Take a fresh look at your lifestyle.

విస్తరణ దిశగా బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమేరకు ఈ నెల 18న పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచిత్రమేమంటే బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకూడా ఖమ్మంలోనే ఏర్పాటు చేయడం. 2024 ఎన్నికల్లో పోటీ పడనున్న రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లానే తమ ఎన్నికల ప్రస్థానంగా ఎంచుకున్నాయి. ఎనిమిదేళ్ళ తర్వాత తెలుగుదేశం తెలంగాణ పార్టీని పునరుద్దరించే కార్యక్రమానికి ఖమ్మం జిల్లానే ఎంచుకుని తాజాగా భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే వైఎస్‌ఆర్‌టిపి పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల ఉమ్మడి జిల్లాలోని పాలేరు నియోజకవర్గంనుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క సొంత (ఉమ్మడి)జిల్లా అయిన ఖమ్మం నుండే ఆ పార్టీ చీఫ్‌ ‌పాదయాత్ర చేయతలపెట్టాడు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ‌కూడా తమ పార్టీ ఆవిర్భావ సభను ఇక్కడే జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో ఖమ్మం జిల్లాకు అంత ప్రాధాన్యత ఏర్పడింది.

ముఖ్యంగా వైఎస్‌ఆర్‌టిపి, టిడిపి పార్టీలకు పక్కనే ఉన్న ఏపితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఖమ్మం జనజీవనమంతా ఏపి మాదిరిగానే ఉండటం, ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉండటంతో ఆపార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లా వోటర్లు తమకు అండగా నిలుస్తారన్న అలోచన ఉంది. వాస్తవంగా ఈ జిల్లా తెలంగాణ పరిధిలోనిదే అయినా ఉద్యమకాలంలోగాని, ఆ తర్వాత నాటి టిఆర్‌ఎస్‌, ‌నేటి బిఆర్‌ఎస్‌కు పెద్దగా అండగా నిలిచిందికాదు. 2018 ఎన్నికల్లో ఉమ్యడి ఖమ్మం జిల్లాలో టిడిపి 2 స్థానాలను, కాంగ్రెస్‌ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప వీరంతా గులాబీ కండువ కప్పుకోవడం వేరే విషయం. అయితే తాజాగా టిఆర్‌ఎస్‌ – ‌బిఆర్‌ఎస్‌గా మారి జాతీయపార్టీ అవడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ విస్తృతం కావాల్సిఉంది. ముఖ్యంగా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపిని ఢీ కొనేందుకు బిఆర్‌ఎస్‌ ‌రంగం సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వొచ్చినా కనీసం రెండుమూడు సర్వేలు చేయించుకునే కెసిఆర్‌ ‌దేశవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌కు ఎలాంటి ఆదరణ ఉంటుందన్న విషయాన్ని కూడా ముందుగానే సర్వేచేయించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లోఉన్న తెలుగువారి గురించి సమాచారం సేకరించి నట్లు ఆ పార్టీ వర్గాలద్వారా తెలుస్తున్నది.

దాని ఆధారంగా ఒంటరిగానైనా, ఆయా రాష్ట్రాల్లో తమతో కలిసివొచ్చే పార్టీలను కలుపుకుని దేశ వ్యాప్తంగా కనీసం వంద పార్లమెంటు స్థానాలకు, 40 శాసనసభ స్థానలకైనా మొదటిసారిగా పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వినికిడి. అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అని చెప్పినట్లుగా ఆ పార్టీ కిసాన్‌లకు అత్యంత ప్రాధాన్యతను కల్పించేందుకు పంజాబ్‌, ‌హర్యాన, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో భారత కిసాన్‌ ‌సమితి పేర బిఆర్‌ఎస్‌ ‌విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని రైతు నాయకులు, రైతు సంఘాలతోపాటు, వివిధ రాజకీయ పార్టీల్లోని సిట్టింగ్‌లు, మాజీ శాసన, పార్లమెంటు సభ్యులు, సీనియర్‌ ‌నాయకులను బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమార్పు తీసుకువొచ్చేందుకు ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ విధానాలను ఆయా రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలకు సులభంగా అర్థమ య్యేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి నేటి కేంద్ర ప్రభుత్వం తీసుకోలేకపోతున్న చర్యలను సోదాహరణంగా వివరించేందుకు స్థానిక భాషల్లో పాటలను ఆడియో, వీడియోలద్వారా చేరవేసే ప్రయత్నాలు చేస్తోంది.

ప్రజల్లోకి పార్టీ దూసుకుపోయేందుకు ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలు, ఆక్కడి ఆర్థిక, సామాజిక, సాహిత్యం తదితర అంశాలపైన ఇప్పటికే బిఆర్‌ఎస్‌ ‌కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో జరుపనున్న బహిరంగ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. మూడు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేయడంద్వారా ఆయా రాష్ట్రాలకు బిఆర్‌ఎస్‌ ‌సమాచారం త్వరగా చేరే అవకాశం ఉంటుంది. అంతేగాక ఈ భారీ బహిరంగ సభకు పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు విచ్చేస్తుండడంతో మరింత ప్రచారానికి అస్కారముంది. ఆమ్‌ ఆద్మీపార్టీ కన్వీనర్‌, ‌దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌, ‌కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, ‌సమాజ్‌వాదిపార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌లాంటి ముఖ్యనేతలు పలువురు రానున్నట్లు తెలుస్తున్నది. వీరిద్వారా దేశంలోని రైతాంగానికి, రాజకీయ పక్షాలకు బిఆర్‌ఎస్‌పై స్పష్టమైన అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. పక్కనున్న ఏపిలో ఇప్పటికే పార్టీ ఆవిర్భావంకూడా జరిగిపోయింది. బిఆర్‌ఎస్‌ ఏపి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ ‌నియామకం జరిగిపోయింది. మాజీ మంత్రి ఇతర నాయకులు ఇప్పటికే గులాబీ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ •లో కొందరు అలకవహించారు. తమకు సరైన గుర్తింపులేదంటూ వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొందరు బిజెపిలోకి, మరికొందరు తమ మాతృసంస్థ టిడిపిలోకి వెళ్ళేందుకు సిద్ధప•డుతున్నట్లు తెలుస్తున్నది. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆ జిల్లా నాయకులతో కెసిఆర్‌ ‌సోమవారం నిర్వహించిన సమావేశం సందర్భంగాకూడా వారిని అనునయించినట్లులేదు. ఒకవైపు పార్టీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంటే, మరో పక్క సీనియర్‌ ‌నాయకులు పలువురు పార్టీ వీడిపోయేందుకు సిద్ధప•డుతున్న దశలో ఆ పార్టీ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

Leave a Reply