రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగా పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జల్లాల్లో మండల స్థాయిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని, అందుకు అరవై లక్షల మంది పార్టీ శ్రేణులను చైతన్యపర్చేలా విస్తృత కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగానే ఆత్మీయ సమ్మేళనాలను చేపడుతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్ధేశం చేసింది. ప్రజాప్రతినిధులంతా వీలైనంతవరకు ప్రజల్లో ఉండడంతోపాటు పార్టీలో ఐక్యతారాగం వినిపించాలన్నదే పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. క్రిందిస్థాయి కార్యకర్తనుంచి రాష్ట్రస్థాయి నాయకులందరిమధ్య ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చాలన్నదే ఈ సమ్మేళనంలోని ముఖ్య ఉద్దేశంకూడా.
అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరివారు కాకుండా పార్టీలోని అన్ని క్యాడర్‌ల వారిని, అంటే ఎంపీలు, ఎంఎల్యేలు, ఎంఎల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు , జిల్లా పరిషత్ చైర్మన్ లు డీసీసీబీ, డీసీఎంఎస్‌లు, జడ్‌పిటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లలాంటి ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్థాయిలోని పార్టీ ప్రతినిధులందరిని కలుపుకుని కార్యక్రమాన్ని నిర్వహించడమే ఈ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యంగా పార్టీ పేర్కొంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా వివిధ జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు ఈ సమ్మేళనాలు బహిరంగ వేదికలుగా మారాయి. ఎన్నికలకు ముందు పార్టీని చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బిఆర్‌ఎస్‌కు ఇదిప్పుడు ఇబ్బందికరంగా మారింది. పార్టీలో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తల మధ్య మరింత అఘాతాన్ని పెంచినట్లైంది. మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య పొసగకపోవడం, ఎంఎల్‌ఏలకు ఎంఎల్సీల మధ్య కార్యకర్తలు నలిగిపోతుండడం, స్థానిక ఎంఎల్యేలకు సర్పంచ్‌లాంటి స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య మరింత దూరం పెరగడంలాంటి సంఘటనలనేకం ఈ సమ్మేళనాల కారణంగా వెలుగు చూస్తున్నాయి.
సమ్మేళనానికి తమను ఆహ్వానించలేదనో, తమకు తెలియకుండానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనో, ఆహ్వాన పత్రంలో తమ పేరులేదనో, ఫ్లెక్సీలో తమ ఫోటో లేదనో అలకబూనుతున్నవారు కొందరుకాగా, వారి అనుయాయులు ఆంద•ళన బాట పడుతున్నారు. అలాంటివారిలో జిల్లా పరిషత్ చైర్మన్ లు,ఎంపీపీలేకాదు, డోర్నకల్ ఎంఎల్యే రెడ్యానాయక్ అనుచరవర్గం ఉంది. మరికొన్ని చోట్ల నాయకులను కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఎంతోకాలంగా పార్టీ జండా మోస్తున్న తమను పార్టీ పట్టించుకోవడంలేదని, తమకు గుర్తింపే లేకుండా పోయిందని ఆవేశపడుతుండగా, మరికొందరు అలిగి కార్యక్రమానికే హాజరుకానివారున్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ను, రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తమను కలుపుకు పోవడంలేదని కార్యకర్తలు నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక చోటని కాకుండా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి పాలమూరు జిల్లా, జోగిలాంబ గద్వాల జిల్లా , మెదక్ జిల్లా ఇలా ప్రతీ జిల్లాలో అంతర్ఘత విభేదాలు బయటికి వొస్తున్నాయి. వర్గాలుగా విడిపోతున్నారు.
ఏ వర్గం వారు ఆ వర్గంగా కార్యక్రమాలకు ఉపక్రమిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్లెక్సీల్లో పేరులేకపోవడంతో కొందరు ఆలిగిపోతుండగా వారిని బుజ్జగించే ప్రయత్నంచేస్తున్నారు, ఇది కేవలం జిల్లాలకే పరిమితం కాదు రాష్ట్ర రాజధాని ప్రాంతంలోకూడా ఇదే వైఖరి కనిపిస్తున్నది. దాదాపు ప్రతీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు గ్రూపులు విడిపోయారు. నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ క్యాడర్ ఆయోమయంలో పడిపోతున్నది. ముఖ్యనేతలు, ద్వితీయ నేతలని, పార్టీలో మొదటినుండి ఉన్నవారని, ఇతర పార్టీలనుండి వొచ్చినవారని ఇలా విభజన కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరి ఆదేశాలు పాటించాలి, ఎవరు చెప్పిన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నది వారికి అంతుబట్టకుండా పోతోంది. వీరందరినీ సమన్వయం చేసేందుకు పార్టీ అధిష్టానం తీవ్రంగా కృషిచేస్తున్నప్ప•కీ• అంతగా ఫలితాన్నిస్తున్నట్లులేదు.
రానున్న ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికట్ కేటాయిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనకూడా పార్టీ వర్గాల్లో కొంత ఆలజడి లేపింది. చాలాకాలంగా టికట్‌పై ఆశపెట్టుకుని నియోజకవర్గాన్ని పట్టుకుని, ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకున్న తమ పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్న నాయకులు కొందరు ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటుంటే, ఇంకొందరు తాజా ఎంఎల్యేలతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇష్టపడడంలేదు. మొత్తంమీద పార్టీ శ్రేణులను ఐక్యం చేయాల్సిన ఆత్మీయ సమ్మేళనాలు క్యాడర్ మధ్య అంతరం పెంచేదిగానే ఉందన్న భావన వినిపిస్తున్నది. ఇదిలా ఉంటే వాస్తవంగా ఈ నెల 27వరకు ఈ కార్యక్రమాలను కొనసాగించాలని బిఆర్‌ఎస్ భావించింది. కాని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని మరి కొన్ని రోజులపాటు దీన్ని కొనసాగించాలని పార్టీ నిశ్చయించింది. అంటే వొచ్చే నెల అనగా మే చివరి నాటివరకు దీన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు ఈ అసంతృప్తులను పార్టీ ఎలా తృప్తిపరుస్తుందో చూడాలిమరి.