- నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి
- కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల రూరల్,ఆగస్టు12(ప్రజాతంత్ర విలేకరి) : ఎస్ ఆర్ ఎస్ పి అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువకు గండి పడిందని దీంతో సుమారు వంద ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం లోని మోతే గ్రామ శివారులో ఇటీవల నూతనంగా నిర్మించిన డి. 63 కల్వర్టు సమీపంలో గండి పడిన ప్రదేశాన్ని జగిత్యాల ఆర్డిఓ దుర్గ మాధురీతో కలిసి గురువారం పరిశీలించారు. బాధిత రైతులు జీవన్ రెడ్డికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేవలం ఎస్ ఆర్ ఎస్ పి అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలువకు గండి పడిందని నూతనంగా నిర్మించిన కల్వర్టు నిర్మాణం సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించక గుత్తేదారు చేసిన నాసి రకం పనుల వల్ల గండి పడింది అన్నారు.
ఎస్ ఆర్ ఎస్ పి చీఫ్ ఇంజినీర్ తో మాట్లాడి రైతులకు నష్టపరిహారం అందించి చివరి ఆయకట్టు వరకు పంటలకు సాగు నీరు అందించాలని ఆర్ డి ఓ దుర్గా మాధురికి జీవన్ రెడ్డి వివరించారు .ఎమ్మెల్సీ వెంట సర్పంచ్ సురకంటి స్వప్న రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ రొక్కం రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేష్ , రెవెన్యూ అధికారి రాజేంద్ర ప్రసాద్ ,స్థానిక నాయకులు పిట్ట లింగారెడ్డి, శ్రీరాముల గంగాధర్ , మల్లారెడ్డి , రైతులు గడ్డం రాంరెడ్డి, రేగుంట గంగాధర్, బాలయ్య ఉన్నారు.