Take a fresh look at your lifestyle.

మానవ జీవన వ్యాఖ్యానమే సి.నా.రె కవిత్వం

అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించదే,వసంతోదయం ఊరుకోదు పరిమళాలను పారించనిదే, ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతు ముట్టనిదే…విత్తనాన్ని మట్టిలో కి విసిరి కొడితే వృక్షమైపేలుతుంది,ఒక్క కంఠాన్ని నొక్కి వేస్తే లక్ష కంఠాలై మ్రోగు తాయి…అంటూ విశ్వంభర కావ్యం లో  తెలుగు శబ్దార్థాల కున్న వాడి వేడి ఎలాంటిదో సమస్త సాహితీ లోకానికి  చాటి చెప్పి, జ్ఞానపీఠ పురస్కారం పొందిన  కవి డా.సింగిరెడ్డి నారాయణ రెడ్డి క్రి.శ 1931వ సంవత్సరం జూలై 29 తేదీన సిరిసిల్ల జిల్లా లోని హనుమాజీ పేట గ్రామంలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు.వీరిది మధ్యతరగతి రైతు కుటుంబం.మాధ్యమిక విద్య సిరిసిల్ల, ఉన్నత విద్య కరీంనగర్‌, ఇం‌టర్మీడియట్‌ ‌హైదరాబాద్‌ ‌లో పూర్తి చేశాడు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు లో మాస్టర్‌ ‌డిగ్రీ , తర్వాత  పిహెచ్‌ ‌డి పూర్తి చేశాడు.  70 కి పైగా కావ్యాలు రాసి తెలుగు సాహిత్యం పై చెరగని ముద్ర వేసిన గొప్ప కవి సి.నా.రె.నాగార్జునసాగరం కర్పూర వసంత రాయలు,మట్టి మనిషి, ఆకాశం,మధ్య తరగతి మందహాసం, విశ్వంభర మొదలగు కావ్యాలు సి.నా.రె. కు కవిగా మంచి గుర్తింపు ను తెచ్చాయి.  మానవ జీవితానికి వ్యాఖ్యానం లా ఆయన రాసిన  ప్రపంచ పదులు, గజల్స్  ‌నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి, అద్భుతమైన సందేశాన్ని అందించాయి.శబ్దశక్తి,అర్ద యుక్తి సమ్మేళనంగా సాగే సి.నా.రె కవితలు, గేయాలు, రూపకాలు,పాఠకులను కట్టిపడేస్తాయి. మానవజీవితం లోని భిన్న పార్స్వాలను విశ్లేషించిన తీరు మన గుండెలకు సూటిగా తాకుతుంది.
.స్వార్థం, నమ్మక ద్రోహాం.డాబు,దర్పాన్ని ప్రదర్శించే మనిషి లోని కృతక నటనా విన్యాసాలను ఎండ గడుతూనే, మరో వైపు, కష్టించి పని చేసే తత్వం గల వ్యక్తుల కృషి ఫలితంగా విజయాలు లభిస్తాయని ‘‘ప్రపంచ పదులు ‘‘ గేయాల్లో ఎత్తి చూపాడు.తాడు,బొంగరం లేక క్రీడ ఎలా చూపిస్తావు,నారు లేక  నీరు లేక పైరు ఎలా పండిస్తావు, లాంటి గేయ పాదాల్లో తెలంగాణ సమాజంలో సర్వ సాధారణంగా వినిపించే వ్యంగోక్తులు గా చూడవచ్చు.
కష్టించకుండా కబుర్లతో కాలం వెళ్ళదీసే సోమరి పొతులకు చురకలుగా వీటిని భావించవచ్చు.. అలాగే ‘‘నమ్మిన నేస్తం స్నేహం పొదుగును కుమ్మితేనరకం’’అంటారు.నిజమే కదా! జీవితంలో నమ్మకద్రోహానికి మించిన నరకం ఏముంటుంది.

అదే విధంగా ‘‘ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా’’ అన్న  జీవిత సత్యాన్ని తెలియచేస్తూ  వృద్దా ప్యంలో వచ్చే సమస్యలకు మానసికంగా సంసిద్ధంగా ఉంటేనే మనిషి ధృడంగా నిలబడ గలడనే సందేశాన్ని ఇచ్చారు. బ్రతుకు నటన వేర్వేరని భావించిన కవికి మనిషి స్వార్థపూరి తంగా మారి మనిషి తత్వాన్ని మంట గలుపుతున్న తీరుకు ఆవేదన చెందారు డాబు దర్పాన్ని ప్రదర్శించే మనుషుల్లో ఉండే డొల్ల తనం తో పాటు , సామాన్యం గా కనబడుతూనే అసాధారణ ప్రతిభ తో అద్భుతాలు సృష్టించే వారుంటారని తెలియచేశారు,చిన్నగా కనబడినంత  మాత్రాన తక్కుగా చూడకూడదని తెలియజేశారు.చీకటి అస్థిత్వానికి చురకబెట్టే మిణుగురు చిన్నగానే ఉంటుందని,ఎంత మొండివాన నుండైనా  రక్షించుకోవడానికి రెండు మూరల గొడుగు సరిపోతుందని అంటాడు. . కొవ్వొత్తి కరిగితే కాంతి జనిస్తుంది,ఉలి దెబ్బలు భరిస్తేనే  శిల శిల్పంగా మారుతుందని తెల్పేవి? మనిషి  భావి జీవితానికి ప్రేరకాలుగా ఉపయోగపడే వే. సి.నా.రె గజల్స్ ‌లో జీవన భాష్యం అనే గజల్‌ ‌తెలంగాణ ప్రభుత్వం 10 వ తరగతి విద్యార్ధుల కు పాఠ్యాంశంగా రూపొందించింది. రేపటి పౌరులైన విద్యార్థులకు ఈ పాఠ్యాంశం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందనడంలో  సందేహం లేదు.  ఈ గజల్‌ ‌లో సి.నా.రె ‘‘వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం’’ జంకని అడుగులు కదిపితే అది దారువు తుంది.అంటాడు.లక్ష్యసాధనలో ఎదురయ్యే అవరోధాలను ధైర్యం తో అధిగమి ంచాలి.భయపెట్టి ముందరి కాళ్ళకు బంధాలు వేసే వారు ఎప్పుడూ ఉండనే ఉంటారు. అలాంటి వారిని పట్టించు కోకుండా ధృడసంకల్పం తో ముందుకు నడవాలంటాడు సి.నా .రె. ఆ దారి రేపటి తరానికి స్పూర్తిదాయకంగా నిలబడుతుందనే సందేశాన్ని తెల్పాడు. ‘‘ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేము ందనకు,ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.’’అనగా బీడుభూములను చేమటోడ్చి దున్నితే నే పంటలు పండి ప్రజలకు తిండి దొరుకుతుందని,అలాగే కఠోర సాధన లేకుండా విజయాలు సాధించలేమనేది దీని అంతరార్థం గా చెప్పవచ్చు.  మనిషి పట్ల అపారమైన విశ్వాసం కలవాడు సినారె. ఆదిమ కాలం లో పశు ప్రవృత్తి తో జీవించిన మనిషి క్రమంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్న తీరు పరస్పర సహకారం వల్లనే సాధ్యమైందంటాడు. అందుకే’’మనిషీ మృగం ఒకటనీ అనుకుంటే వ్యర్థం’’ మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది’’ అంటాడు. మానవుడు సంఘ జీవి అని అరిస్టాటిల్‌ ‌చెప్పినట్లుగా  మనుషులంతా  సహాకార భావంతో  బతకాలనేది దీని భావం.ఈ భావనే మనిషి ని పశువునుండి వేరు చేస్తుంది.అలాంటి మనుషులున్న ప్రదేశాన్ని ఊరంటాడు సి.నా రె. మానవుడు జీవితంలో కాస్త ఎదగగానే తాను కష్టాలకు అతీతునిగా భావిస్తూ సాటి మనిషి ని హీనంగా చూసే అహాంకారాన్ని ప్రదర్శిస్తాడు.కాని మనిషి ఏ స్థాయిలో నున్న పరీక్షలు ఎదుర్కోవలసిందేనంటాడు. సినారె..అంత పెద్ద హిమాలయ పర్వతమే ఎండ వేడికి నీరై ప్రవహిస్తుందని,మనిషి గర్వం కూడా నీరు కారి పోవలసిందేననీ తెల్పాడు.సినారె.  జీవన భాష్యం గజల్‌ ‌లో  చివరగా’’ బిరుదు లు పొందే వ్యాప్తికి విలువేవి సినారె ‘‘ చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది.అంటాడు.బిరుదులు, సన్మానాలు సత్కారాలతో సమాజానికి ఒరిగేదేమి లేదని, చెరిగిపోని త్యాగాల ద్వారా మాత్రమే చరిత్రలో పేరు చిరస్థాయిగా నిలబడుతుందని, ఆ దిశ మనిషి తన కృషిని కొనసాగించాలనే మహాత్తరమైన సందేశాన్ని ఇచ్చాడు.సి.నా.రె  ఒక ప్రత్యేక మైన ఇజానికి కట్టుబడక  మనిషి లో మానవీయ విలువలు పెంపొందించడానికి నిరంతరం తపన పడుతూ తన రచనలను కొనసాగించాడు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ణానం పీఠ అవార్డు పొందిన రెండవ కవి సినారె.  అద్భుతమైన సాహిత్యం తో అనేక సినిమా పాటలు రాసి  సంచలనం సృష్టించాడు.రాజ్యసభ సభ్యులు గా , ఆంధ్రప్రదేశ్‌ ‌సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వ విద్యాలయాలకు వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌గా పని చేశారు. భారతప్రభుత్వం పద్మభూషణ్‌ ‌బిరుదుతో సత్కరించింది. తెలంగాణ గడ్డపై జన్మించి తెలుగు నేలతో పాటు దేశ వ్యాప్తంగా తన అనేక అభిమానులను సంపాదించుకున్న కవి సినారె. సుదీర్ఘ సాహితి ప్రయాణానికి   ఇకసెలవంటూ తన  86  వ ఏట జూన్‌ 12‌వ తేది 2017  నాడు అస్తమించాడు.ఆయన భౌతికంగా మనమధ్య లేకున్నా తన కవిత్వం తో చురక లు పెడుతూ మనలను మంచి మార్గం లో పయనించడానికి నిరంతరం మేల్కొపుతూనే ఉంటాడు.
(జూలై 29 తేదీన డా.సి.నారాయణరెడ్డి  జన్మదిన సందర్భంగా)
–  గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply