ఖమ్మం,మే 22 ప్రజాతంత్ర (ప్రతినిధి): ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుల నేపధ్యంలో నిబంధనలు పాటిస్తూ అన్ని రకాల పనులకు అనుమతించినందున ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో నిబంధనలకు లోబడి వెంటనే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుందర య్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగం ప్రధాన ఆధారమైన గ్రెయిన్ మార్కెట్లో వ్యాపార అనుమతులు ఇవ్వక పోవడం వలన రైతాంగం, కార్మికులు, వ్యాపారులు, పరోక్షంగా మార్కెట్‌పై ఆధారపడి జీవనం కొనసాగించే వేలాదిమంది నష్టపోతున్నార న్నారు. మున్నేరు ఒడ్డున వ్యాపారాలు జరుగుతుండటంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోని గ్రెయిన్ మార్కెట్లో నిబంధనలకు లోబడి వ్యాపార లావాదేవీలు జరుపుటకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మార్కెట్ సమస్యతో పాటు కరెంట్ బిల్లుల సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు.
మార్చి, ఏప్రియల్ నెలలు కలిపి ఒకేసారి బిల్లు రావడం వలన స్లాబ్ రేట్లు మారి బిల్లు అధి కంగా వచ్చాయన్నారు. గత సంవత్సరం మార్చిలో వచ్చిన బిల్లులనే యదావిధిగా తీస్తామని విద్యుత్ అధికారులు చెప్పటం కూడా సరైనది కాదన్నారు. కొన్ని కుటుంబాలు అవి పూర్తిగా ఇండ్లలో లేకపోయినా వారికి కూడా గత మార్చి బిల్లులే వచ్చే అవకాశం ఉందని వాస్తవ బిల్లు లు తీసి ఇవ్వాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం 100 కోట్ల నిధులతో అభివృద్ది చేపడతామని ప్రకటించి, నేటికి ఈ హామీ మాటల్లో తప్ప, చేతల్లో కనబడటం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం పాల్గొన్నారు.