- ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారు
- తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు చోటివ్వనోడు మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ఇస్తాడట..
- మహిళా బిల్లును చింపేసిన ఎస్పీ నేతను పక్కన పెట్టుకుని మాట్లాడటం సిగ్గు చేటు
- మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్ఎస్ సభ పెట్టినట్లున్నరు
- అధికారంలోకి వచ్చి ‘జై తెలంగాణ’ అనే పదాన్ని విస్మరించిన తెలంగాణ ద్రోహి
- ఖమ్మం సభ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బండి సంజయ్ విసుర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19 :బీఆర్ఎస్ తొలి సభ ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆలయం కట్టి ఎట్లా వ్యాపారం చేయాలో చూపించడానికే సీఎంలను యాదాద్రి తీసుకెళ్లారని అన్నారు. కేసీఆర్ నోట ఏ దేశం పేరొస్తే… ఆ దేశం పని ఔట్ అయిపోతోందని పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలే ఇందుకు ఉదాహరణ అని గుర్తు చేశారు. దయచేసి ఇండియా బాగుందనే పదం కేసీఆర్ నోట రానివ్వొద్దని కోరారు. క్రిష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను వాడుకోలేని కేసీఆర్ దేశ జల విధానం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల కట్టి సాగునీరందిస్తే.. తెలంగాణలో వ్యవసాయ బోర్ల సంఖ్య ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేయడం లేదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అగ్నిపథ్ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలను కూడా సక్రమంగా భర్తీ చేతగాకపోవడంతో లక్షల మంది నష్టపోతున్నారని చేతనైతే వాళ్లకు సాయం చేయాలని సూచించారు. తుపాకీరాముడి మాదిరిగా టోపీ పెట్టుకున్న కేసీఆర్ మేక్ ఇన్ ఇండియాను విమర్శించడం విడ్డూరమన్నారు. తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు చోటివ్వని కేసీఆర్ మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ఇస్తాననడం హాస్యాస్పదమన్నారు. మహిళా బిల్లును చింపేసిన ఎస్పీ నేత పక్కనే ఉన్నారని… ఆయనకు తెలుగు అర్ధమైతే కొట్టి వెళ్లేవాడని చురకలేశారు. తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ‘జై తెలంగాణ’ అనే పదాన్ని విస్మరించిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. మతతత్వం గురించి మాట్లాడుతున్న నేతలు హిందూ దేవుళ్లను, మతాన్ని కించపరిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని, అది మతతత్వం కాదా? అని ప్రశ్నించారు. మోదీని తిట్టడానికి, బీజేపీని విమర్శించడానికే బీఆర్ఎస్ సభ పెట్టారే తప్ప తెలంగాణలో చేసిన అభివ్రుద్ధి ఏమీ లేదన్నారు. తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ అని, ఆయన పుట్టినరోజు నాడు సెక్రటేరియట్ ను ప్రారంభిస్తుండటంపట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ జయంతి నాడు కొత్త సచివాలయాన్ని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఈరోజు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి భండారి శాంతికుమార్, దిల్లీలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో బీఆర్ఎస్ సభ, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ మాట్లాడారు. .. బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ పేరుతో కేసీఆర్ నిర్వహించిన ‘‘ప్రీ రిలీజ్ ఫంక్షన్’’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డబ్బులిచ్చి, బెదిరించి ప్రజలను తీసుకొచ్చి సభను సక్సెస్ చేసేందుకు విఫలయత్నం చేశారు. .అని బండి సంజయ్ అన్నారు.