- మునిసిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
- ఫలించిన రైతుల పోరాటం
- అయినా సంశయం వీడని రైతులు
- కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కూడా వెనక్కి…రద్దు చేస్తూ మునిసిపాలిటీ తీర్మానం
జగిత్యాల/కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 20 : గత పది రోజులుగా చేస్తున్న రైతుల పోరాటం ఫలించింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ విలీన గ్రామ ప్రజలు గత పది రోజులుగా ఆందోళన చేస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, కమిషనర్ నరేష్‌ల ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కాగా మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల పరిసర గ్రామాలైన మోతే, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హస్నాబాద్, నర్సింగాపూర్, లింగంపేట గ్రామాలకు చెందిన భూములు మాస్టర్ ప్లాన్‌లో కలుపుతూ ప్రవేశపెట్టడంతో భూములను కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భూములను కోల్పోతున్న గ్రామాల రైతులు ఐక్య కార్యచరణగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు.
వీరికి మద్దతుగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు బిజెపి నాయకులు ప్రతిరోజు ఆందోళనలో పాల్గొంటూ వారికి మద్దతు పలుకుతున్నారు. దీంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు పోరాటం జగిత్యాల జిల్లాలో తీవ్ర రూపం దాల్చింది. గత గురువారం విలీన గ్రామాల ప్రజలు జగిత్యాల పట్టణ రహదారులన్నిటిని అష్టదిగ్బంధనం చేసి రోడ్లపైనే వంట వార్పు చేసి పోరాటాన్ని ఉధృతం చేశారు. విలీన గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు తమ తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రభుత్వంపై వ్యతిరేక వాణిని వినిపించారు. ప్రతిపక్ష, పాలకపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనా మాలకు పాల్పడడంతో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ఎటూ పాలు పోలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో విలీన గ్రామాల ప్రజలను పిలిపించి సెంటు భూమి కూడా పోనివ్వకుండా..మాస్టర్ ప్లాన్‌లో కలపకుండా తాను రద్దు చేయిస్తానని హామీ ఇచ్చినా కూడా..రద్దు చేసే వరకు తమ ఆందోళనలో కొనసాగుతాయని రైతులు తేల్చి చెప్పారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయకుండా తాను వోట్లు అడగనని..అడగడానికి గ్రామాలకు రానని ఎమ్మెల్యే పేర్కొన్న రైతులు వినని పరిస్థితి నెలకొంది. దీంతో అధిష్టానం ఆదేశం మేరకు మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. కొంతమంది రైతుల్లో సంశయం మాత్రం వీడడం లేదు.
మళ్లీ త్వరలో సవరణ మాస్టర్ ప్లాన్..ప్రస్తుతానికి మాత్రమే రద్దు..రైతుల్లో వీడని భయాందోళన
రైతుల ఆందోళనలతో జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించినా.. దానికి సవరణలు చేసేందుకు మళ్ళీ కమిటీ వేస్తానని పేర్కొనడం కొస మెరుపు. దీంతో మళ్లీ భయాందోళన నీడలోనే గడపాల్సి వొస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కాగా 498 తీర్మానం ప్రకారం ‘‘గ్రామాలను పట్టణంలోని మాస్టర్ ప్లాన్‌లో అనుసంధానం చేయకుండా మళ్లీ మాస్టర్ ప్లాన్ కోసం కమిటీ వేయాలని కోరుతూ..’’ ఇప్పుడు ఉన్న మాస్టర్ ప్లాన్‌ను ప్రజల అభ్యంతరాల దృష్ట్యా వారి అభ్యర్థన మేరకు ఏకగ్రీవంగా తీర్మానం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సమస్యను సద్దుమణిగేలా చేసినా..సవరణ నూతన మాస్టర్ ప్లాన్ ఏర్పాటు కోసం నియమించే కమిటీ నిర్ణయాలు ఎలా ఉంటాయోనని రైతుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కూడా వెనక్కి…రద్దు చేస్తూ మునిసిపాలిటీ తీర్మానం
ప్రజలు, రైతుల ఆందోళనలకు ప్రభుత్వం దిగివచ్చింది. జగిత్యాల, కామారెడ్డిల మాస్టర్ ప్లాన్లను వెనక్కి తీసుకోవడంతో రైతులు ఆందోళనలను విరమించారు. గత కొన్ని నెలలుగా అట్టుడికిన ఈ రెండు జిల్లాల్లో మాస్టర్ ప్లాన్ బుట్టదాఖలు అయ్యింది. ఈ రెండు మున్సిపాలిటీల్లో యాధృచ్ఛికంగా శుక్రవారం భేటీ అయి తీర్మానాలను రద్దు చేశాయి. తీర్మానాలను ప్రభుత్వానికి పంపారు.