201 ఎకరాల్లో ఎయిమ్స్ భవన నిర్మాణాలు పాక్షికంగా పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత డాక్యుమెంట్స్ ఇవ్వలేదు..చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : కొరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, కరీంనగర్ జిల్లా దవాఖానాకు ఎంఆర్ఐ స్కాన్, హుజూరాబాద్ హాస్పిటల్‌కి సీటీ స్కాన్‌ను తక్షణమే మంజూరు చేయాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిని కలిసిన బండి సంజయ్ వందలాది గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రమైన కరీంనగర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవల అవసరాలు పెరుగుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో తన 50వ జన్మదినోత్సవం నాడు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని దవాఖానాలకు నాలుగు అంబులెన్సులు, వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చిన విహాయన్ని మంత్రికి తెలిపారు. జిల్లా ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కరీంనగర్లో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని బండి సంజయ్ కేంద్ర మంత్రిని మన్సుఖ్ మాండవీయ ను కోరారు. దీనితో పాటు బీబీనగర్ ఎయిమ్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించండి అని కూడా కోరారు.
బీబీనగర్ ఎయిమ్స్ సమస్యలు మంత్రి దృష్టికి..
తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎంపీ, ఎయిమ్స్ బీబీనగర్ సంస్థ సభ్యులు బండి సంజయ్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఎయిమ్స్ బీబీనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియాతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన బండి సంజయ్ ఎయిమ్స్ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేశారు. ఎయిమ్స్ మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున, వొచ్చే నెలలో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రజల, ఉద్యోగుల ప్రయోజనాల రీత్యా ఎయిమ్స్ బీబీనగర్ పేరును మార్చాలనే ప్రతిపాదనను ఎయిమ్స్ ఐబీ సభ్యులు ఆమోదించినందున ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. ఎయిమ్స్ బీబీనగర్‌లో 100 పడకల సేవలను త్వరలో 200 పడకలకు విస్తరిస్తున్నట్లు, ఓపీడీ, డయాగ్నోస్టిక్స్, ఆర్టీపీసీఆర్-19 కోవిడ్ టెస్టింగ్ సర్వీసులు, కోవిడ్ కేర్ సెంటర్ సహా 19 విభాగాలు పనిచేస్తున్నాయని బండి సంజయ్ కేంద్ర మంత్రికి ద్రుష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రెండు బ్యాచ్ లతో ఎంబీబీఎస్ తరగతులు నడుస్తున్నాయని, ఈ ఏడాది 125 మంది విద్యార్థులతో మూడో బ్యాచ్ తరగతులు ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 16 సీనియర్, 16 జూనియర్ రెసిడెంట్ పోస్టులను మాత్రమే మంజూరు చేసినందున అదనంగా మరిన్ని సీనియర్ రెసిడెంట్ పోస్టులను మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
అలాగే సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రారంభిస్తున్నందున భువనేశ్వర్, భోపాల్, జోధ్‌ఫూర్, రాయ్ పూర్, పాట్నా ఎయిమ్స్ ల తరహాలో అదనంగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేయాలని, ఎయిమ్స్ 3వ అంతస్తు పునరుద్దరణ పనులు కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ కేంద్ర మంత్రిని కోరారు. 201 ఎకరాల్లో ఎయిమ్స్ భవన నిర్మాణాలు పాక్షికంగా పూర్తయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సంబంధిత డాక్యుమెంట్స్ అందజేయని విషయాన్ని బండి సంజయ్ కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. బిల్డింగ్ పర్మిట్, ఫైర్ ఎన్ఓసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వంటి తప్పనిసరి పత్రాలు కూడా నేటికీ అందించబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని మంత్రిని కోరారు. ఎయిమ్స్ సరిహద్దు లోపల హైటెన్షన్ వైర్లున్నాయని, వాటిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ సరైన స్పందన లేదని, తక్షణమే ఆ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని అభ్యర్ధించారు. ఎయిమ్స్ బీబీనగర్ హాస్పిటల్ లో ఐసీయూ, ఓటీ, ల్యాబ్, రేడియో ఇమేజింగ్, రోగ నిర్దారణ, గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల, విద్యార్థులకు బోధన, శిక్షణా హాస్పిటల్ ఏర్పాటు చేయడంతోపాటు హాస్పిటల్ పడకలను 150 లేదా 200 కి విస్తరించాలని యోచిస్తున్న విషయాన్ని కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు.
ఈ మేరకు రూపొందించిన డీపీఆర్ కు అనుగుణంగా పరికరాల కొనుగోలు కోసం 183 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరారు. ఎయిమ్స్ బీబీనగర్ లో పనిచేస్తున్న కొందరు అధ్యాపకులు జిప్ మర్, ఐఎన్ఐ, పీజీఐమర్, ఎయిమ్స్ వంటి ఇతర సంస్థల్లో చేరారని, వారి రాజీనామాలను ఆమోదించి కొత్త అధ్యాపకులను నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్, వరంగల్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రైళ్లు బీబీ నగర్ మీదుగా వెళుతున్నాయని, ఆయా రైళ్లను బీబీనగర్ లో నిలిపేలా రైల్వే శాఖను కోరాలని, అదే విధంగా ఎయిమ్స్ క్యాంపస్ సమీపంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతోపాటు ఎయిమ్స్ బీబీనగర్ వద్ద బస్టాప్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. బోధన, శిక్షణతో సహా వైద్య సేవలను అందించడానికి బొమ్మలరామారంతో సమీపం పీహెచ్ సీలో గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం అభివృద్ధి కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని, ఇందుకోసం 58 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని, వాటిని ఆమోదించాలని మంత్రిని కోరారు.