శరీరంలోని ఏభాగంలోనైన అపరిమిత, నియంత్రణ లేని కణ విభజనతో గడ్డలు/కణితి (ట్యూమర్స్) ఏర్పడి శరీరంలోని ఆరోగ్యకర కణజాలాన్ని నాశనం చేయడాన్ని క్యాన్సర్‌గా గుర్తిస్తారు. ట్యూమర్ ఏర్పడిన అవయవాన్ని బట్టి రొమ్ము, నోరు, క్లోమం, ఎముకలు, గొంతు, పేగులు, మెదడు, రక్తం లాంటి అనేక రకాలైనా క్యాన్సర్లు వస్తాయని మనకు తెలుసు. క్యాన్సర్ వ్యాధి ముదిరితే మరణమే శరణ్యం. తొలి దశలో గుర్తించి సరైన చికిత్స పొందితే కొంత వరకు నయం చేయవచ్చు. ప్రతి పది మంది భారతీయుల్లో ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏట భారత్‌లో 13 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి బారినపడుతున్నారు. క్రియాశీలత కొరవడిన జీవనశైలి, పట్టణ కాలుష్యం, స్థూలకాయం, పొగాకు ఉత్పత్తుల దురలవాటు, ఆల్కహాల్ సేవించడం లాంటి కారణాలతో క్యాన్సర్ వ్యాధి సోకవచ్చు. రానున్న ఐదు ఏళ్లలో 12 శాతం క్యాన్సర్ రోగులు పెరగవచ్చని అంచనా. రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్ రోగులు భారత్‌లో అధికంగా ఉన్నారు. ప్రతి పది క్యాన్సర్ కేసుల్లో కనీసం ఒక్కటైనా రొమ్ము క్యాన్సర్ కేసు ఉంటుంది. అన్ని రకాల క్యాన్సర్లలోకి పొగాకు సంబంధ క్యాన్సర్లు 27 శాతం ఉన్నట్లు తేలింది. ఇలాంటి ప్రాణాపాయ క్యాన్సర్ రోగులకు సరైన చికిత్స లేదు, ముదిరితే మరణం తప్పదనే అభిప్రాయంలో ఉన్న సమాజానికి త్వరలో క్యాన్సర్ వ్యాధికి ఔషధం రానుందన్న వార్త సంతోషాన్ని కలిగిస్తున్నది.
క్యాన్సర్ చరిత్రలో తొలి ఔషధం:
ప్రపంచ వైద్య చరిత్రలో తొలిసారిగా ‘క్యాన్సర్‌ను అంతం చేసే ఔషధం’ క్రియాశీలతకు సంబంధించిన ప్రయోగాలు మానవ పరీక్షలలో ఆశించిన క్యాన్సర్ ట్యూమర్(గడ్డలు) వినాశన ఫలితాలను ప్రదర్శిస్తే, ఈ శుభవార్త సకల మానవాళికి, ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు అనంత ఉపశమనాన్ని కలిగిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. క్యాన్సర్ కణజాలాన్ని నాశనం చేయడానికి కొత్తగా రూపొందించిన ఈ ఔషధాన్ని ‘సియఫ్33-హెచ్‌యన్‌ఐయస్’గా నామకరణం చేశారు. ఈ నూతన ‘జెనెటికల్లీ ఇంజనీర్డ్ వైరస్’ ఔషధాన్ని ‘వ్యాక్సీనియా’ అనబడే మరో పేరుతో కూడా పిలుస్తున్నాం. వ్యాక్సీనియా ఔషధ ప్రయోగంతో క్యాన్సర్ కణజాలం, ట్యూమర్లను నశింపజేయవచ్చని తేలింది. సియఫ్33-హెచ్‌యన్‌ఐయస్ ఔషధం జన్యుపరంగా రూపాంతరం చెందిన ‘ఆంకోలైటిక్ వైరస్’ క్యాన్సర్ కారక కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని, ఆరోగ్యకర కణాలకు నష్టం కలిగించకుండా, రోగకారక కణాలను నాశనం చేస్తూ వ్యాధి చికిత్సలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. అమెరికాలో రూపొందించిన ‘సియఫ్33-హెచ్‌యన్‌ఐయస్’ ఔషధం ‘కిమేరిక్ వ్యాక్సీనియా పోక్స్‌వైరస్’గా వర్గీకరించబడింది. ఈ నూతన ఆంకోలైటిక్ వైరస్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తూనే ‘క్రోయాన్గసర్‘ కణజాలం పట్ల రోగ నిరోధకశక్తిని కూడా అదనంగా పెంపొందిస్తున్నదని తేలింది.
ఔషధ పని తీరు:
సియఫ్33-హెచ్‌యన్‌ఐయస్ అనబడే ‘మాడిఫైడ్ పోక్స్ వైరస్’ క్యాన్సర్ కణాల్లోకి ప్రవేశించి మరికొన్ని కణాలుగా విభజించబడి, కణం పగిలి వేల నూతన వైరస్ కణాలను ఉత్పత్తి చేస్తూ, ఈ కొత్తగా ఏర్పడిన వైరస్ కణాలు ఆంటిజెన్స్‌గా పని చేస్తూ, సమీప క్యాన్సర్ కణాలపై సానుకూల దాడి చేస్తాయి. జంతువులపై సత్ఫలితాలను ఇచ్చిన సియఫ్33-హెచ్‌యన్‌ఐయస్ ఔషధం నేడు మానవ శరీరంలో ప్రయోగాలు చేయగల స్థితికి దారి తీసింది. ‘యుయస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ నుండి 2021 డిసెంబర్‌లోనే అనుమతులు పొందిన వ్యాక్సీనియా వైరస్ ఔషధం అమెరికా-ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞుల సమన్వయంతో అభివృద్ధి చేయబడింది.
ఎన్నటికి అందుబాటులోకి వస్తుంది:
మానవ ప్రయోగాల తొలిదశలో మాత్రమే ఉన్న ఈ ఔషధం క్రియాశీలత
క్లినికల్ పరీక్షల్లో (క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో) సఫలం అయితే రానున్న రెండు ఏండ్లలో క్యాన్సర్ ఔషధం వాడటానికి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ఆంకాలజిస్టస్ అంటున్నారు. తొలి ప్రయత్నంగా 100 మంది క్యాన్సర్ రోగులపై ఈ ఔషధాన్ని ప్రయోగించి, తరువాత దశలో మరో రెండు ప్రామాణిక చికిత్స విధానాలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చిన యెడల నానున్న రెండేళ్ల తరువాత ఈ ఔషధం అందరికీ అందుబాటులోకి వస్తుందని గమనించాలి. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సియఫ్33 ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో నేడు మానవ ప్రయోగ దశకు చేరుకోవడం ముదావహం. మానవ శరీరంలో ఔషధం క్రియాశీలంగా పని చేస్తూ, ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించని యెడల, ఈ సియఫ్33 వైరస్‌ను ‘ఫెంబ్రోలిజుమాబ్’ వైరస్‌తో జత కలిపి క్రియాశీలతను పరీక్షిస్తారు.
హెచ్‌యస్‌ఐయస్ వైరస్:
‘హ్యూమన్ సోడియం ఐయెడైడ్ సింపోర్టర్ (హెచ్‌యస్‌ఐయస్)’ అనబడే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసే సియఫ్33 వైరస్ యొక్క ఇమేజ్, మానిటర్, రిప్లికేషన్‌ను పరిశీలించడం జరుగుతుంది. ఈ ప్రయోగాల్లో తదుపరి దశలో రేడియోధార్మిక ఐయోడిన్‌ను ఉపయోగించి రొమ్ము క్యాన్సర్ కణాల్ని నాశనం చేయగల సామర్థ్యాన్ని గమనిస్తూ, ఔషధ పనితనాన్ని నిర్థారణ చేస్తారు.ఈ ప్రయోగాలు సఫలం అయితే ప్రపంచ మానవాళికి క్యాన్సర్ ఔషధం దొరికినట్లు అవుతుంది. అతి ప్రమాదకర క్యాన్సర్ వ్యాధిని నియంత్రించగల, నయం చేయగల ఔషధం తొందరగా అందుబాటులోకి రావాలని కోరుకుందాం. క్యాన్సర్ నివారణకు చక్కటి జీవనశైలిని అలవర్చుకుందాం. దిక్కుతోచక మరణం అంచున నిలబడిన క్యాన్సర్ రోగులకు కొత్త వ్యాక్సీన్ మందు ‘వ్యాక్సీనియా’ ప్రాణాలు పోసే దివ్య ఔషధంగా ప్రజల ప్రాణాలు నిలుపుతుందనే ఆశాభావంతో శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలియజేద్దాం, క్యాన్సర్ లేని లోకాన్ని నిర్మించుకుందాం.