Take a fresh look at your lifestyle.

రేపటితో ప్రచారం బంద్‌… ‌విద్యాసంస్థలకు సెలవులు షురూ

ఏమైతేనేమి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల చివరి తేదీవరకు లాక్‌డౌన్‌ ‌లేకుండా లాక్కొచ్చింది. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌తో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా  ప్రభుత్వం మాత్రం తన పట్టును సాధించుకున్నదనే చెప్పాలి. రాష్ట్రంలో ఇప్పటికే పరిస్థితులు చెయ్యిదాటి పోయాయి. ఇకనైనా ప్రళయం రాక ముందే చర్యలేమన్నా తీసుకుంటుందేమో చూడాలి. రికార్డు స్థాయిలో కోవిద్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న దృష్ట్యా మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయాలని దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఘోషించినా ప్రభుత్వం ఆ విషయాన్ని అసలు పట్టించుకోనేలేదు. చివరకు హైకోర్టు ఆదేశాలతో నైట్‌ ‌కర్ఫ్యూను విధించి ఎన్నికల పక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకున్నట్లు స్పష్టమవుతున్నది. కాని ఇక్కడ మహారాష్ట్ర పరిస్థితి ఏర్పడుతుందేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోవిద్‌ ‌మొదటి విడుత అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. కేవలం మాస్క్ ‌ధరించకుంటే వెయ్యి రూపాయల జుర్మానా విధిస్తామన్న ఒక్క నిబంధన తప్ప మరే ఇతర చర్యలు పెద్దగా లేవు. నిన్నటితో ప్రచారం ముగించుకున్న  మున్సిపల్‌ ఎన్నికల కార్యక్రమాల్లో ఎంతమంది మాస్క్ ‌ధరించారన్నది బహిరంగ రహస్యమే. ఈ సభల సందర్భంగా సిఎం కెసిఆర్‌, ‌మంత్రి కెటిఆర్‌ ఇప్పటికే హోమ్‌ ‌క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

మరి వారి సభలకు హాజరైనవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటేనే భయమేస్తున్నది. జరుగుతున్న ప్రచారం చూసి భయపడవద్దంటున్నాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ‌కాని, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు చూస్తే మాత్రం గుండె దడదడలాడక తప్పదు. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రోజురోజుకు ఇతర రాష్ట్రాల కన్నా  మించి పోతున్నది. తాజాగా ఏడునుండి ఎనిమిదివేలకు పైగానే రాష్ట్రంలో రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయంటే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమాత్రం పనిచేయడం లేదన్నది స్పష్టమవుతున్నది. కోవిద్‌ ‌మొదటి వేవ్‌కన్నా రెండవ వేవ్‌ ‌విస్తృతంగా వ్యాపిస్తున్నదన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తున్నా మొదటి వేవ్‌ అనుభవంతో ప్రజలే మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదన్నది స్పష్టమవుతున్నది.

ఏదికూడా తమదాకా వొస్తేకదా అన్నట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దానికి తగినట్లు కళాశాలలు, పాఠశాలలు ప్రారంభింపచేయడం, సినిమాహాళ్ళు కొనసాగించడం అన్నిటికి మించి రాజకీయ సమావేశాలపై ఏమాత్రం కంట్రోల్‌ ‌లేకపోవడం రాష్ట్రంలో మహమ్మారిలా ఈ వైరస్‌ ‌వ్యాపించడానికి కారణమైందన్న భావన అందరిలోనూ ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజల ఆదాయానికి గండి పడుతున్నందునే రాష్ట్రంలో రెండవసారి లాక్‌డౌన్‌ను పెట్టడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, అసలు మనిషి బ్రతికి ఉంటేకదా అన్న సమాధానాలు వొస్తున్నాయి. వ్యాధిని నిరోధించే టీకాను ఇప్పటికే  రాష్ట్రంలో లక్షల సంఖ్యలో జనం తీసుకుంటున్నా అంతే వేగంగా వైరస్‌ ‌కూడా ప్రబలుతుండడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకుందామంటే దానికి కూడా రాష్ట్రంలో కరువేర్పడింది. టెస్టింగ్‌ల కొరత కొట్టవొచ్చినట్లు కనిపిస్తున్నది. టెస్టింగ్‌ ‌సెంటర్‌ల వద్ద ప్రజలు గంటలకొద్ది పడిగాపులు కాయాల్సి వొస్తున్నది. పోనీ ఆలస్యంగానైనా టెస్ట్ ‌జరుగుతుందా అంటే అదీలేదు. టెస్టింగ్‌ ‌కిట్స్ ‌లేవని గంటలకొద్ది నిలబడినవారిని వెళ్ళగొడుతున్న దృశ్యాలు కోకొల్లలు. ఇక ఆక్సీజన్‌. ‌బెడ్స్ ‌కొరత సరేసరి. కేవలం మనరాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అదిచూసే అమెరికా, పాకిస్తాన్‌,  ‌చివరకు చైనాలాంటి దేశాలు కూడా తాము సహాయం చేస్తామని ముందుకొస్తున్నాయంటే వ్యాధి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.  ఇదిలాఉంటే కెనడాలాంటి దేశాల్లో వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ అన్నది డిసెంబర్‌ ‌వరకు పొడిగించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు తెరిచిన పాఠశాలలను సంపూర్ణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా నేటినుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ నిర్ణయమేదో కాస్తా ముందుగా ప్రకటిస్తే ప్రభుత్వ టీచర్లు రోజూ బిక్కుబిక్కుమంటూ పాఠశాలకు వెళ్ళే పనితప్పేది. ఎందుకంటే ఇంటికి తిరిగి వొచ్చినప్పుడల్లా ఎక్కడ తమనుండి తమ కుటుంబ సభ్యులకు వ్యాధిసోకుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సెలవులను కూడా ఎన్నికలతో ముడిపెట్టిండవొచ్చంటున్నారు.

ఎన్నికల ప్రచార పర్వం పూర్తయిన రోజునుండే సెలవులు ప్రారంభమవుతాయన్న ప్రకటన వెలువడడం అదే అంశాన్ని చెబుతున్నాయంటున్నారు. ఏప్రిల్‌ 27‌నుండి మేనెల 31 వరకు పాఠశాలలు, జూనియర్‌ ‌కళాశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం ఈ సంవత్సరం పాఠశాల విద్య లేకుండానే విద్యార్థులు ప్రమోట్‌ అవుతున్నారు. ఆన్‌లైన్‌ ‌విద్యతో విద్యార్థులు పాఠశాల వాతావరణాన్ని తీవ్రంగా నష్టపోతున్నారు. విద్యార్థి జీవితంతో విలువైన రెండేళ్ళకాలాన్ని దీంతో వారు కోల్పోయినట్లే. కాని మే నెలలోనే ఈ వైరస్‌ ‌ప్రభావం మరింత ఉధృతంగా ఉండే అవకాశాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. గడచిన వారం రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే మే నెల వొచ్చేసరికి రోజుకు పదివేల పాజిటివ్‌ ‌కేసులు నమోదైనా ఆశ్చర్యపడాల్సిందిలేదంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో లాక్‌డౌన్‌ ‌విధించడంతప్ప మరో మార్గంలేదు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మే రెండు వరకు ఫలితాలు విడుదల కానుండగా, ఆ మరుసటి రోజునుండి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply