Take a fresh look at your lifestyle.

మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన

ప్రధానిమరోమారు జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నెల 25న జాతీయ వోటర్ల దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకే దేశం.. ఒకే ఎన్నిక అవసరాన్ని వివరించిన విషయం తెలిసిందే. వాస్తవంగా కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారం చేపట్టినప్పటి నుండీ దేశంలో ఈ విషయమై చర్చ కొనసాగుతూనే ఉంది. కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వివిధ కాలాల్లో జరుగుతున్న ఎన్నికల వల్ల పాలనా పరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలతోనే కాలం తెల్లారిపోతున్నది. ప్రజాసంక్షేమం, అభివృద్దిపై పాలకులు దృష్టిపెట్టలేకపోతున్నారు. అలాగే ఈ ఎన్నికల నిర్వహణ బోలెడు ఖర్చుతో కూడుకున్నది. దేశంలో 29 రాష్ట్రాలు, ఏడు యూనియన్‌ ‌టెరిటరీలున్నాయి. ప్రతీ సంవత్సరం వీటిల్లో ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. పలుసార్లు ఎన్నికల నిర్వహణవల్ల విపరీతమైన ఖర్చు అవుతుంది. అందుకు దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంద్వారా ఈ ఖర్చును నిరోధించవొచ్చన్నది మోదీ అభిప్రాయం. దీని వల్ల ఖర్చు ఒకటేకాకుండా అనేక లాభాలుంటాయంటారాయన. ఎలక్షన్‌ల కారణంగా కోడ్‌ అమలు చేయాల్సి వొస్తుంది. దాని వల్ల ఆయా ప్రభుత్వాలు సత్వరం తీసుకోవాల్సిన నిర్ణయాలకు బ్రేక్‌ ‌పడుతుంది. అది ప్రజలకు ఇబ్బందికరంగానూ ఉంటుంది. అయితే ఇది సాధ్యమేనా అన్న విషయంలో దేశంలో చాలాకాలంగా చర్చలు జరగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ల్రాలు, ఆయా రాష్ట్రాల పరిధిలోని పలుప్రాంతాలు భిన్న వాతావరణం, విభిన్న పరిస్థితులు నెలకొని ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ప్రధాని చెబుతున్న జమిలి ఎన్నికలు సాధ్యపడుతాయా అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. అన్నిటికిమించి ఈ అభిప్రాయంతో ఆయా రాష్ట్రాలు ఏకీభవిస్తాయా అన్నది మరో ప్రశ్న. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమన్నది ఫెడరలిజం స్పూర్తికి విఘాతం ఏర్పడుతుందన్న వాదన కూడా లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యం గా స్థానిక సమస్యలు ముందుకు వొస్తాయి.

వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చే పార్టీలకో, అభ్యర్థికో వోటు వేసి ప్రజలు గెలిపించుకుంటారు. కాని, జమిలి ఎన్నికల్లో • కేంద్రంలో అధికారం చేపట్టబోయే వారిపైనే ప్రధాన దృష్టి ఉంటుందన్న వాదన కూడా లేకపోలేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పుట్టుకొస్తున్న ప్రాంతాయ పార్టీలకు ఈ జమిలి ఆలోచన గొడ్డలివేటు అవుతుందన్న వాదనకూడా వినిపిస్తున్నది. అనేక రాష్ట్రాలు అనేక రాజకీయపార్టీల పాలనలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రాంతీయ పార్టీలు కావడం విశేషం. ఈ పరిస్థితిలో ఈ పార్టీలు ఇప్పటికే తమ అసమ్మతిని తెలియజేశాయికూడా. అంతేకాదు జమిలి ఎన్నికలు చేపట్టాలంటే ముందుగా పార్లమెంటులో దీనిపై చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పార్లమెంట్‌లో అధికార బిజెపికి కావాల్సినంత బలం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణతో సహా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, పంజాబ్‌ ‌లాంటి పలు రాష్ట్రాలు బిజెపిపై గుర్రుగా ఉన్నాయి. ఏపి, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ అవి ఎటు మొగ్గేది అనూహ్యం. వాస్తవంగా కేంద్రంతో సహా పలు రాష్ట్రాల్లో చివరగా 2019లో ఎన్నికలు జరిగాయి. తిరిగి 2024లో మళ్ళీ ఎన్నికలు జరుగాల్సిఉంది. కాని, ఈ మధ్యకాలంలోనే కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి, జరుగబోతున్నాయి. ఒక వేళ ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నట్లు దేశంలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగే పక్షంలో ఇటీవల ఎన్నికలు జరుపుకున్న రాఫ్ట్ర ప్రభుత్వాల కాలపరిమితి పూర్తికాకుండానే మరోసారి ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది.

విచిత్రమేమంటే తాజాగా దేశంలో మరో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిల్లో ఉత్తర •ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌పంజాబ్‌, ‌గోవా, మణిపూర్‌ ‌రాష్ట్రాలున్నాయి. వీటిలో ఒక్క పంజాబ్‌లో మినహా మిగతా రాష్ట్రాలన్నిటిలో భారతీయ జనతాపార్టీయే అధికారంలో ఉంది. అయితే ఆయా ప్రభుత్వాల కాలపరిమితి పూర్తికావటంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యమైనాయి. ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినప్పటికీ జమిలి ఎన్నికలు అనివార్యమైన పక్షంలో పూర్తికాలం ఆయా ప్రభుత్వాలు కొనసాగే అవకాశాలు లేవు. అయినా ఈ ఎన్నికలపై కోట్ల రూపాయలను పాలకులు వ్యయంచేస్తున్నారు. అయిదేళ్ళపాటు అధికారంలో ఉండే విధంగా ప్రజలు వోటు హక్కుతో ఎన్నుకున్న ప్రభుత్వాలన్నీ దీంతో మూడేళ్ళ ముందుగానే మూటాముల్లె సదురుకోకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు సహకరిస్తాయన్నది అనుమానమే. గత రెండు ఎన్నికలనుండి భారతీయ జనతాపార్టీకి కేంద్రంలో మంచి మెజార్టీ ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లోకూడా అ పార్టీ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావొచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత తరుచు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply