Take a fresh look at your lifestyle.

తొలి తరానికి ఊపిరి, మలి తరానికి మార్గదర్శి!….

“బాధిత ప్రజానీకం గళం ఎత్తినప్పుడు విద్యావంతులు కలం పట్టాలనే విశ్వాసంతో తెలంగాణలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలపై ‘‘తెలంగాణలో ఏం జరుగుతుంది’’, ‘‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌’’  ‌మరియు ‘తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం నిజానిజాలు’ అన్న 3 పుస్తకాలు రాశారు. ఉద్యమ చైతన్య వ్యాప్తికి, భావ వ్యాప్తికి అద్భుతమైన పునాది వేసి ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా పార్టీలు, జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండా….పదవులకు హోదాలకు లొంగక, జాతి అభివృద్ధిలోనే తన మనుగడను చూసుకున్న   ఏ స్వార్థం ఎరుగని మహనీయుడు. నిధులు, నీళ్లు, నియామకాలలో మన వాటా మనకు రావాలని జీవిత ఆద్యంతము పోరాటం చేసిన పోరాట సూర్యుడు. అనుకున్న ఆశయం సాధించినప్పుడు భౌతికంగా సార్‌ ‌లేకపోవడం విషాదకరం. సార్‌ ఎటువంటి తెలంగాణ నిర్మాణం జరుగాలని ఆశించినారో ఆ విధంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తే అదే ఆయనకు నిజమైన నివాళి. అప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యం… లేనట్లయితే తెలంగాణ ప్రజల గోస వొడువని ముచ్చటగానే మిగులుతుంది.”

తెలంగాణ రాష్ట్ర సాధనకు 60 ఏళ్లుగా నిస్వార్థమైన అలుపెరుగని పోరాటాన్ని సల్పిన తెలంగాణ ఉద్యమ జ్యోతి, మూడు తరాలకు వారసుడు, ఉద్యమాల ఉపాధ్యాయుడు, తెలంగాణ వాదం కేవలం రాజకీయ నినాదం కాదు దానికి బలమైన ఆర్థిక సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉన్నదని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలంగాణ ఉద్యమం తొణకదని, తన బలం తన బలహీనత తెలంగాణ అని, తెలంగాణ వెనుకబాటుతనం తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమ పాఠాలు చెప్పిన మాస్టారు, తనకంటూ కుటుంబ జీవితం లేకున్నా తెలంగాణ ప్రజల అందరి జీవితాల గురించి ఆలోచించిన మహనీయుడు, త్యాగ జీవి, తొలితరం ఉద్యమానికి ఊపిరి, మలితరం ఉద్యమానికి మార్గదర్శి, దార్శనికుడు తెలంగాణకు జీవం పోసిన సజీవ సాక్షి, ఉద్యమ భాగస్వామి ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ‌సార్‌ ‌పుట్టినరోజు పండుగ. పుట్టినరోజు పండుగే అందరికీ… మరి పుటింది ఎందుకో తెలిసేది ఎందరికి అని ఓ సినీ కవి అన్నట్లు…పుట్టుక తనది, చావు తనది, బ్రతుకంత తెలంగాణదని, తనకోసం కాదు పరుల కోసం బ్రతకాలని, తానున్నా లేకున్నా తన పేరు ప్రజల హృదయాలలో నిలిపిన చిరస్మరణీయుడు. సార్‌ ‌జన్మదినం సందర్భంగా తెలంగాణతో పెనవేసుకున్న తన జీవిత విశేషాలను.ఉద్యమంను ఉర్రూతలూగించిన తీరు గురించి కొన్ని విషయాలు మననం చేసుకుందాం….ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ ‌సార్‌ ‌వరంగల్‌ ‌జిల్లా ఆత్మకూర్‌ ‌మండలం అక్కంపేట గ్రామంలో ఆగస్టు 6, 1934న మహా లక్ష్మి, లక్ష్మీ కాంతారావుల రెండవ సంతానంగా జన్మించారు, ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గులు అక్కాచెల్లెళ్లు. ప్రాథమిక విద్య నుండ డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమంలో హనుమకొండలో చదివారు. బెనారస్‌ అలీగడ్‌ ‌విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకుని, ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పూర్తి చేశారు. ఉర్దూ, తెలుగు, ఆంగ్లం హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశ నుండే తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కెరటం. తాను మర్కజీ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒకసారి అయ్యదేవర కాళేశ్వర రావు గారు వచ్చి ఈ సమావేశంలో మాట్లాడుతూ మన భాషను అవహేళన చేస్తూ ఉండడంతో వ్యతిరేకించిన ధీశాలి. అదే విధంగా తాను ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినప్పుడు ఆఫీసులో తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సాధన కోసం నిరంతరం శ్రమించిన గుండె నిబ్బరం కలిగిన ఉద్యమ నేత. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ అవతరణకు ముందే వ్యక్తపరచ బడింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు ఆ స్వేచ్ఛా ఫలాలు అందలేదు. ఆ సమయంలో నిజాం రాజు కబంధ హస్తాలలో తెలంగాణ బందీగా ఉంది. 1948వ సంవత్సరంలో పోలీస్‌ ‌యాక్షన్‌ ‌తర్వాత హైదరాబాద్‌ ‌రాష్ట్రం భారత యూనియన్లో కలిసింది. 1948 నుండి 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ ‌రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన సివిల్‌ అడ్మినిస్ట్రేటర్స్ ‌పాలనలో ఉన్నది. ఆ సమయంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి అనేకమంది ఆంధ్రులు ఉద్యోగాల కొరకు తెలంగాణ ప్రాంతానికి రావడం, బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన సంస్కర్తలుగా ప్రవర్తించడంతో వారికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు 1952లో నాన్‌ ‌ముల్కీ ఉద్యమం చేపట్టినారు. జయశంకర్‌ ‌సార్‌ ‌కూడా ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అనేక మంది యువకులు విద్యార్థులు పోలీసు కాల్పుల్లో మరణించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో భాగంగా జస్టిస్‌ ‌ఫజల్‌ అలీ అధ్యక్షతన హెచ్‌ఎన్‌ ‌కుంజ్రూ, కె ఎం ఫణిక్కర్‌లు సభ్యులుగా 1954లో ఫజల్‌ అలీ కమిషన్‌ ‌పేరిట హైదరాబాద్‌ ‌రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ఒంటరిగానే కమిషన్‌ ‌ముందు హాజరై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరిన ధైర్యవంతుడు.

ఆంధ్రా నాయకులు ఒత్తిడితో మార్చి 5, 1956న అప్పటి ప్రధాని జవహర్లాల్‌ ‌నెహ్రూ నిజామాబాద్‌లో భారతసేవక్‌ ‌సమాజ్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇష్టం లేకున్నా విశాలాంధ్ర స్థాపనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. అందుకే ఆయన ఒక అమాయకురాలి (తెలంగాణ) పెండ్లి ఒక తుంటరి పిల్లవాడితో(ఆంధ్ర) జరగనున్నది. కలిసి ఉండే వీలు లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చునని నెహ్రూ అన్నట్లు మన పెద్దసారు పలు బహిరంగ సభల్లో అప్పటి వాస్తవ విషయాన్ని వివరించి మోసపూరితమైన కుట్రలతో ఏ విధంగా విశాలాంధ్ర స్థాపన జరిగిందో తెలిపేవారు. ఆంధ్ర తెలంగాణ పేరు పెడతామని చెప్పి ఆంధ్ర ప్రదేశ్‌గా నామకరణం చేశారు. ఈ రాష్ట్ర స్థాపన బేషరతుగా జరగలేదని తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం జరిగిందనే విషయాన్ని తొలగించుటకు మొదటి ఒడంబడిక పెద్దమనుషుల ఒప్పందం తీసుకువచ్చారు. కానీ ఆంధప్రదేశ్‌ అవతరణ మొదటిరోజు ఏర్పడిన మంత్రివర్గంలో ఆంధ్రా వ్యక్తి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కావడం మూలంగా తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉప ముఖ్యమంత్రిమంత్రి కావాల్సి ఉండగా అలా జరగలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఆరవ వేలితో సమానమని సంజీవరెడ్డి అన్నట్లు…పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏ విధంగా ఉల్లంఘించారో జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఒక దశాబ్ద కాలం నష్టపోయిన తెలంగాణ ప్రజలు 1968- 69లో ఉద్యమానికి పూనుకున్నారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు పాల్గొనడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అఖిలపక్ష ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఉద్యోగులందరినీ తొలగించి వాటి స్థానంలో స్థానికులను నియమించాలని తప్పుడు ముల్కీ సర్టిఫికేట్లపై విచారణ జరిపించాలని ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిని దామోదరం సంజీవయ్య వ్యతిరేకించడంతో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కోర్టుకు వెళ్లడంతో ముల్కీ నిబంధనలు రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తమకు న్యాయం జరగదనే అభిప్రాయంతో ఉద్యమం ఊపందుకుని 1969 మార్చిలో ఎ.మదన్‌ ‌మోహన్‌ అధ్యక్షతన తెలంగాణ ప్రజల సదస్సు జరిగింది. ఇదే తెలంగాణ ప్రజా సమితిగా మారి ఉద్యమం ఉధృతంగా సమ్మెలు, బంద్‌లు, ఆందోళనలు నిరసనలు నిత్యం జరుగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు కాల్పులు జరపగా 370 మంది విద్యార్థులు యువకులు అమరులైనారు. ఆ సమయంలో ఒకరోజు సిటీ కాలేజీ హైదరాబాద్‌లో జరిగే నిరసన కార్యక్రమానికి జయశంకర్‌ ‌సార్‌ ‌వెళ్లాల్సి ఉండే. కానీ తాను ప్రయాణించిన బస్సు భువనగిరి వద్ద పంక్చర్‌ ‌కావడంతో వెళ్లేసరికి కార్యక్రమం పూర్తై కాల్పులు జరపగా విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ సారు ‘నేను ఆరోజు అక్కడికి చేరుకుంటే చనిపోయే వాడిని, ఇంతకాలం తెలంగాణ దుస్థితిని చూసేవాడిని కాదు కదా’ అని బాధపడే వారట. అంటే తెలంగాణ ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఎంత అభిమానం, ఆప్యాయత కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలా జరిగి ఉంటే మనకి తెలంగాణ వచ్చేది కాదు అనుకుంటా.

ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ ప్రజా సమితి నాయకత్వం మర్రి చెన్నారెడ్డికి అప్పగించడం జరిగిందని ఆయన నాయకత్వంలో ఉద్యమం నిర్వీర్యం అయిందని, నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సార్‌ ‌బోధించే వారు. తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకం, పంచ సూత్ర పథకంలను తీసుకవచ్చినా ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించలేకపోయారని తెలియపరిచే వారు. 1972 లో ముల్కీనిబంధనలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీమ్‌కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముల్కీ నిబంధనలు రద్దు చేయాలని తెలంగాణ ప్రాంతపు ప్రజలు ఆంధ్రా వాళ్లతో కలిసి ఉండాలని, లేకపోతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. తెలంగాణకు నష్టం కలిగించే అవకాశం ఉంటే సమైక్యతా రాగం, తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉంటే వేర్పాటువాదాలను బలపరిచేవారు. ఫలితంగా ఆరు సూత్రాల పథకం ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి అననుకూలంగా, ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఉన్న అంశాలన్నీ శీఘ్రంగా అమలు పరిచే వారిని రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారని సార్‌ అవగాహన కలిగించే వారు. జోనల్‌ ‌వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ఏర్పాటు చేయగా స్థానికులు స్థానికేతరులు అయ్యారని, స్థానికేతరులు స్థానికులు అయ్యారని ఈ విధంగా తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైందో నిరంతర అధ్యయనం చేస్తూ ప్రతి అంశంలో తెలంగాణ బడ్జెట్‌ ‌కేటాయింపులు అన్ని భద్రపరిచి మలిదశ ఉద్యమంలో తెలంగాణ పెద్దన్న లాగా నాయకులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా మచ్చుకు కొన్నింటిని గురించి తెలుసుకుందాం. నీటిపారుదల రంగంలో చూస్తే తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతం 79% కృష్ణా నది పరివాహక ప్రాంతం 60 9.5 శాతం కాగా బచావత్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ప్రకారం 811 టీఎంసీల నికర జలాలలో 70 శాతం సాగు భూమికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో 15 శాతం నీరు, కోస్తా ఆంధ్రకు 47.9 శాతం, రాయలసీమకు 17.84% అందుతుందని వివరించి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తేట తెల్లం చేశారు. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం ప్రధానమైనది. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వలన చిన్న నీటి పారుదల సౌకర్యాల కల్పనలో, రుణ పరపతిలో వివక్ష వల్ల వ్యవసాయ రంగం సంక్షోభానికి దారితీసి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం కోసం చస్తున్నారని అవహేళన చేశారని, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో 15 సంవత్సరాల స్థిరనివాసం ఉండాలనే ముల్కీ నిబంధనలను మార్చివేసి నాలుగు సంవత్సరాలు ఉంటే సరిపోతుందని, దాని ప్రకారం అక్రమంగా 22 వేల ఉద్యోగాలు కట్టబెట్టడం జరగడంతో దానిని సవరించుటకు జీవో 36, జీవో 610తీసుకొచ్చినా వాటిని అమలు పరచక పోవడం ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ఉల్లంఘనలు చోటుచేసుకున్న ఈ విషయాలను గురించి తెలియపరిచారు. అదేవిధంగా ప్రాథమిక విద్యలో, ఉన్నత విద్యలో, యూనివర్సిటీల స్థాపనలో తెలంగాణ పట్ల చూపిన వివక్షతను గణాంకాలు సహాయంతో ఆయన వివరించేవారు.

పారిశ్రామిక రంగానికి వస్తే 1931లో స్థాపించిన వరంగల్‌ ఆజంజాహి మిల్స్ ఆసియా ఖండంలోని అతి పెద్ద బట్టల మిల్లని, 1937లో నిజాంబాద్‌ ‌జిల్లా బోధన్‌లో స్థాపించిన నిజాం షుగర్‌ ‌ఫ్యాక్టరీ కూడా ఆసియా ఖండంలోనే పెద్దది, ఆల్విన్‌ ‌మెటల్స్, ‌ఫిరంగుల ఫ్యాక్టరీ, 12 పాలశీతలీకరణ కేంద్రాలు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వంటివి ఆంధ్ర పాలకవర్గాల వివక్షాపూరిత విధానం వల్ల మూసివేయబడ్డాయని జయశంకర్‌ ‌సార్‌ ‌కళ్ళకు కట్టినట్టు తెలియపరిచి తెలంగాణ ప్రజలను చైతన్య పరిచే వారు. తొలి, మలి ఉద్యమాల సంది కాలంలో ఒంటరిగా నైనా తెలంగాణ ప్రాంతమంతటా తిరుగుతూ అతి తక్కువ సభ్యులున్న మీటింగ్‌లో సైతం పాల్గొని తెలంగాణవాదులను సమాయత్తం చేసేవారు. ఎందుకంటే తాలూకాకు ఐదుగురు లేక ఆరుగురు అన్న తెలంగాణ వాదులు తయారై ఉండాలని, తెలంగాణ వాదం సజీవంగా ఉండాలని నిర్విరామ కృషి చేశారు. 1997లో మహబూబాబాదులో నిర్వహించిన మీటింగ్‌లో నేను కూడా పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ ‌పట్ల అవగాహన పొంది ఆ స్ఫూర్తితో మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. నాలాగా స్ఫూర్తి పొందినవారు వేలాదిగా ఉండడంవల్ల ఉద్యమం తీవ్రతరమైంది. 1996 ఆగస్టు 15న ఆనాటి ప్రధాని దేవేగౌడ ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ మూడు రాష్ట్రాల ఏర్పాటు ప్రకటనతో తెలంగాణవాదులను తట్టి లేపింది. దాని ఫలితమే నవంబర్‌ 1‌న వరంగల్‌లో విద్రోహ దినం పేరిట జరిగిన సభకు నలుమూలల నుండి జనం కదిలి రావడంతో సార్‌ అద్భుత ప్రసంగం చేసి చైతన్యాన్ని రగిలించిన డంతో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది.

బాధిత ప్రజానీకము గళం ఎత్తినప్పుడు విద్యావంతులు కలం పట్టాలనే విశ్వాసంతో తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అక్రమాలపై ‘‘తెలంగాణలో ఏం జరుగుతుంది’’, ‘‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌’’ ‌మరియు ‘తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం నిజానిజాలు’ అన్న 3 పుస్తకాలు రాశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించగా సిద్ధాంత కర్తగా అండగా ఉండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఖండాంతరాలకు వ్యాపింప చేయడంలో ఆయన చేసిన కృషి సాటిలేనిది. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ ‌న్యాయమైన కోరిక అని 94 పార్టీల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కెసిఆర్‌ ‌గారి నిరాహార దీక్ష ఫలితంగా డిసెంబర్‌ 9, 2009 ‌ప్రకటన రావడానికి కారకుడైనాడు. కానీ అది అమలు కాకపోవడంతో తీవ్రంగా బాధ పడ్డారు. అటు తర్వాత సార్‌ ‌క్యాన్సర్‌ ‌బారిన పడి జూన్‌ 21, 2011‌న కల సాకారం కాకముందే కన్నుమూయడం తీరని లోటుగా భావించాలి. ఉద్యమ చైతన్య వ్యాప్తికి, భావ వ్యాప్తికి అద్భుతమైన పునాది వేసి ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యంగా పార్టీలు, జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండా…. పదవులకు హోదాలకు లొంగక, జాతి అభివృద్ధి లోనే తన మనుగడను చూసుకున్న ఏ స్వార్థం ఎరుగని మహనీయుడు. నిధులు, నీళ్లు, నియామకాలలో మన వాటా మనకు రావాలని జీవిత ఆద్యంతము పోరాటం చేసిన పోరాట సూర్యుడు. అనుకున్న ఆశయం సాధించినప్పుడు భౌతికంగా సార్‌ ‌లేకపోవడం విషాదకరం. సార్‌ ఎటువంటి తెలంగాణ నిర్మాణం జరుగాలని ఆశించినారో ఆ విధంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తే అదే నిజమైన నివాళి. అప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యం…లేనట్లయితే తెలంగాణ ప్రజల గోస వొడువని ముచ్చటగానే మిగులుతుంది.

tadam sadhanandham
తండ సదానందం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,అమనగల్‌, ‌మహబూబాబాద్‌

Leave a Reply