రాగద్వేషాల నాటకాలు..
భయ పక్షపాతాలకే..
పట్టం కట్టే కీచక పర్వాలు
విభజించి పాలిస్తూ..
లక్షిత సమూహాలపై..
బుల్డోజర్లు దౌడుతీతలు
ఉత్తర భారతాన కూల్చు వేతలు !
బుల్డోజర్ ఒక యంత్రమే కాదు..
భవనాల తలల్ని నరికే ఆయుధం
విద్వేష విచ్ఛిన్న విధ్వంస చిహ్నం
సామాన్యడి ఇంటిపై ఉక్కుపాదం
నాగరికతను చూర్ణం చేసే డోజర్
రాజ్యాంగ విలువలకు చరమగీతం !
వెర్రితలల పాలన కొరడాలు
చెత్తబుట్టలో గంపగుత్తగా..
విసురేస్తున్న విలువలు
కబళిస్తున్న పౌరహక్కులు
కట్టలు తెగిన రాజ్యహింసలు
యూపీలో యంత్ర మంత్రాలు !
కుక్కకాటుకు చెప్పు దెబ్బంటూ..
రాళ్లు విసిరే అల్లరి మూకలకు..
రిటర్న్ గిఫ్టుగా శిథిల గృహాలు
నేరగాళ్లకు సన్మానాలంటూ..
ఆక్రమణల్ని కసిగా అంతుచూస్తూ..
డోజర్లతో నిర్దయగా నేలమట్టాలు
తప్పుకు తక్షణ న్యాయంగా..
తలతిక్క తలారుల వ్యవస్థలు !
విద్వేష మూకలపై..
న్యాయ స్థానాల బరువు తగ్గించే..
బుల్డోజర్లు స్వైరవిహారాలు
ప్రభుత్వ పాలన పగ్గాలే..
ప్రజాస్వామ్య రక్షకభటులు
జనసామాన్య సంక్షేమానికి..
న్యాయ వ్యవస్థలే శ్రీరామరక్షలు !
– మధుపాళీ
కరీంనగర్ – 9949700037