Take a fresh look at your lifestyle.

వారం రోజుల్లో ఉప ఎన్నిక.. ఎటూ తేల్చుకోలేక పోతున్న వోటర్లు

మరో వారం రోజుల్లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగనుంది. మరో నాలుగు రోజుల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడనుంది. ఇక్కడ మూడు పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యనే కొనసాగుతున్నది. ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవి కావడంతో ఇక్కడ ఆయా పార్టీల ప్రచారం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన నిధుల కేటాయింపు అంతా అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలకే చెంది ఉండడంతో ఇక్కడి ప్రజలకు అనేక రకాల హామీలివ్వడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అంతేకాదు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ ప్రభుత్వం కేటాయిస్తున్నదన్న విషయాన్ని ఈ ప్రచార సందర్భంగా ఆయా పార్టీల నాయకులు విడమరిచి చెప్పుతున్న తీరు ప్రజలను అయోమయంలో పడేస్తున్నది. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తేల్చుకోలేకపోతున్నారు. ఎవరికి వోటేయాన్న విషయంలో కూడా వారు సంశయంలో పడ్డారు. హుజూరాబాద్న్ ‌వోటర్లను ఎవరిని కదిలించినా ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారు. ఎవరికి వోటు వేయాలన్న విషయాన్ని ఇంకా తాము తేల్చుకోలేక పోతున్నామన్నది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇప్పుడు దేశ ప్రజలు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇవి హుజూరాబాద్‌ ‌ప్రజలకు, కెసిఆర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని కొందరు చెబుతుంటే, టిఆర్‌ఎస్‌, ‌బిజెపి మధ్య భవిష్యత్‌ అధికారానికి జరుగుతున్న ఎన్నికలుగా మరికొందరు ఉద్ఘాటిస్త్తున్నారు. ఏది ఏమైనా రెండు పార్టీల ముఖ్యనాయకులు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిని కేందీకరించడం, ప్రచారంలో పాల్గొంటుండడంతో హుజూరాబాద్‌లో యుద్ధవాతావరణం నెలకొంది.

అక్కడ మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటుంది. తాజాగా ఈ పార్టీల మధ్య పెట్రోలు మంటలు చెలరేగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌ ‌ధరలకు మీరు కారణమంటే మీరు కారణమంటూ రెండు పార్టీల నాయకులు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వొచ్చినప్పుడు పెట్రోల్‌పై పన్ను కేవలం పది రూపాయల 43 పైసలైతే, ఇప్పుడు ఆ పన్నును 32 రూపాయల 90 పైసలుగా పెంచిందని హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపును తన భుజాలపై వేసుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిష్‌రావు ఆరోపిస్తుండగా, లీటర్‌ ‌పెట్రోల్‌పై కెసిఆర్‌ ‌ప్రభుత్వం 41 రూపాయలను పన్ను రూపంలో దోచుకుంటున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రతి విమర్శ చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తన ఆదాయాన్ని తగ్గించుకుంటే తెలంగాణ ప్రజలకు లీటర్‌ ‌పెట్రోల్‌ ‌కేవలం అరవై రూపాయలకే లభిస్తుందంటున్నారు. ఇది ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తున్నది. పెరుగుతున్న ధరలకు కేంద్రాన్ని నిందించాలా, రాష్ట్రాన్ని నిందించాలో అర్థంకాక ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అదేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షమ పథకాలు..అంటే రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు, ఇండ్ల నిర్మాణం, రేషన్‌ ‌బియ్యం లాంటి వాటికి కావాల్సినన్ని నిధులను కేంద్రమే అందిస్తున్నదన్న విషయాన్ని కిషన్‌రెడ్డితోపాటు రాష్ట్ర నాయకులు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పోటాపోటీ ప్రచారాలు ఎంతదూరం వెళ్తున్నాయంటే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మల్లయుద్ధాలకు దారి తీస్తున్నది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హుజూరాబాద్‌లో ప్రచారానికి వొచ్చినప్పుడు టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికను రానున్న కాలంలో రాష్ట్రంలో కాషాయ జండాను ఎగురవేయడానికిది లిట్మస్‌ ‌టెస్ట్‌గా బిజెపి భావిస్తుంది. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో తాము గెలిచి తీరుతామని ధీమాను వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్‌ ‌నాయకులు జితేందర్‌రెడ్డి, డికె అరుణ, విజయశాంతి మరికొందరు రాష్ట్ర నాయకులు మండలాలు, గ్రామాల వారిగా ప్రచార కార్యక్రమాన్ని ఉదృతంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ గెలుపుకోసం బిజెపి అక్రమాలకు పాల్పడుతున్నదని టిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆరోపిస్తున్నారు. కొందరు ముఖ్యమైన కార్యకర్తల పేర వివిధ చోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించి, ఆ ఖాతాల్లోకి డబ్బు పంపిస్తున్నారని, ఈ నెల 30న జరుగునున్న ఎన్నికల సందర్భంగా వోటుకు నోట్లు పంచిపెట్టేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్లు ఆధారాలున్నాయంటూ టిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల అధికారులు ఈ విషయంలో సత్వరం చర్యలు తీసుకోనిపక్షంలో తమ గెలుపు ప్రశ్నార్థకంగా మారుతుందని వారు అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేయటంతో నిజంగానే హూజూరాబాద్‌లో ఏం జరుగుతున్నదని గందరగోళంగా మారింది. ఇదిలా ఉంటే పోటీలో ఉన్న మూడవ పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ ఒక విధంగా ఒంటరి పోరు చేస్తున్నారనే చెప్పాలె. ఎందుకంటే నామినేషన్‌నాడు వొచ్చిన ఆ పార్టీ రాష్ట్ర నేతలెవరూ ఆ తర్వాత ఆయన వెంట ప్రచారంలో తిరగపోవడం ఆ పార్టీ నాయకులను తీవ్ర నిరాశపరుస్తున్నది. ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగిస్తుండడంతో ఆదివారం నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాలుగు రోజులపాటు ఇక్కడే మకాం వేస్తారన్న వార్తలు వొస్తున్నాయి. అయితే బిజెపి, కాంగ్రెస్‌ ‌చీకటి ఒప్పందమే ఆ పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణమని మంత్రి కెటిఆర్‌ ఆరోపిస్తుండడంతో ప్రజలు ఎవరిమాటలో ఎంత నిజం ఉందో అర్థంచేసుకోలేక ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

Leave a Reply