Take a fresh look at your lifestyle.

లఖింపూర్‌ ‌ఖేరీ ఘటనలో ఆశిష్‌ ‌బెయిల్‌ ‌రద్దు

  • సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన ఉత్తర్వులు
  • అలహాబాద్‌ ‌హైకోర్టు బెయిల్‌ ఇవ్వండపై అభ్యంతరం
  • సిజెఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 18(ఆర్‌ఎన్‌ఐ) : ‌లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హింసాకాండ నిందితుడు కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ ‌మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీమ్‌ ‌కోర్టు… వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయిందని, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించిందని సుప్రీమ్‌ ‌కోర్టు పేర్కొంది. హైకోర్టు అనేక అసంబద్ధమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుందని, ఈ కేసుకు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదని సుప్రీమ్‌ ‌కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ‌ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రా కీలక నిందితుడుగా ఉన్నాడు.

అక్టోబరు 9వ తేదీన ఆశిష్‌ ‌మిశ్రాను అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌ ‌మంజూరైంది. అక్టోబర్‌ 3‌న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ‌ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ‌ప్రసాద్‌ ‌మౌర్య పర్యటనకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు. నలుగురు రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్‌ ‌మిశ్రా ఉన్నారని రైతు సంఘాలు ఆరోపించగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆ వాదనలను ఖండించారు. నిరసన తెలిపిన రైతులను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతుందని లఖింపూర్‌ ‌ఖేరీ హింసాకాండ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ‌పేర్కొంది. అంతకుముందు అలహాబాద్‌ ‌హైకోర్టు లక్నో బెంచ్‌ ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌మంజూరు చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సుప్రీమ్‌ ‌కోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ మేరకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

వారంలోపు లొంగిపోవాలని మిశ్రను ఆదేశించింది. అతనికి బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. బాధితుల పక్షాన ఉన్న అంశాలను హైకోర్టు పట్టించుకోలేదని తెలిపింది. హైకోర్టు తన అధికార పరిధిని అతిక్రమించిందని సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మిశ్రా బెయిల్‌ ‌విషయంపై సుప్రీమ్‌ ‌కోర్టులో ఈనెల 4న కూడా విచారణ జరిగింది. ఆశిష్‌ ‌మిశ్రకు బెయిల్‌ ‌మంజూరు చేస్తూ అలహాబాద్‌ ‌హైకోర్టు చెప్పిన కారణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్‌) ‌సూచనలను యూపీ ప్రభుత్వంపై పట్టించుకోక పోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్‌ ‌రద్దు చేయాలన్న పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటిస్తూ..విచారణలో కొన్ని కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది.

ముఖ్యంగా బెయిల్‌ ‌మంజూరుకు పోస్టుమార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్‌ ‌హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సీజేఐ ఎన్‌.‌వి.రమణ తప్పుపట్టారు. ‘ఇలాంటి పిచ్చితనాన్ని అంగీకరించం. ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించాలి. కానీ.. బెయిల్‌ ‌పరిశీలనకు ఈ విషయాలు ఏ మాత్రం అంగీకారయోగ్యమైనవి కావు. అతనికి తూటా తగిలింది. కారు ఢీకొట్టింది. బండి చక్రం, స్కూటర్‌ ‌ఢీకొట్టింది. ఏమిటిదంతా’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఆశిష్‌ ఎవరిపైనా కాల్పులు జరపలేదని, ఇందుకు పోస్టుమార్టం నివేదికే సాక్ష్యమని బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొనడాన్ని సీజేఐ ధర్మాసనం తప్పుపట్టింది. విచారణలో తేలాల్సిన అంశాలను బెయిల్‌కు ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొంది. ‘పోస్టుమార్టం తదితర నివేదికల్లోకి న్యాయమూర్తి ఎందుకు వెళ్లారు. బెయిల్‌పై విచారణకు గాయాలు తదితర అంశాల ప్రస్తావన అనవసరం’ అని సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ‌హిమ కోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయ పడింది. ఘటనపై దాఖలైన సుదీర్ఘ అభియోగపత్రాన్ని పట్టించుకోకుండా..కేవలం పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై ఆధారపడి నిందితుడికి హైకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేసిందని రైతుల తరఫున సీనియర్‌ ‌న్యాయవాదులు దుష్యంత్‌ ‌దవే, ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

Leave a Reply