆందోళనలకు ఊతం ఇస్తున్నది.
మణిపూర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, వివిధ తెగలకు చెందిన వర్గాలతో చర్చలు జరపడం, మైనారిటీలకు రక్షణ గొడుగులు పట్టడం, మెజారిటీ వర్గాల అభిప్రాయాలను గౌరవించడం, మాదకద్రవ్యాల రాకెట్లను కట్టడి చేయడం, తీవ్రవాద గ్రూపులను నియంత్రించడం, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా సమగ్రాభివృద్ధి దారులు వేయడం, అందరికీ సమన్యాయం అందించడం, అసమానతలు తగ్గించేలా చర్యలు తీసుకోవడం లాంటి పలు చర్యలు మణిపూర్‌లో శాంతి పావురాలు స్వేచ్ఛగా ఎగిరేలా సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుకుందాం. విభేధాల పరిష్కారమే సమ్మతమని, ఆందోళనలతో నష్టం మాత్రమే జరుగుతుందని తెలుసుకొని మసులుకుందాం. సుందర, శాంతి నెలకొన్న ప్రదేశంగా మణిపురాన్ని నిర్మిద్దాం.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037