Take a fresh look at your lifestyle.

బైరెడ్డి కృష్ణారెడ్డి-ఆర్తి

అనుక్షణం కవితావేశం.
ఆయనొక అరుదైన కవి.
ఆయనది ‘‘ఆర్తి’’ కవిత్వం !!

కవిత్వ వ్యాసంగాన్ని ఒక వ్యాపకంగా ఎంచుకోలేదు. ఒక మూడ్‌, ఒక ఇమోషన్‌ ‌వెన్నుతట్టినప్పుడు సిసలైన కవిత్వం ఆవిర్భవించింది, దమనకాండో, అత్యాచారమో, రాజ్యహింసో జరిగినప్పుడు స్పందించి రాస్తున్నదంతా కవిత్వం కాకుండా పోతుందా? అని కవి బైరెడ్డి కృష్ణారెడ్డి ఆర్తిగా ప్రశ్నిస్తారు. అందుకే ఆయన ఆర్తికవి అయ్యారనిపిస్తుంది. ఆయన ఒక విలక్షణమైన వైవిధ్యాన్ని సంతరించుకున్న వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఒక వైపు కవితా శిల్పం మరొకవైపు పాఠకులను బందీ చేస్తాయి. ఆయన నాలుగు దశలలో రసిన కవిత్వ సంకలనాలను గుదిగుచ్చి ఒక సమగ్ర సంకలనం ‘‘ఆర్తి’’ తీసుకొచ్చారు. అనువాదాలతోపాటు అనేక ఆలోచనలకు ఎప్పటికప్పుడు కవితా రూపమిస్తూ నాలుగు సంకలనాలను ఆయన తయారు చేసారు. మొదటి సంకలనంలో 28, రెండవ సంకలనంలో 4, మూడవ సంకలనంలో 25, నాలుగో సంకలనంలో 35 కవితలు మొత్తం 92 కవితలకు ఆయన ఒక పుస్తకరూపం ఇచ్చి తన ‘‘ఆర్తి’’ ని ప్రకటించుకున్నారు. ప్రతి కవిత పాఠకులను బందీ చేస్తుంది.

ఇరవై ఏళ్ళకిందట మొదలై మొన్నటివరకూ సాగుతూ వచ్చిన రచనల సమాహారం ఈ ఆర్తి. మొదట్లో ఆయన ఒక మాట అంటారు. ‘‘ ఈ సంకలనాన్ని, ‘‘ఆర్ద్రమై ఉబుకుతున్న కండ్ల నీళ్ళతో ఆపాదమస్తకం అభిషేకిద్దామనుకుంటే చాచిన చేతులకందనంత దూరాలకు చిన్న మాటైనా చెప్పకుండా ఆత్రంగా వెళ్ళిపోయిన ‘‘నాయినను’’ తలచుకుంటూ, ఎరుక తెలియనినాడే అమ్మ పావురం ఎడబాసిన నా పసితనాన్ని భుజానికెత్తుకుని ఒడిని ఊయల జేసి నిలువెత్తు మనిషి తనపు ఊపిరులూదిన ‘‘కన్న వూరుకే’’ అంకితమిచ్చాను అని. అక్కడే అర్ధమవుతుంది ఈ సమాజం తనను పెంచి పెద్దచేసినందుకు ఆయన కృతజ్ఞతాభావం.

‘‘సునామీ నైతికం’’లో బైరెడ్డి అంటారు:

నాలకలు

పిడచకట్టుకుపోతున్నా

దాహం తీర్చేరోకు తెలువదు.

తెలిసిందల్లా

సామూహిక జీవ దాహమే..

.. అందులోనే ..

శత్రువునైనా

నిద్రిస్తున్న సమయాన

హతమార్చడం కూడదని కదా

విజ్ఞత ఉవాచ… ధర్మాన్ని స్పృశిస్తారు.

ఒక ఆవేశానికో, ఆవేదనకో, ఆర్తికో కవితారూపాన్నిచ్చి రిలీఫ్‌ ‌పొందిన ప్రతిసారీ అనిపించేదట- అనుమానం వేసేదట. అదే చివరి రచన అవుతుందేమోనని. రాయడానికి ఇంకేమీ మిగలదేమోనని.. అయినా మరొకటి, మరొకటి.. పుట్టుకొస్తునే వుండేవి కవితలు, రచనలు. అందువల్లనే క్రియేటివిటీ.. అని ప్రకటించుకుంటారు బైరెడ్డి కృహ్ణా రెడ్డి.

ఆయన కవితల్లో ఆర్తి ఉంది. ఆలోచింపజేసే లోతైన భావాలున్నాయి. కవి భావాలు ‘‘జననం- మరణం’’ అనే రెండు బిందువుల మధ్య తచ్చాడుతుంటాయి, అని సాహితీ ప్రియులు కితాబు నిచ్చారు. ఆర్తిలో అందమైన నడకతో సాగిన ముక్తపద గ్రస్తాలతో కవితలు కనిపిస్తాయి కొన్ని మాటలు పాదాలు గుండెలకు మాటలు, పాదాలు సూటిగా హత్తుకుంటే, కొన్ని లోతుగా గుచ్చుకుంటాయి.

ఆర్తి లోని కవితలన్నీ హృదయంలోనుంచీ తన్నుకొస్తే రాసినవే, అందుకే అవి పూలమీద మంచు బిందువుల్లా మెరుస్తుంటాయి. కవితలు మనిషి గుండెను తట్టి పలుకరిస్తాయి. హృదయ సంస్కారం పెంచుతాయి. ఆయన మనసులోని ఆవేదన, ఆలోచన, ఆగ్రహం, ఆవేశం అక్కసు తోటివారితో పంచుకునే లక్ష్యంతోనే రచయిత కవితలు రాసారని ఒక సమీక్షకుడు అంటారు. బైరెడ్డి కవితల్లో మనిషి అంతరంగానికి, సమాజంతో నిరంతరం జరిగే సంఘర్షణ కనిపిస్తుంది. ఆయన కవిత్వం సమాజానికి సంబంధించింది. ఒక్కో కవిత ఒక్కో అనుభూతి కలిగిస్తుంది.

మరో గొప్ప విషయమేమిటంటే బైరెడ్డి గత రెండు దశాబ్దాలుగా వెలువరించిన నాలుగు కవితా సంకలనాలకు లభించిన ప్రోత్సాహం ముందుమాటలు రాసిన ప్రముఖ సాహితీవేత్తల ప్రశంశలు కవికి గండపెండేరాలు తొడిగినట్లున్నాయి. కవి వ్యక్తిత్వం పట్ల, కవిత్వం పట్ల వారు కనబరచిన ప్రేమానురాగాలు అనిర్వచనీయం.

ఒకో కాలానికి, ఒకో సమాజానికీ, ఒకో ప్రాంతానికి, ఒకో వ్యవారిక భాష ఉన్నట్లేకవితో ముడిపడ్డ ఒక వ్యావహారిక భాష ఆయనకూ ఒకటుందని రుజువవుతుంది.

బైరెడ్డి సంకలనాలకు కితాబునిస్తూ ముందు మాటలు అనండి, పీఠికలు అనండి..ఉత్సాహం అనండి.. సాహితీ ప్రముఖులు సదాశివ, శ్రీ లక్ష్మణ మూర్తి, అఫ్సర్‌, ‌కాసుల ప్రతాపరెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పగడాల నాగేందర్‌, ‌ప్రొ. పి లక్ష్మీనారాయణ, ఇఫ్లూ ప్రొఫెసర్‌ ‌వెంకటరెడ్డి, ఎ రాజేంద్రబాబు.. ఆర్తి కవికి, కవిత్వానికి పాఠక లోకంలో జీవం కల్పించారు.

ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. కవికి ఆప్తుడు, అన్నింటా ప్రోత్సాహకునిగా నిలిచి వెన్నుతట్టి వెనుకనుండి నడిపిస్తున్న చలన చిత్ర ప్రముఖుళు బి నర్సింగరావు ఆర్తి సమగ్ర సంకలనానికి అక్షర కిరీటం అలంకరించారు తన దైన శైలిలో. ‘‘ కృష్ణారెడ్డి కవిగా ఎంత భావుకుడోవ్యక్తిగా అంత నిష్కపటి.కష్టాల్నీ, నిష్టూరాల్నీ నిబ్బరంగా భరిస్తునే అప్రతిహతంగా సాగిపోయే పాంధుడు’’ అని అభివర్ణించారు. మృత్యువును ఏకవచనంతో సంబోధించగల సాహసి, అంటూ.. ఇతనిలో ఒక వేమన, ఒక ఇలియట్‌, ఒక పికాసో దర్శనమిస్తారని నర్సింగరావు ప్రశంసించారు. ఊరు ఇతన్ని దివారాత్రవము ఎలుగెత్తి ప్లుస్తుంది. అనుక్షణం కవితావేశం ఆవహిస్తుంది. అందుకే ఇతనొక అరుదైన కవి, మిత్రుడినైనందుకు సంతోషిస్తున్నాను. .. అంటారు చివరగా! కృష్ణారెడ్డి తన ఆంతరంగిక వ్యక్తిగతాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రకటిస్తాడని సూటిగా చెప్పారు తన మాటగా.. కవిత్వమంటే ఇష్టపడే వారు ఆ ‘‘ఆర్తి’’ సంకలనాన్ని కచ్చితంగా ఆదరిస్తారు.

హైదరాబాద్‌ – ‘‘‌పాలపిట్ట’’: ఈ సంకలనాన్ని ప్రచురించగా అన్ని ముఖ్య పుస్తకాలయాలో ఇది లభిస్తుంది. వెల:రు.300/-

ఇతర వివరాలకు….

ఆర్తి నివాసం, 6-2-398, సాయిశ్రీ కాలనీ, నల్గొండ- 508 001 సంప్రదించవచ్చు.

Leave a Reply