Take a fresh look at your lifestyle.

రైతు హంతక పార్టీ బీజేపీ

  • యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు
  • కేంద్రానివి రైతు వ్యతిరేక విధానాలు
  • ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదు
  • గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్‌లో పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌కన్నా హీనస్థితిలో ఉన్నాం
  • లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్నా చిల్లర కొట్టులా వ్యవహరిస్తున్నది
  • దేశం నుంచి బీజేపీని పారదోలితేనే రైతులు బాగుపడతరు
  • కిషన్‌ ‌రెడ్డి చేతగాని దద్దమ్మ..దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలి
  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన కారణంగా రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనలేమని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించిన కారణంగా తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దేశంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా చేసే సామాజిక బాధ్యతను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం దిక్కుమాలిన విధానాలతో రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తున్నదనీ, రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ ‌కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వం చిల్లర కొట్టు మాదిరిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నదనీ, ఇంత నీచమైన ప్రభుత్వాన్ని తాను చూడలేదనీ, భవిషత్త్తులో కూడా చూడబోనని వ్యాఖ్యానించారు. ప్రతీ విషయంలో లాభనష్టాలను బేరీజు వేసుకుని మాట్లాడటం సరైంది కాదనీ, అలా మాట్లాడితే ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సమావేశంలో మొదటగా రాష్ట్రంలో ప్రజారోగ్యం, వైద్య సేవలకు సంబంధించి అనుసరిస్తున్న కార్యాచరణ, కోవిడ్‌ ‌టీకాల పురోగతి, ఉప్పుడు బియ్యంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం, వానాకాలం వరిధాన్యం కొనుగోళ్ల పురోగతి, యాసంగి సీజన్‌ ‌కార్యాచరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, రైతు బంధు నిధుల పంపిణీ, ఆర్టీసీ, విద్యుత్‌ ‌చార్జీల పెంపు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎంకేసీఆర్‌ ‌విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత రెండేళ్లలో బీజేపీ పాలనలో దేశంలో పేదరికం భయంకరంగా పెరిగిందనీ, గ్లోబల్‌ ‌హంగర్‌ ‌సర్వేలో భారత దేశం 101 స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంతనన్న సిగ్గుండాలి బంగ్లాదేశ్‌,‌పాకిస్తాన్‌ ‌కంటే దారుణమైన స్థితిలో భారత్‌ ఉం‌ది… అయినా కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌మతి లేకుండా మాట్లాడుతున్నరని ఎద్దేవా చేశారు.ఏడేళ్ల పాలనలో రూ.80 లక్షల కోట్లు అప్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నారనీ, ఆయనకు సిగ్గు, లజ్జ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపించాలని సవాల్‌ ‌విసిరారు.

కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదనీ, ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం విద్యుత్‌ ‌సంస్కరణల పేరుతో రాష్ట్రం మెడమీద కత్తి పెడుతున్నదనీ, విద్యుత్‌ ‌బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలనీ, లేకుంటే రాష్ట్రాలకు అప్పులు ఇవ్వమని బెదిరిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతల మాటలు వింటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100 శాతం ముంచుతుందనీ, బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నరని విమర్శించారు. కేబినెట్‌లో ధాన్యం సేకరణపై సుదీర్ఘంగా చర్చించామనీ, గత యాసంగి ధాన్యాన్ని కేంద్రం పూర్తిగా సేకరించ లేదనీ, సేకరించిన వాటికి కూడా పూర్తిగా డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు.రాష్ట్ర వాతావరణం దృష్ట్యా యాసంగిలో బాయిల్డ్ ‌రైస్‌కే అనుకూలంగా ఉంటుందనీ, కేంద్రం ఒక కోటా వేస్తే అంతవరకే పండిస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి వద్దకు వెళితే మీకేం పనిలేదా అని అవమానకరంగా మాట్లాడారనీ, కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు.ఏపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, విపక్షాలు కోర్టులో కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించామనీ, మా కృషి వల్లనే తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందనీ, గతంలో తెలంగాణలో 10 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం సేకరణ జరిగితే టీఆర్‌ఎస్‌ ‌హయాంలో 69.3 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని సేకరించామని వివరించారు. దేశం నుంచి బీజేపీని పారదోలితేనే రైతులు బాగుపడతరనీ, నల్ల చట్టాలుతెచ్చి 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌దుయ్యబట్టారు.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి
ఓమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ
హై••దరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని దవాఖానాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలనీ, మందులు, టీకాలతో పాటు మౌలిక వసతులు సమకూర్చుకోవాలనీ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మంత్రులంతా జిల్లాలలోపర్యటించి తాజా పరిస్థితులపై సమీక్షించాలనీ, ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. తదితర అంశాలపై కేబినెట్‌ ‌సమీక్షించింది. అదే సందర్బంగా కొరోనా నుంచి ఒమిక్రాన్‌ ‌పేరుతో కొత్త వేరియంట్‌ ‌వస్తున్నదనే వార్తల నేపథ్యంలో వైద్య శాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. వివిధ దేశాలలో ఒమిక్రాన్‌ ‌పరిస్థితిపై నివేదిక సమర్పించారు.

ఒమిక్రాన్‌ ‌కేసులు తెలంగాణలో వచ్చినప్పటికీ ఎదుర్కునేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదనీ, అన్ని రకాల మందులు, పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని దవాఖానాలలో పరిస్థితిని సమీక్షించాలనీ, అన్ని జిల్లాలలో వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియను వేగవంతం చేయాలని అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కసీఆర్‌ ఆదేశించారు. జిల్లాల వారీగా టీకా ప్రక్రియను సమీక్షించి ఆదిలాబాద్‌, ‌కుమ్రం బీం, నిర్మల్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నారాయణపేట, గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది. కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియ పరిశీలన, కొరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కునేందుకు తీసుకోవాల్సినచర్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కేబినెట్‌ ఏర్పాటు చేసింది. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఎ‌ర్రబెల్లి దయాకరరావు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీలో ఉంటారు.

Leave a Reply