Take a fresh look at your lifestyle.

దూసుకుపోతున్న కిసాన్‌ ‌సర్కార్‌

అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ అం‌టూ జాతీయపార్టీగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌జాతీయ రాజకీయాల్లోకి దూసుకుపోతున్నది. ముందుగా పక్క రాష్ట్రాలపైన దృష్టి కేంద్రీకరించిన ఆ పార్టీ దాయాదిరాష్ట్రంతోపాటు మహారాష్ట్రపైన ప్రత్యేక దృష్టిని సారించింది. పార్టీ విస్తరణకు మహారాష్ట్ర మంచి అనుకూలంగా కనిపిస్తున్నది. ఇప్పటికే మాజీ ఎంఎల్‌ఏలతో, ప్రజా ప్రతినిధులతో సహా పలువురు రైతు నాయకులు గులాబీ కండువా కప్పుకునేందుకు తరలివస్తుండడం ఆ పార్టీకి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నది. దానికి తగినట్లుగా ఇప్పటికే రెండు బహిరంగ సభలను అక్కడ నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ఇప్పుడు మూడవ సభను ఈ నెల 24న నిర్వహించబోతోంది. బిఆర్‌ఎస్‌ ‌తన మొదటి సభను ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించింది. ఆ తర్వాత కంధార్‌-‌లోహాలో రెండవ సభ మార్చ్ ఆరవ తేదీన జరిగింది. ఈ రెండు సభలుకూడా విజవంతం కావడంతో మూడవ సభను కూడా విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు తెగ ఉత్సాహ పడుతున్నారు. జబిందా మైదనంలో జరిగే ఈ సభకు మహారాష్ట్ర నలుమూలలనుండి ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న రాష్ట్రం కావడంతో తెలుగువారు కూడా ఈ సభలో అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశాలున్నాయి. పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎం‌పీ బీబీ పాటిల్‌లు సభ ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ సభ విజయవంతంపైన బిఆర్‌ఎస్‌ ‌భవిష్యత్‌ ‌ప్రణాళిక ఆధారపడి ఉంటుందను కుంటున్నారు. దీని ఫలితాలు తెలంగాణ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయను కుంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌పోటీచేయాలన్న ఆలోచనలో ఉంది. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేప్రయత్నాలు చేస్తోంది. అందుకే మూడవ సభ సందర్భంగా భారీ స్థాయిలో ప్రజాప్రతినిధిలు గులాబీ కండువ కప్పుకునే అవకాశాలున్నాయనుకుంటున్నారు. బిజేపీ, శివసేనతోపాటు ఎన్సీపీ, శివ సంగ్రామ్‌, ‌మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఇతర పార్టీలనుండి కూడా అనేక మంది పార్టీ తీర్థం తీసుకునే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో అంతోఇంతో పలుకుబడి, పేరున్న షెట్కారీ సంఘటన్‌ ‌నేత శరద్‌ ‌ప్రవీణ్‌జోషీ, మాజీ ఎంఎల్‌ఏలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్‌ ‌తదితరులు ఇప్పటికే పార్టీలో చేరిపోయారు. ప్రజలనుండి వస్తున్న ఈ ఆదరణ చూసిన బిఆర్‌ఎస్‌ ‌మరిన్ని సభలను నిర్వహించాలనుకుంటోంది. పూర్వం నిజాం కాలంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న షోలాపూర్‌లో కూడా మరో సభను నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీలోను పార్టీ పట్ల ఆసక్తి కనబరుస్తున్నవారున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడిని ఇప్పటికే ఏర్పాటు చేయగా అక్కడ సభలను నిర్వహించే విషయంలో సమాలోచనలు జరుగుతున్నాయి. ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్‌ల విషయంలో తెలంగాణ – ఆంధ్ర మధ్య మాటల యుద్ధం చెలరేగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వేర్పాటు ఉద్యమకాలంలో ఆంధ్రులపై అవహేళనగా మాట్లాడిన కెసిఆర్‌ ఇక్కడ సభ ఎలా పెడతాడో చూస్తామని అక్కడి అధికార పార్టీ నాయకులు ఇటీవల సవాల్‌ ‌విసిరిన నేపథ్యంలో అక్కడ సభ నిర్వహణ ఉత్కంఠభరి•తంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఏపీ రాజధానిగా ఎక్స్‌పోజ్‌ ‌చేయబడిన విశాఖలోనే మొదటి బహిరంగ సభను ఏర్పాటుచేయాలని బిఆర్‌ఎస్‌ ‌భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

తాజాగా కర్ణాటక యుద్దం క్షేత్రంలోకూడా బిఆర్‌ఎస్‌ ‌ప్రధాన పాత్ర వహించబోతున్నది. అక్కడ బిజేపీతో తీవ్రంగా పోటీ పడుతున్న జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతునివ్వడం ద్వారా ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌విస్తరణకు నాంది పలుకుతున్నది. జేడీఎస్‌ ‌కూడా తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పథకాలనే ప్రధానాస్త్రాలుగా సందిస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుజరాత్‌ ‌మాడల్‌కాదు.. తెలంగాణ మాడల్‌ను అమలు చేస్తామని బాహాటంగానే ప్రచారం చేస్తోంది. తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు పథకాన్ని రైతు చైతన్య పేర ప్రవేశపెడతామని ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేస్తున్నది. అలాగే స్వంత భూమి ఉన్న ప్రతీ రైతుకు ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు అందజేయనున్నట్లు పేర్కొంటున్నది. రైతు కూలీలకు నెలకు రెండు వేల చొప్పున వికలాంగులకు, వితంతువులకు రెండు వేల అయిదు వందల రూపాయలను తెలంగాణలోలాగా అందజేస్తామని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే కర్ణాటకలో జనాభాలో తెలుగువారి సంఖ్య కనీసంగా ముప్పై శాతం ఉండడంతో తెలుగులో తెలంగాణ పథకాలను ధారళంగా వివరించగలిగే వారిని కర్ణాటకలోని తెలుగువారు అధికంగా ఉండే జిల్లాలకు పంపించేందుకు కూడా బిఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. వీరితోపాటు రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల్లో నిర్వహించే ఎన్నికల సభలో స్వయంగా బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీష్‌రావులు పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తంమీద దేశవ్యాప్తంగా కిసాన్‌ ‌సర్కార్‌ ‌పార్టీ విస్తరించేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఆ పార్టీ వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నది.

– మండువ రవీందర్‌రావు

 

Leave a Reply