Take a fresh look at your lifestyle.

ముందుస్తు ముచ్చట

దేశంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. దేశంలో సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ముందస్తుకు రంగం సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వాతావరణం కనిపిస్తున్నట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల రాజకీయ నేతలు అడపాతడపా ప్రకటనలు చేస్తున్నారు. విచిత్రమేమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మెజార్టీ ఉన్నా ముందుస్తు ఆలోచన ఉన్నట్లుగా వార్తలు వొస్తున్నాయి. అయితే నిజంగానే కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్దపడితే ఈసారి కేంద్రంలో అధికారంలోకి వొచ్చే పార్టీ ఏదన్న చర్చకూడా జరుగుతోంది. ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికల్లో ఎవరి విజయావకాశాలేంటి ఆన్న విషయంలో ప్రముఖ సర్వే సంస్థ ‘సీ ఓటర్‌ ఇం‌డియా టుడే’ ఒక సర్వే నిర్వహించింది కూడా. ఒక వేళ ముందుస్తు ఎన్నికలు జరిగితే మరోసారి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ సంస్థ తన సర్వే విశ్లేషణలో తెలిపింది. అంతేకాదు మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ఆ సర్వే సంస్థ వెల్లడించింది. ఇప్పటికే రెండు విడుతలుగా ప్రధాన పదవి చేపట్టిన నరేంద్ర మోదీపై ఏ మాత్రం ప్రజల ఆదరణ తగ్గలేదని కూడా తెలిపింది. తిరిగి ఎన్‌డిఏ అధికారంలోకి వొచ్చినా ఈసారి సీట్ల సంఖ్య మాత్రం తగ్గుతాయంటోంది. ఇప్పుడున్న 350 నుండి 296కు ఆ సంఖ్య పడిపోయే అవకాశాలున్నట్లుగా ఆ సంస్థ తన సర్వేలో పేర్కొంది. బిజెపి ఎంపీల సంఖ్య కూడా 303 నుండి 271కు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆ సర్వే విశ్లేషణ .

ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందస్తు ఎన్నికలపై బాగానే చర్చ జరుగుతున్నది. దీనికి అధికార పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నా పరిణామాలు మాత్రం పాలకులు ఆ దిశగా ఆలోచనలో ఉన్నట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏపి విషయాన్నికూడా ఆ సర్వే విశ్లేషించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపిలో ముందుస్తు ఎన్నికలు వొస్తే వైఎస్‌ఆర్‌ ‌పార్టీ విజయాన్ని సాధిస్తుందని, తిరిగి వైఎస్‌ ‌జగన్‌ అధికార పగ్గాలు చేపడుతారని ఆ సర్వే విశదీకరించింది. గత ఎన్నికల్లో ఏపిలోని 25 స్థానాలకు అన్నిటినీ వైఎస్‌ఆర్‌ ‌పార్టీయే గెలుచుకుంది. అక్కడ బిజెపి కాని కాంగ్రెస్‌గాని ఒక్కటంటే ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌పైన ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదన్నది ఆ సర్వే సారాంశం. అలాంటప్పుడే ముందస్తు ఎన్నికలు జరిపితే మళ్ళీ అధికారంలోకి సులభంగా రావొచ్చని ఏపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఈ విషయంలో తనకు కూడా సమాచారం ఉన్నట్లు ప్రతిపక్ష టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పేర్కొనడాన్ని బట్టి కూడా ఇక్కడ ముందుస్తు ఎన్నికల ఆలోచన ఉండి ఉండవచ్చు అని అర్థమవుతున్నది. కాగా ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించడాన్ని బట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా ముందస్తును ఊహించి ఎన్నికలకు సిద్దపడుతున్నట్లు స్పస్టమవుతున్నది. ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసుగెత్తి పోయారని, గడచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాబిన్నం అయిందని, ఏపి బ్రాండ్‌ ఇమేజ్‌ను వైఎస్‌ఆర్‌సిపి దెబ్బతీసిందని చెబుతున్న చంద్రబాబు ముందస్తు ఎన్నికల్లో విజయం తమదని ధీమాగా ఉన్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్తను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కొట్టిపారేసినా ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం కెసిఆర్‌ను నమ్మె పరిస్థితిలేదని, ఏ క్షణానైనా ఆయన ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు పోయే అవకాశాలు లేకపోలేదంటున్నాయి. దాదాపు నెల రోజుల కిందనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఈ విషయంలో జోస్యం చెప్పాడు. రాష్ట్ర పరిస్థితి వివరించడానికి దిల్లీకి వెళ్ళిన రాష్ట్రానికి చెందిన బిజెపి ప్రతనిధి బృందాన్ని ఆయన ముందస్తుపై హెచ్చరించిన విషయం తెలియంది కాదు. మంచి మెజార్టీ ఉన్నా 2018లో కెసిఆర్‌ ‌ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన విషయాన్ని ఆయన వారికి గుర్తుచేస్తూ ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా పోరాటానికి సిద్దం కావాలని హెచ్చరించారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకుపోవాలని ఆయన వారికి సూచించారు కూడా. అలాగే కాంగ్రెస్‌ ‌పార్టీకూడా మండల, గ్రామీణ స్థాయిలో అదికంగా సభ్యత్వం చేయించే పనిలో పడింది. ఆ పార్టీ ఎంపి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో ముందస్తు ఖాయమని ఇటీవల పేర్కొన్నారు. ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి 2024లో జరగాల్సిన ఎన్నికలు ఈ సంవత్సరం అంటే 2023 అక్టోబర్‌ ‌లేదా నవంబర్‌లో జరుగుతాయని చెబుతున్నారు. ఆ మేరకు కెసిఆర్‌ అన్ని హంగులు ఇప్పటినుండే సమకూర్చుకుంటున్న విషయాన్ని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికల వార్తలు వింటుంటే అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఇటీవల రాష్ట్రంలో హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరిగిన తీరు వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆ స్థానం కోసం అధికార పార్టీ కోట్ల రూపాయలను మంచినీటి ప్రాయంగా ఖర్చు చేసిన దరిమిలా, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ చేసే వ్యయంతో తాము ఏ విధంగా పోటీ పడగలమన్న భయం అప్పుడే వారిలో ఏర్పడుతున్నది.

Leave a Reply