Take a fresh look at your lifestyle.

బిఆర్‌ఎస్‌ – ‌బిజెపికి ప్రత్యమ్నాయం అవుతుందా ?

Bharat Rastra Samithi భారత్‌ ‌రాష్ట్ర సమితి (బిఆర్‌సి) కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ(బిజపి)కి ప్రత్యామ్నాయం అవుతుందా అన్నదిప్పుడు కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ప్రధాన చర్చనీయాంశమైంది. అనేక దశాబ్ధాల తర్వాత కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపి, ఎన్‌డిఏ కూటమితో వేళ్ళూనుకుని ఉండగా, దాన్ని కొత్తగా నిన్న అంటే బుధవారం దసరా సందర్భంగా ఏర్పడిన భారత్‌ ‌రాష్ట్ర సమితి ఏమేరకు ఎదిరించి నిలువగలదన్న విషయంపైనే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎనమిదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైఖరిని కాంగ్రెస్‌తో సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు కొంతకాలంగా తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని, బిజెపియేతర రాష్ట్రాలపట్ల కేంద్రం సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నదన్న ఆరోపణలు తరుచు వినపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకులపైన సామ, దాన, భేదోపాయలతో భయపెట్టి రాష్ట్రాన్నే హస్తగతం చేసుకుంటున్నదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక వనరులపైన కేంద్రం ఆజమాయిషి ఉండడం వల్ల, తనకు అనుకూలంగాలేని రాష్ట్రాలకు నిధులు సమకూర్చకుండా ఆయా రాష్ట్రాలను ఆర్థికంగా అస్తిరపరుస్తున్నదన్నది కేంద్రంపైన వొస్తున్న మరో ప్రధాన ఆరోపణ. ఈ పరిస్థితుల్లో తమ రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా కాపాడుకునేందుకు ఒక ప్రత్యమ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందంటూ బిజేపియేతర పాలనలోఉన్న రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొంతకాలంగా చర్చలు జరుపుతున్న విషయం తెలియందికాదు. ప్రత్యామ్నాయం ఏర్పడే ఐక్యవేదికకు నాయకత్వం ఎవరు వహిస్తారన్న విషయంలో వారికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిన్నటివరకు అది కార్యరూపం దాల్చలేకపోయింది.

వీరందరిని సంఘటితం చేసేందుకు అనేక దఫాలుగా చర్చలు జరిపిన తెలంగాణ రాష్ట్ర సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంకా కాలయాపన చేయడం సరికాదనుకున్నారోఏమో ఏకంగా ప్రత్యామ్నాయ జాతీయ పార్టీనే ప్రకటించారు. చెడుపైన మంచికి ప్రతీకగా పేర్కొనే దసరా రోజున ఈ జాతీయ పార్టీని ఆయన ప్రకటించారు. మంచిరోజులు, ముహూర్తాలను పాటించే కెసిఆర్‌ ‌బుధవారం సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట పందొమ్మిది నిమిషాలకు తాను పెట్టబోయే పార్టీకి భారత్‌ ‌రాష్ట్ర సమితిగా నామకరణచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, జడ్‌పి చైర్మన్‌ ‌లు , వివిధ జిల్లాల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇతర రాష్ట్రాల నాయకులను కూడా ఆహ్వానించినప్పటికీ తమిళ, కర్ణాటకకు చెందిన నాయకులు మాత్రం హాజరై తమ మద్దతును ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ , కెసిఆర్‌తో మంతనాలు జరిపిన వారెవరూ హాజరుకాకపోగా, పార్టీ ఏర్పాటుపై వారు పెద్దగా స్పందించిందిలేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన తెరాసకు రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఉంది. రాష్ట్ర సాధనలో సబ్బండ వర్ణాలు పాల్గొన్నప్పటికీ ఉద్యమపార్టీగా దానికి ప్రేత్యేక గుర్తింపు వచ్చింది. 2001లో ఆవిర్భవించిన టిఆర్‌ఎస్‌ ఆ ‌తర్వాత రాజకీయ పార్టీగా మారి, గత ఎనిమిదేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్నది. ఉద్యమపార్టీగా పలు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకోవటంతప్ప ఇతర రాష్ట్ర ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. పార్లమెంటు ఎన్నికలు మరో ఏడాదిన్నర కాలంలో రాబోతున్న తరుణంలో ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు బిఆర్‌ఎస్‌గా నామకరణంచేసి జాతీయ పార్టీగా ప్రకటించడమైంది. అయితే ఇతర రాష్ట్రాలు కొత్తగా ఏర్పడిన బిఆర్‌ఎస్‌ను ఏ మేరకు ఆదరిస్తాయన్న విషయంపైన దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు అనేక భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయంగా ఒక ఐక్యవేదిక థర్డ్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని మొదట్లో వివిధ రాష్ట్రా నాయకులను కలిసిన కెసిఆర్‌, ఆ ‌తర్వాత కాలంలో థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు , కేంద్ర పాలనా వ్యవస్థలో గుణాత్మక మార్పును తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ వొచ్చారు. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీకి నామకరణం చేసేశారు. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల అధికారికి కావాల్సిన పత్రాలను కూడా సమర్పించడమయింది. ఎన్నికల కమిషన్‌ ‌వెంటనే ఈ పేరును ఆమోదిస్తే ముందుగా స్వంత రాష్ట్రం మునుగోడులో త్వరలో జరుగబోయే ఉప ఎన్నికతోనే బిఆర్‌ఎస్‌ అరంగెట్రం చేయబోనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా దక్షిణాది ప్రాంత పార్టీని ఉత్తరాది రాష్ట్రాలు ఏమేరకు ఆమోదిస్తాయన్నదే ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్న. అంతేగాక దేశంలో ఎక్కువగా హిందీ మాట్లాడే రాష్ట్రాలే ఎక్కువ. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కోరాష్ట్రం ఒక్కో భాషను కలిగి ఉన్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బిజెపి వాటి అనుబంధ సంస్థలు ప్రతీ రాష్ట్రంలో దశాబ్ధాలుగా కార్కక్రమాలను కొనసాగిస్తున్నాయి.

బిజెపికి ఇప్పటికే మతతత్వ పార్టీగా పేరుంది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ సంబంధాలు చాలవరకు మెరుగుపడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్తితిలో కెసిఆర్‌ ఒం‌టరిగా కేంద్రాన్ని ఎలా ఢీ కొడుతారన్నది అందరి నోళ్ళలో నలుగుతున్న అంశం. కాగా తెలంగాణ విషయంలో ఒంటరిగానే యుద్దానికి బయలుదేరి రాష్ట్రాన్ని సాధించినట్లే, జాతీయ రాజకీయాల్లోకి ఒంటరిగానే అడుగుపెట్టినా మద్దతు కూడగట్టుకోగల సమర్థత, సత్తా కెసిఆర్‌కు ఉన్నదంటున్నాయి అ పార్టీ వర్గాలు.

ఇదిలా ఉంటే అలా పార్టీని ప్రకటించారో లేదో అనేక ప్రాంతానుంచి పలువురు కెసిఆర్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, ‌బుందేల్‌ఖండ్‌ ‌‌తదితర ప్రాంతాలకు చెందిన రాజకీయ, రైతు సంఘాలు, నీటి సంఘాల నాయకులు, రిటైడ్డ్ ఉద్యోగులు, వివిధ పత్రికల ఎడిటర్స్ ‌కూడా కెసిఆర్‌ ‌సముచిత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం దేశ అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సరైన దృక్పథం ఉన్న నాయకులెవరూ కేంద్రంలో లేరని, ఆ లోటును కెసిఆర్‌ ‌భర్తీ చేస్తారని వారు తమ ప్రకటనల్లో పేర్కొనడం గమనార్హం. ప్రత్యామ్నాయం  లేకపోవడంతో యావత్‌ ‌దేశ ప్రజలు కేవలం రెండు (కాంగ్రెస్‌, ‌బిజెపి) పార్టీల చుట్టే తిరుగుతున్నారు. కెసిఆర్‌ ‌నూతనంగా జాతీయ పార్టీని ప్రకటించడంతో ప్రజల్లో నూతనోత్తేజం కలుగుతున్నదని, దాన్ని ప్రజలు ఆదరిస్తారన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగునీటితోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి తెలంగాణలో చేస్తున్న కృషి దేశవ్యాప్తం కావాలన్న ఆకాంక్షను మరికొందరు వ్యక్తంచేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపైన అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి అక్రమాలకు తెలంగాణ సరిపోలేదని దేశంవైపు చూడడమే కొత్తపార్టీ ఏర్పాటని కాంగ్రెస్‌, ‌బిజెపి రాష్ట్ర నాయకులు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

పేరు మార్చినంతమాత్రాన జాతీయ పార్టీ అవదని, ఇలాంటి పార్టీలు రావడం, మసకబారడం కొత్తేమీకాదని అంటుంటే, తెలంగాణకోసం పుట్టిన పార్టీ అని ఇంతకాలం చెప్పుకుని తిరిగి ఇప్పుడు ఏకంగా పార్టీ పేరునే మారుస్తే భవిష్యత్‌లో ఇక ఉద్యమపార్టీగా చెప్పుకునే అవకాశం ఉండకపోగా, అసలు తెలంగాణ అస్థిత్వాన్ని కొల్పోవడమేనని మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా ప్రకటించడమంటే ఇక ఆ పార్టీ విఆర్‌ఎస్‌కు చేరువ అయినట్లేనని మరికొందరు ఎద్దేవ చేస్తున్నారు. ఏదిఏమైనా టిఆర్‌ఎస్‌ ఇప్పుడు జాతీయ పార్టీగానే పరిగణించబడుతుంది. ఈ కొత్తపార్టీ మొదటిసారిగా మునుగోడు ఎన్నికల్లో అందుకునే ఫలితాన్నిబట్టి దాని భవిష్యత్‌ ‌ముడివడి ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Leave a Reply